Arjun Son of Vyjayanthi Review : ‘బింబిసార’ తర్వాత కళ్యాణ్ రామ్ ‘అమిగోస్’ ‘డెవిల్’ వంటి 2 ప్లాపులు ఇచ్చాడు. ఈసారి ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ అనే మాస్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. లేడీ అమితాబ్ విజయశాంతి ఈ సినిమాలో కీలక పాత్ర చేయడంతో ప్రత్యేక ఆకర్షణను సంతరించుకుంది. మరి సినిమా ప్రేక్షకులను అలరించే విధంగా ఉందో లేదో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
వైజయంతి(విజయశాంతి) ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ఒకసారి ఆమె రిస్కీ ఆపరేషన్లో ఉన్నప్పుడు బుల్లెట్ గాయమై ఊబిలో పడిపోతుంది. అదే టైంలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ఆమె కొడుకు అర్జున్(కళ్యాణ్ రామ్) వస్తాడు. ఊబిలో పడిపోయిన ఆమె ఆచూకీ అతను కనిపెట్టడం వల్ల వైజయంతి బ్రతికి బయటపడుతుంది. అతనికి తల్లి అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి ఆమె ఎలాంటి రిస్కీ ఆపరేషన్లో ఉన్నా లెక్కచేయకుండా.. ఆమె పుట్టినరోజుని సెలబ్రేట్ చేస్తూ ఉంటాడు.
అయితే ఇతని తండ్రి విశ్వనాధ్ ను ఓ రౌడీ షీటర్ సముద్రంలోకి తోసి చంపేస్తాడు. దీంతో అతని తల్లి వైజయంతి ఆ రౌడీ షీటర్ ను చట్టపరంగా శిక్షించాలని అనుకుంటుంది. మరోపక్క తన కొడుకుని తనలానే ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ని చేయాలనేది ఆమె లక్ష్యం. అయితే పరిస్థితులు అర్జున్ ను హంతకుడిని చేస్తాయి. కొంతమంది జాలర్లు నివసించే పేటలోని జనాలను దారుణంగా వేధిస్తున్న రౌడీ షీటర్ ను ఎదుర్కొని అర్జున్ వాళ్లకి దేవుడవుతాడు. కానీ తన తల్లి దృష్టిలో హంతకుడు అవుతాడు? చివరికి ఈ తల్లీ కొడుకులు కలిశారా? చివర్లో తల్లి కోసం కొడుకు చేసిన త్యాగం ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
గతంలో నారా రోహిత్ తో ‘రాజా చెయ్యి వేస్తే’ అనే యాక్షన్ సినిమా తీసిన ప్రదీప్ చిలుకూరి ఈ సినిమాకి దర్శకుడు. వాస్తవానికి ఆ సినిమా కంటెంట్ బాగానే ఉంటుంది కానీ డైరెక్షన్ వీక్. అందుకే ఇతని మళ్ళీ మెగా ఫోన్ పట్టుకోవడానికి 9 ఏళ్ళు టైం పట్టింది. అయినా మంచి ఆఫర్ దక్కించుకున్నాడు. ఇక ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ కథ పరంగా చాలా రొటీన్ గా ఉంటుంది. కథనంలో చాలా వరకు మనం అంచనా వేసేలానే ఉంటుంది. అయితే ఎమోషన్ ఫ్యామిలీ ఆడియన్స్ కి మాస్ ఆడియన్స్ కి కనెక్ట్ అయ్యే అవకాశం ఉంది.
ఎంత రొటీన్ అయినప్పటికీ ఈ మధ్య కాలంలో ఇలా చివరి వరకు ఎంగేజ్ చేసిన సినిమా ఒక్కటి కూడా రాలేదు. జనాలు కూడా ఓ మంచి మాస్ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. వాళ్ళని చివరి ఎంగేజ్ చేసే సినిమాగా ఇది ఉంటుంది. కానీ క్లైమాక్స్ లో ఓ డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. తెలుగు సినిమాల్లో హీరోతో అలాంటి ప్రయాగాలు చేసి సక్సెస్ అయిన దర్శకులు ఎక్కువమంది లేరు.
అయితే కళ్యాణ్ రామ్ స్టార్ హీరో కాదు కాబట్టి.. ఏమైనా ఆ డేరింగ్ క్లైమాక్స్ తో కనెక్ట్ అవుతారేమో చూడాలి. నిర్మాతలు సినిమా కోసం బాగానే ఖర్చుపెట్టారు. పాటలు ఎక్కువ పెట్టకుండా మంచి పని చేశారు. పెట్టి ఉంటే… సినిమా మూడ్ డిస్టర్బ్ అయ్యే ప్రమాదం ఉండేది.
నటీనటుల విషయానికి వస్తే.. కళ్యాణ్ రామ్ కి కొంత మాస్ ఫాలోయింగ్ కూడా ఉంది. అందుకే అతని నుండి యాక్షన్ సినిమాలు కూడా వస్తున్నాయి. ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ లాంటి ఎమోషనల్ డ్రామా ఇప్పటివరకు అతను చేయలేదు. ఈ సినిమా క్లైమాక్స్ ను అతను యాక్సెప్ట్ చేయడం అనేది అతని గట్స్ కి చిహ్నంగా మనం చెప్పుకోవచ్చు.
విజయశాంతి తల్లి పాత్రలో ఒదిగిపోయింది. కళ్యాణ్ రామ్ – విజయశాంతి మధ్య వచ్చే సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఉంటాయి. హీరోయిన్ సాయి మంజ్రేకర్ పాత్ర చెప్పుకునే రేంజ్లో ఏమీ ఉండదు. రెగ్యులర్ తెలుగు హీరోయిన్ పాత్రే. బబ్లూ పృథ్వీరాజ్, శ్రీకాంత్.. ఇద్దరికీ కూడా మంచి పాత్రలు దొరికాయి. మిగతా తారాగణం పెద్దగా గుర్తుండదు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
క్లైమాక్స్
కళ్యాణ్ రామ్, విజయశాంతి..ల మధ్య వచ్చే సన్నివేశాలు
క్రిస్పీ రన్ టైం
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
బ్యాక్ గ్రౌండ్ స్కోర్లో మాస్ అప్పీల్ లేకపోవడం
మొత్తంగా… ‘అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి’ మాస్ ఆడియన్స్ ని చివరి వరకు ఎంగేజ్ చేసే సినిమా అయినప్పటికీ.. వాళ్ళు క్లైమాక్స్ ను ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు అనేదానిపైనే బాక్సాఫీస్ రిజల్ట్ ఆధారపడి ఉంటుంది. ఏ అంచనాలు లేకుండా వెళ్ళే రెగ్యులర్ ఆడియన్స్ అయితే.. ఒకసారి కచ్చితంగా థియేటర్లలో ట్రై చేయొచ్చు.
Arjun Son of Vyjayanthi Telugu Movie Rating / 2.25/5