రివ్యూ : ‘సోలో బాయ్’ మూవీ
నటీనటులు : గౌతమ్ కృష్ణ, రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి, పోసాని కృష్ణ మురళి, అనిత చౌదరి తదితరులు
దర్శకత్వం : పి. నవీన్ కుమార్
నిర్మాత : సెవెన్ హిల్స్ సతీష్ (సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్)
సంగీతం : జుడా సంధి
సినిమాటోగ్రఫీ : త్రిలోక్ సిద్దు
Solo Boy Movie Review : బిగ్‌బాస్ సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ డెబ్యూ మూవీ ‘సోలో బాయ్’. ఈ యూత్ ఫుల్ ఫ్యామిలీ డ్రామాలో రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి హీరోయిన్లుగా నటించారు. నవీన్ కుమార్ దర్శకత్వం వహించిన ఈ మూవీని సెవెన్ హిల్స్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై సతీష్ నిర్మించారు. తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
మధ్య తరగతి ఫ్యామిలీలో పుట్టిన కృష్ణమూర్తిని తల్లిదండ్రులు ఎంతగానో కష్టపడి చదివిస్తారు. ఇంజినీరింగ్ చదువుతూ ప్రియ అనే రిచ్ అమ్మాయిని ప్రేమించగా… ఆమె కృష్ణమూర్తిని అవమానించి, బ్రేకప్ చెప్పి వదిలేస్తుంది. దీంతో దేవదాసుగా మారిపోయిన కృష్ణ జీవితంలోకి శృతి అనే అమ్మాయి అడుగు పెడుతుంది. ఈ బ్రేకప్ నుంచి బయటపడి ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి మిలియనీర్ గా ఎలా మారాడు? ప్రాణంగా ప్రేమించిన శృతి అతనికి ఎందుకు విడాకులు ఇచ్చింది? కృష్ణ రైతులకు ఎలా ఉపయోగపడ్డాడు? అనే విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
మధ్యతరగతి లైఫ్ కష్టాలు, కలలు, బాధ్యతలను తెరపై బాగానే చూపించారు. దర్శకుడు యూత్ కు కనెక్ట్ అయ్యే విధంగా బ్రేకప్ తో పాటు, ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే రైతుల సమస్యలు, టెక్ సొల్యూషన్స్ ద్వారా వారికి సహాయం చేయడం వంటి సోషల్ మెసేజ్ ఉన్న అంశాలతో కథను నడిపించారు. కానీ కథ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ, కొత్తదనం లేకపోవడంతో రొటీన్ స్టోరీలా అన్పిస్తుంది. బ్రేకప్ నుండి కోలుకుని జీవితంలో కొత్త లక్ష్యాన్ని చేరుకోవడం అనే థీమ్ గతంలో చాలా సినిమాల్లో చూసినదే. ఇక కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్లు అనిపిస్తాయి. ఇది సినిమా రిథమ్‌ను దెబ్బతీస్తుంది.
గౌతమ్ కృష్ణ తన బిగ్‌బాస్ ఇమేజ్‌ను ఉపయోగించుకుని, ఒక సామాన్య యువకుడి పాత్రలో సహజంగా నటించాడు. అతని భావోద్వేగ సన్నివేశాలు, ముఖ్యంగా రైతు సంబంధిత సీన్స్ హార్ట్ టచింగ్ గా ఉన్నాయి. రమ్య పసుపులేటి, శ్వేత అవస్థి పాత్రలు ఆకర్షణీయంగా ఉన్నప్పటికీ… వారికి తగిన స్క్రీన్ టైమ్ లేకపోవడం ఒక లోపం. పోసాని కృష్ణ మురళి కామెడీ, భావోద్వేగ సన్నివేశాలు సినిమాకు బలాన్ని ఇచ్చాయి. జుడా సంధి సంగీతం బాగుంది. ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కథను ఎలివేట్ చేస్తుంది. త్రిలోక్ సిద్దు సినిమాటోగ్రఫీ గ్రామీణ నేపథ్యాన్ని, మధ్యతరగతి జీవితాన్ని అందంగా తెరపై చూపించింది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ స్మూత్‌గా ఉంది. సినిమాను తక్కువ బడ్జెట్‌తో తీశారన్న విషయం కొన్ని సన్నివేశాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రొడక్షన్ వాల్యూస్ గ్రాండ్‌గా లేకపోవడం వల్ల థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇంపాక్ట్ కొంత తగ్గుతుంది.
ప్లస్ పాయింట్స్
నటన
టెక్నికల్ టీం
మైనస్ పాయింట్స్
నిర్మాణ విలువలు
హీరోయిన్ల స్క్రీన్ స్పేస్
రొటీన్ స్టోరీ
మొత్తంగా
అంచనాలు లేకుండా చూస్తే ఆకట్టుకునే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్.
Solo Boy Movie Rating : 2/5