Mysore Masala Dosa: సాధారణ దోశ కంటే మైసూర్ మసాలా దోశకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దోశ లోపల పూసే ఘాటైన ఎర్రటి చట్నీ, నోరూరించే ఆలుగడ్డ మసాలా దీనికి అసలైన రుచిని ఇస్తాయి. కర్ణాటక స్పెషల్ వంటకమైన ఈ దోశను ఇంట్లోనే పర్ఫెక్ట్‌గా, క్రిస్పీగా ఎలా తయారు చేయాలో తెలియక చాలా మంది హోటల్స్‌పై ఆధారపడుతుంటారు. కానీ సరైన కొలతలు, చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే మనం కూడా ఇంట్లోనే అద్భుతమైన మైసూర్ మసాలా దోశను సిద్ధం చేయవచ్చు. ఆ తయారీ విధానం ఇప్పుడు తెలుసుకుందాం.
1. దోశ పిండి తయారీ:
మంచి క్రిస్పీ దోశ రావాలంటే బియ్యం, మినప్పప్పు కొలత ముఖ్యం. 3 కప్పుల బియ్యానికి, 1 కప్పు మినప్పప్పు, 1 చెంచా మెంతులు, పావు కప్పు శనగపప్పు (రంగు కోసం), అర కప్పు అటుకులు కలిపి నానబెట్టాలి. వీటిని మెత్తగా గ్రైండ్ చేసి 8 గంటల పాటు పులియబెట్టాలి. వేసే ముందు తగినంత ఉప్పు, చిటికెడు పంచదార (మంచి ఎరుపు రంగు కోసం) కలపాలి.
2. ఎర్రటి కారం చట్నీ:
ఇదే మైసూర్ దోశకు అసలైన రుచిని ఇస్తుంది.
కావాల్సినవి: ఎండుమిర్చి (నానబెట్టినవి), వెల్లుల్లి రెబ్బలు, ఉల్లిపాయ ముక్కలు, పుట్నాల పప్పు, కొద్దిగా చింతపండు, ఉప్పు.
తయారీ విధానం: వీటన్నింటినీ మిక్సీలో వేసి తక్కువ నీటితో మెత్తని పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ చట్నీ కొంచెం ఘాటుగా ఉంటేనే దోశ రుచిగా ఉంటుంది.
3. ఆలుగడ్డ మసాలా:
విధానం: ఉడికించిన ఆలుగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా చేసుకోవాలి. బాణలిలో నూనె వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. అందులోనే ఉల్లిపాయ ముక్కలు, పసపు వేసి మగ్గనివ్వాలి. చివరగా ఆలుగడ్డ ముక్కలు, ఉప్పు, కొత్తిమీర వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి.
4. దోశ వేసే విధానం:
స్టవ్ మీద దోశ పెనం పెట్టి బాగా వేడి చేయాలి. పెనం వేడయ్యాక కొద్దిగా నీళ్లు చిలకరించి తుడిచేయాలి (దీనివల్ల దోశ అంటుకోదు). ఒక గరిటెడు పిండి తీసుకుని పల్చగా, గుండ్రంగా రుద్దాలి. దోశ కొంచెం వేగుతున్నప్పుడు ఒక చెంచా వెన్న లేదా నెయ్యి వేయాలి. మైసూర్ దోశకు వెన్న వేస్తేనే అసలైన రుచి వస్తుంది. ఇప్పుడు తయారుచేసి పెట్టుకున్న ఎర్రటి చట్నీని ఒక చెంచా తీసుకుని దోశ అంతా సమానంగా పూయాలి. మధ్యలో రెండు చెంచాల ఆలుగడ్డ మసాలా పెట్టి, దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చి క్రిస్పీగా మారే వరకు ఉంచాలి. దోశను మడిచి ప్లేట్‌లోకి తీసుకోవాలి.
Also Read: వెజిటేరియన్ చేపల కూర.. శనగపిండి ముక్కలతో అదిరిపోయే టేస్ట్, ట్రై చేస్తే ఫిదా అవ్వాల్సిందే!
ముఖ్యమైన చిట్కాలు:
క్రిస్పీనెస్ కోసం: పిండిలో కొద్దిగా బొంబాయి రవ్వ కలిపితే దోశ మరింత మొరుమొరులాడుతూ వస్తుంది.
వెన్న: నూనె కంటే వెన్న వాడితే హోటల్ రుచి వస్తుంది.
సెగ: దోశ వేసేటప్పుడు మంట మీడియంగా ఉండాలి. అప్పుడే చట్నీ మాడిపోకుండా దోశ బాగా వేగుతుంది.