రివ్యూ : బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్ సీజన్ 1
విడుదల తేదీ : మే 2, 2025
దర్శకుడు : పుష్కర్ సునీల్ మహాబల్
నటీనటులు : మయూర్ మోరే, పలక్ జైస్వాల్, తిగ్మాన్షు ధూలియా, దేవేన్ భోజని, ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్, హక్కీమ్ షాజహాన్, అనంత్ జోగ్, కమలేష్ సావంత్
జానర్ : క్రైమ్ థ్రిల్లర్, మాక్యుమెంటరీ, డ్రామా
వ్యవధి: 6 ఎపిసోడ్‌లు (36-48 నిమిషాలు)
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ : సోనీ లివ్
Black White & Gray – Love Kills Review : ‘కోటా ఫ్యాక్టరీ’తో పాపులర్ అయిన మయూర్ మోర్ నటించిన క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్’. మే 2న ఈ సిరీస్ సోనీ లివ్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో విడుదలైంది. ఆర్థికంగా పేద నేపథ్యం నుండి వచ్చిన యువకుడితో ముడిపడి ఉన్న వరుస హత్యలను దర్యాప్తు చేసే జర్నలిస్ట్ కథ ఇది. మరి ఈ సిరీస్ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ :
‘బ్లాక్, వైట్ & గ్రే – లవ్ కిల్స్’ మాక్యుమెంటరీ స్టైల్ లో తీసిన హిందీ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. నాగ్‌పూర్‌లో జరిగిన వరుస హత్యల చుట్టూ తిరిగే కథ ఇది. బ్రిటిష్ జర్నలిస్ట్ డేనియల్ గ్రే (ఎడ్వర్డ్ సోనెన్‌బ్లిక్ వాయిస్‌తో) ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఇందులో పేద యువకుడు (మయూర్ మోరే), ఒక రాజకీయ నాయకుడి కూతురు (పలక్ జైస్వాల్) మధ్య ప్రేమ, అవినీతి, సామాజిక అసమానతలు వంటి అంశాలు ఉన్నాయి. కథ డాక్యుమెంటరీ స్టైల్ లో ఇంటర్వ్యూలు, రీఎనాక్ట్‌మెంట్‌లు, రా ఫుటేజ్‌తో సాగుతుంది.
కథ ఒక హైవే ధాబా దగ్గర ప్రారంభమవుతుంది. అక్కడ మేనేజర్ సీరియల్ కిల్లర్ గురించి చెబుతాడు. రాజకీయ నాయకుడి డ్రైవర్ కొడుకు ఆ కిల్లర్. అతనే రాజకీయ నాయకుడి కూతురు సహా నలుగురిని చంపినట్లు ఆరోపణలు ఎదుర్కొంటాడు. డేనియల్ గ్రే అనే జర్నలిస్ట్… పోలీసులు, స్నేహితులు, కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూల ద్వారా సత్యాన్ని వెలికితీసే ప్రయత్నం చేస్తాడు. అందులో భాగంగా అవినీతి, మీడియా సంచలనం, సామాజిక ఒత్తిళ్లను బయట పెడతాడు. సిరీస్ ఒక అమాయక ప్రేమ కథగా ప్రారంభమై, విషాదకరమైన మలుపులతో ముగుస్తుంది. అసలు ఆ డ్రైవరు కొడుకు నిజంగానే నలుగురిని చంపాడా ? ఒకవేళ చంపితే ఎందుకు చంపాల్సి వచ్చింది? సిరీస్ లో ఉండే ట్విస్ట్ లు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం కావాలంటే సిరీస్ ను ఓటీటీలో చూడాల్సిందే.
విశ్లేషణ:
సిరీస్ డాక్యుమెంటరీ స్టైల్ లో ఉండడం అన్నది ఇంటర్వ్యూలు, రీఎనాక్ట్‌మెంట్‌లు కథను వాస్తవానికి దగ్గరగా చేసి చూపించింది. అంతేకాదు ఇందులో చాలా సీన్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయి. సామాజిక ఒత్తిళ్ల వల్ల ఓ ప్రేమ కథ ఎలా విషాదంగా మారిందో చూడవచ్చు. ప్రతి ఎపిసోడ్ ఒక ట్విస్ట్ తో పూర్తవ్వడం అన్నది నెక్స్ట్ ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది. స్క్రీన్ ప్లే బాగుంది. కానీ మధ్యలో వచ్చే కొన్ని ఎపిసోడ్‌లలో కథ కొంత నెమ్మదిగా సాగుతుంది. ఇది కొంతమంది ప్రేక్షకులకు సిరీస్ పై ఆసక్తిని తగ్గించవచ్చు. కొన్ని సహాయక పాత్రలు (ఉదాహరణకు కమలేష్ సావంత్ పోలీస్ పాత్ర) మరింత డెప్త్ ఉంటే బాగుండేది. క్లైమాక్స్ పవర్ ఫుల్ గా ఉన్నప్పటికీ, స్పష్టమైన సమాధానాలను ఇవ్వకుండా ముగించడం ఆడియన్స్ ను నిరాశ పరిచే ఛాన్స్ ఉంది. నాన్-లీనియర్ కథనం కొంతమంది ప్రేక్షకులకు గందరగోళానికి గురి చేయొచ్చు.
మయూర్ మోరే సున్నితమైన, ఇంటెన్స్ రోల్ లో అద్భుతంగా నటించాడు. పలక్ జైస్వాల్ ఒక రాజకీయ నాయకుడి కూతురిగా, ఇంట్లో వాళ్ళు పట్టించుకోని అమ్మాయిగా ఆకట్టుకుంది. దేవేన్ భోజని, తిగ్మాన్షు ధూలియా (ఆఫీసర్ చౌహాన్), హక్కీమ్ షాజహాన్ (టాక్సీ డ్రైవర్ సన్నీ), అనంత్ జోగ్ (నియంత్రణ తండ్రి) తదితరులు తమ పాత్రలలో బాగా రాణించారు. సాయి భోపే సినిమాటోగ్రఫీ బాగుంది. మేఘదీప్ బోస్ నేపథ్య సంగీతం ఉత్కంఠను పెంచుతుంది.
పాజిటివ్ పాయింట్స్
మాక్యుమెంటరీ స్టైల్
సినిమాటోగ్రఫీ
సంగీతం
స్క్రీన్‌ప్లే
నెగెటివ్ పాయింట్స్
కొన్ని ఎపిసోడ్ లు స్లోగా సాగడం
క్లైమాక్స్
చివరగా
ఈ సిరీస్ SonyLIVలో హిందీలో స్ట్రీమింగ్ అవుతోంది, క్రైమ్ థ్రిల్లర్, సామాజిక సమస్యలపై ఆలోచనాత్మక కథలను ఇష్టపడితే ఈ వీకెండ్ కు మంచి సిరీస్ దొరికినట్టే. కానీ స్పష్టమైన ముగింపు లేకపోవడం కొంతమందికి నిరాశ కలిగించవచ్చు. లైట్ ఎంటర్‌టైన్‌మెంట్ కోరుకునే వారి సహనానికి మాత్రం పరీక్షే.
Black White & Gray – Love Kills Rating : 1.5/5