Dragon Movie Review: ‘లవ్ టుడే’ తో తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. తమిళంలో రిలీజ్ అయ్యి హిట్ టాక్ తెచ్చుకున్న కొద్దిరోజుల తర్వాత తెలుగులో రిలీజ్ అయిన ఆ సినిమా ఇక్కడ కూడా మంచి విజయాన్ని అందుకుంది. దీంతో అతని నెక్స్ట్ మూవీ ‘ది రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ ను ఏకకాలంలో తమిళ్ తో పాటు తెలుగులో కూడా రిలీజ్ చేశారు. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ‘లవ్ టుడే’ రేంజ్లో ఆకట్టుకుందా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ : రాఘవన్(ప్రదీప్ రంగనాథన్) టాప్ స్టూడెంట్. ఇంటర్మీడియట్ వరకు సూపర్ గా చదువుతాడు. 96 శాతంతో పాసవుతాడు. కానీ తర్వాత అతనికి కొత్త ఆశలు పుట్టుకొస్తాయి. తాను కోరుకుంటే ఏ అమ్మాయి అయినా లవ్ చేస్తుంది అనే ఆలోచన అతనికి పుట్టుకొస్తుంది. దీంతో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేస్తాడు. కానీ ఆ అమ్మాయి.. నాకు నీలా పుస్తకాల పురుగు వద్దు.. బ్యాడ్ బాయ్ అయితేనే కంఫర్ట్ అని చెబుతుంది. దీంతో అమ్మాయిలకి బ్యాడ్ బాయ్స్ అంటేనే ఇష్టమని భావించి అతను కూడా బ్యాడ్ బాయ్..లా మారిపోతాడు. ఈ క్రమంలో బీటెక్ లో అతను 40 కి పైగా బ్యాక్ లాగ్స్ తో వెనుక పడతాడు. అలాంటి టైంలో కీర్తి(అనుపమ పరమేశ్వరన్) ని చూసి ఆమెను ప్రేమిస్తాడు. కానీ ఆమె ‘నీలాంటి బేవార్స్ గాడితో లవ్ ఏంటి?’ అంటూ అతన్ని అవమానిస్తుంది. దీంతో అతను ఫేక్ సర్టిఫికెట్లు తెచ్చుకుని పెద్ద కంపెనీలో జాబ్ కొడతాడు. ఆ తర్వాత పల్లవి(కాయదు లోహార్) అనే పెద్ద బిజినెస్ మెన్ కూతురితో పెళ్లి సెట్ అవుతుంది. పెళ్లి సమయం దగ్గరపడుతోంది అనుకున్న టైంలో రాఘవన్ కి అతని కాలేజీ ప్రిన్సిపాల్ పెద్ద షాకిస్తాడు.దీంతో అతని జాబ్ పోయి… పెళ్లి ఆగిపోయే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగిలిన సినిమా.
విశ్లేషణ : ‘లవ్ టుడే’ వంటి యూత్ ఫుల్ కంటెంట్ తో తమిళ ప్రేక్షకులను మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులను కూడా అమితంగా ఆకట్టుకున్నాడు ప్రదీప్ రంగనాథన్. వాస్తవానికి అందులో కథ ఏమీ ఉండదు. ప్రేమికులు తమ ఫోన్లు మార్చుకుంటే.. ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది? అనే చిన్న లైన్ తో సినిమాని ఎంటర్టైనింగ్ గా మలిచాడు. వాస్తవానికి కథ లేకపోయినా స్క్రీన్ ప్లేతో మ్యాజిక్ చేయడమే కష్టం. అందులో ప్రదీప్ కి పట్టు ఉంది. అంతకు ముందు చేసిన ‘కోమాలి’ లో కూడా అదే హైలెట్ అయ్యింది. కానీ ‘రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్’ కి అతను దర్శకుడు కాదు. ‘ఓ మై కడవులే’ ‘ఓరి దేవుడా’ వంటి సినిమాలు తీసిన అస్వత్ మారిముత్తు దీన్ని డైరెక్ట్ చేశాడు. అయినప్పటికీ ఇందులో అతని మార్క్ మాత్రమే కాదు ప్రదీప్ రంగనాథన్ మార్క్ కూడా కనిపించింది. ఫస్ట్ హాఫ్ సాదా సీదాగా ఉన్నప్పటికీ.. సెకండాఫ్ లో మంచి ఫన్ ఉంది. క్లైమాక్స్ కూడా వర్కౌట్ అయ్యింది. స్క్రీన్ ప్లే టైం పాస్ చేయించే విధంగానే ఉంది అని చెప్పాలి. డైరెక్షన్, డైలాగ్స్, కామెడీ అన్ని కరెక్ట్ మీటర్లో ఉన్నాయి.
నటీనటుల విషయానికి వస్తే.. ప్రదీప్ రంగనాథన్ మరోసారి తన ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో కట్టిపడేశాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ మధ్య సెలెక్ట్ చేసుకుంటున్న పాత్రలు కూడా బాగుంటున్నాయి. ఇందులో కూడా ఆమె లుక్స్ ఆకట్టుకుంటాయి. శ్రీవిష్ణుతో ‘అల్లూరి’ అనే సినిమాలో హీరోయిన్ గా చేసిన కాయదు లోహార్ ఇందులో ఓ హీరోయిన్ గా చేసింది. ఆమె లుక్స్ ఇందులో బాగా ఆకట్టుకున్నాయి. సీనియర్ దర్శకుడు కె.ఎస్.రవికుమార్, గౌతమ్ మీనన్ లు కూడా తమ మార్క్ నటనతో ఆకట్టుకున్నారు. మిస్కిన్ వంటి మాగతా తారాగణం కూడా బాగానే ఆకట్టుకుంటుంది.
ప్లస్ పాయింట్స్ :
ప్రదీప్ రంగనాథన్
అనుపమ పరమేశ్వరన్
కామెడీ
సెకండాఫ్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
ఫస్ట్ హాఫ్ లో అక్కడక్కడా ల్యాగ్ ఉండటం
మొత్తంగా ఈ ‘రిటర్న్ ఆఫ్ డ్రాగన్’ లో యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్స్ ఉన్నాయి. వీకెండ్ కి టైం పాస్ కోసం ఒకసారి ఈ సినిమాని ట్రై చేయొచ్చు
రేటింగ్ : 2.75/5