Court Movie Review : హీరో నాని నిర్మాతగా కూడా తన అభిరుచి చాటుకునే సినిమాలు చేస్తూ అందరి ప్రశంసలు అందుకుంటున్న సంగతి కొత్తదేమీ కాదు. మంచి కథ దొరికితే యువ హీరోలతో నిర్మించడానికి నాని ముందు వరుసలో ఉంటున్నారు. ‘అ!’ ‘హిట్’ వంటివి వేటికవే ప్రత్యేకమైనవి. ఇప్పుడు ‘కోర్ట్’ అనే సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో ప్రియదర్శి హీరో. మార్చి 14 న విడుదల కానుంది. అయితే రెండు రోజుల ముందే ప్రీమియర్స్ వేశారు. మరి ఈ సినిమా ప్రేక్షకులను మెచ్చుకునే విధంగా ఉందో? లేదో? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
చంద్రశేఖర్(హర్ష్ రోషన్) వయసు 19 ఏళ్ళు. అతను ఓ మైనర్ అమ్మాయి జాబిలి(శ్రీదేవి ఆపళ్ళ) ని ప్రేమిస్తాడు. ఆమెకు మేనమామ అయినటువంటి మంగపతికి(శివాజీ) చాదస్తం బాగా ఎక్కువ. తమ ఇంటి ఆడపిల్లలే తన పరువు అనుకుంటాడు. పిల్లలు స్లీవ్ లెస్ డ్రెస్సులు వేసుకుంటే తమ పరువు పోతుంది అని భావించి కుటుంబ సభ్యులను తిట్టిపోసే రకం. అంతేకాదు తమ ఇంటి ఆడపిల్లలతో బయట అబ్బాయిలు ముఖ్యంగా పేద ఇంటికి చెందిన అబ్బాయిలు మాట్లాడుతున్నారు అని తెలిసినా తట్టుకోలేక వాళ్ళ కుటుంబ సభ్యులపై తప్పుడు కేసులు పెట్టి అరెస్ట్ అయ్యేలా చేస్తుంటాడు.
అలాంటి వ్యక్తికి చంద్రశేఖర్,జాబిలి వ్యవహారం తెలిస్తే ఊరుకుంటాడా? అందరూ ఊహించినట్టే.. చంద్రశేఖర్ పై ఫోక్సో వంటి కనికరం లేని కేసులు పెట్టి అరెస్ట్ చేయించి అతని కుటుంబాన్ని వేధిస్తూ ఉంటాడు. రెండు రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అనుకున్న టైంలో తేజ(ప్రియదర్శి) ఈ కేసుని టేకప్ చేస్తాడు. ఎన్నో ప్రతికూల పరిస్థితుల నడుమ అతను ఈ కేసుని ఎలా వాదించాడు? చంద్రశేఖర్ నిర్దోషి అని ఎలా నిరూపించగలిగాడు? అనే ప్రశ్నలకి సమాధానం మిగిలిన సినిమా.
విశ్లేషణ :
దర్శకుడు రామ్ జగదీశ్ ‘కోర్ట్’ కథ ఏంటి? అన్నది ట్రైలర్లోనే చెప్పేశాడు. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా మంగపతి స్వభావం ఎలాంటిది? అతను తన ఇంటి ఆడపిల్లల విషయంలో ఎలా ఆలోచిస్తాడు? అసలు చందూ, జాబిలి ఇతని కంట్లో ఎలా పడతారు? అనే అంశాల చుట్టూనే డిజైన్ చేసుకున్నాడు. తేజ కేసుని టేకప్ చేయడంతో ఇంటర్వెల్ కార్డు పడుతుంది. ఈ క్రమంలో వచ్చే లవ్ స్టోరీ నిబ్బా, నిబ్బిలా ట్రాక్ మాదిరి అనిపిస్తుంది. ఒక దశలో వాళ్ళపై కోపం కూడా వస్తుంది. మంగపతే వీళ్ళకి కరెక్ట్ అనే ఫీలింగ్ కలుగుతుంది. మరోపక్క 19 ఏళ్ళ కుర్రాడిగా కనిపించిన హర్ష్ పై కూడా ఆడియన్స్ ఎటువంటి సింపతీ కలగదు.
అలాగే అతనిపై ఆపొనెంట్ లాయర్ పెట్టే కేసులు.. వాటిని అతను వాదించే విధానం.. అన్నీ సాదా సీదాగానే అనిపిస్తాయి. హీరో వీటిని ఇలా సాల్వ్ చేసేయొచ్చు అనే ఆలోచన కూడా మైండ్లోకి వచ్చేస్తుంది. అలాంటప్పుడు సెకండాఫ్ పై ఆసక్తి ఎలా కలుగుతుంది. కానీ ఇక్కడ దర్శకుడికి వేరే ఆప్షన్ లేదు. కోర్టులో ప్రియదర్శి కేసుని ఎలా వాదిస్తాడు అనే లైన్ పైనే సెకండాఫ్ మొదలవుతుంది. ఈ క్రమంలో ఆపొనెంట్ లాయర్ ఓ మెలిక పెడతాడు. అది సాల్వ్ చేయలేనిది అని హీరో కూడా చేతులెత్తేసి వెళ్ళిపోతాడు.
సరిగ్గా ఇదే సినిమాకి హైలెట్ అయ్యింది. చివరి 40 నిమిషాలు దర్శకుడు బాగా రాసుకున్నాడు. అందువల్ల కొంచెం ఎక్కువ మార్కులతో సినిమా పాసైపోతుంది. టెక్నికల్ గా కథకి ఎంత అవసరమో వాటినే నిర్మాతలైన నాని, ప్రశాంతి సమకూర్చారు. అవి ఎక్కడా లోటు అనిపించవు. అంతకు మించి అవసరం లేదు కూడా.
నటీనటుల విషయానికి వస్తే.. ఈ విభాగంలో మంగపతి రోల్ చేసిన శివాజీకి ఎక్కువ మార్కులు పడతాయి. అతని రోల్ ని ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఆ పాత్రని ముగించిన విధానం అంతగా ఆకట్టుకోదు. రోహిణి పాత్ర సాధాసీదాగా ఉంటుంది. సురభి ప్రభావతి చాలా బాగా నటించారు. శివాజీ తర్వాత ఎక్కువ మార్కులు ఈమెకే పడతాయి. శుభలేఖ సుధాకర్, వడ్లమాని శ్రీనివాసరావు ప్యాడింగ్ ఆర్టిస్టులుగా మిగిలిపోయారు. హర్ష్ రోషన్, ఆపళ్ళ బాగానే చేశారు.
ప్లస్ పాయింట్స్ :
శివాజీ పెర్ఫార్మన్స్
కోర్ట్ సీన్స్
క్లైమాక్స్
మైనస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్ లో వచ్చే లవ్ ట్రాక్
మొత్తంగా.. ‘కోర్ట్’ ….. ‘జై భీమ్’ అంత గొప్ప సినిమా కాదు. కానీ పర్వాలేదు అనిపిస్తుంది. ఓటీటీకి ఇది పర్ఫెక్ట్ సినిమా. థియేటర్లలో టికెట్లు తెగే రేంజ్లో అయితే కాదు. మరి బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి
Court Telugu Movie Rating – 2.75 / 5