Jaat Movie Review : టాలీవుడ్ దర్శకుడు గోపీచంద్ మలినేని బాలీవుడ్ డెబ్యూ మూవీగా ‘జాట్’ రూపొందింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి మలినేని బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించి హిట్టు కొట్టాడా? లేదా? అనేది ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ..
మోటుపల్లి అనే ఊరు. అక్కడ రాణాతుగా(రణదీప్ హుడా) అనే రాక్షసుడు ఉంటాడు. ఆ ఊరు జనాలతో పాటు చుట్టుపక్కల ఉన్న 10 ఊర్ల జనాలను అతను చిత్ర హింసలకు గురిచేసి తరిమేస్తుంటాడు. ఎదురుతిరిగిన ప్రతి ఒక్కరినీ క్రూరంగా చంపేస్తూ ఉంటాడు.ఆధారాలతో అతన్ని అరెస్ట్ చేయడానికి ఏ మగ పోలీస్ అతని గుమ్మం తొక్కడు. కొంతమంది లేడీ పోలీసులు వెళ్తే.. వాళ్లపై అత్యాచారం చేసి తీవ్రంగా వేధిస్తూ ఉంటుంది అతని భార్య భారతి(రెజీనా). ఈ క్రమంలో వేరే ఊరుకి వెళ్తూ.. ట్రైన్ మధ్యలో ఆగిపోవడంతో అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్తాడు జాట్ అలియాస్ బ్రిగేడియర్ బల్బీర్ ప్రతాప్ సింగ్(సన్నీ డియోల్). ఇంతలో రాణతూగా మనుషులు అక్కడికి వచ్చి.. అతను తింటున్న టిఫిన్ ను నేలపాలు చేస్తారు. దీంతో జాట్ కి కోపం వస్తుంది. సారి చెప్పమని అడుగుతాడు. కానీ విలన్ మనుషులు ఇతనికి ఎదురుగా వస్తారు. అందరినీ కొట్టుకుంటూ విలన్ ఇంటికి వెళ్తాడు హీరో. ఆ తర్వాత ఏమైంది? అసలు రాణతూగా ఊర్లో జనాలని ఎందుకు తరిమికొడుతున్నాడు. జాట్ ఎవరు? అతని బ్యాక్ గ్రౌండ్ ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ..
దర్శకుడు గోపీచంద్ మలినేని సినిమాల్లోని కథలు ఏమీ కొత్తగా ఉండవు. కథనం కూడా ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. కానీ ఫస్ట్ సీన్ నుండి లాస్ట్ సీన్ వరకు అతను మాస్ ఆడియన్స్ ను టార్గెట్ చేసుకునే సన్నివేశాలు రాసుకుంటాడు. ‘జాట్’ కి కూడా అతను ఇదే చేశాడు. ఇలాంటి కథ తెలుగులో మళ్ళీ తీస్తే.. ఇతనిపై ఓ రేంజ్లో ట్రోలింగ్ జరుగుతుంది. కానీ నార్త్ జనాలకి ఇలాంటి కథలు అంటే ఈ మధ్య తెగ నచ్చేస్తున్నాయి. సో వాళ్ళని ఇంప్రెస్ చేయడనికి మలినేని కొత్తగా ఏమీ చేయనవసరం లేదు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా చేసినట్టు కూడా లేదు అని ప్రతి సన్నివేశం చెబుతుంది. రొటీన్ గా అనిపించినా ఫస్ట్ హాఫ్ బాగానే ఎంగేజ్ చేసింది. కానీ సెకండాఫ్ కి వచ్చేసరికి తేడా కొట్టేసింది. హీరోయిజం కంటే విలన్ రూపంలో మలినేని సైకోయిజం ఎక్కువైపోయింది. రెండు, మూడు సీన్లకి తలలు నరకడం.. బుల్లెట్లు దింపడం, ఆడవాళ్ళ బట్టలు ఊడదీయడం. అటు తిప్పి ఇటు తిప్పి ఇవే సీన్లు. అయితే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో తమన్ రక్తికట్టించాడు. హీరో ఎలివేషన్ సీన్స్ కి అందరూ ఊగిపోయేలాగా కొట్టాడు. ఆ ట్యూన్లు కొత్తగా ఏమీ అనిపించవు. కానీ సింక్ అయ్యాయి అంతే. పాటలు అయితే ఒక్కటి కూడా గుర్తుండదు. ఫోన్ మాట్లాడటానికి బయటకి వెళ్ళడానికి స్కోప్ ఇచ్చినట్టు ఉన్నాయి. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ బాగుంది. నిర్మాతలైన మైత్రి వారు బాగానే ఖర్చు పెట్టారు.
నటీనటుల విషయానికి వస్తే.. సన్నీ డియోల్ కి అక్కడ ఎలాంటి మాస్ ఇమేజ్ ఉందో అందరికీ తెలుసు. వాళ్ళని రంజింప జేసే విధంగా యాక్షన్ సీన్లు అయితే డిజైన్ చేశారు. కానీ ఆ సీన్స్ లో నటించడానికి సన్నీ బాగా కష్టపడ్డాడు. సరిగ్గా నిలబలేకపోతున్నట్టు క్లియర్ గా తెలుస్తుంది. కదలడానికి, ఉరకడానికి అయితే అతను ఎంత కష్టపడ్డాడో ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తుంది. కొన్ని సీన్లు చూస్తే.. అవి మన బాలయ్యకి అయితే భలే ఉంటాయి కదా, అతను ఇలాంటి సీన్లు అంటే ఎంతో ఎనర్జిటిక్ గా చేసేవాడు కదా అనే బాధ కూడా వేస్తుంది. హీరోకి హీరోయిన్ లేదు. చెప్పాలంటే అదొక రిలీఫ్ ఇచ్చే పాయింట్ ఇక్కడ. విలన్ రణదీప్ హుడాకి క్రాక్ లో కటారి కృష్ణ డ్రెస్సులు వేశారు. అతని భార్యగా చేసిన రెజీనాకి అదే క్రాక్ సినిమాలో జయమ్మ డ్రెస్సు తగిలించారు. అంతకు మించి వీళ్ళకి అట్రాక్షన్ ఏమీ లేదు. చెప్పాలంటే వీళ్ళకంటే సముద్రఖని, వరలక్ష్మి ఇంకా బాగా సెట్ అయ్యేవారు అనిపిస్తుంది. సినిమాలో చాలా మంది తెలుగు నటీనటులు ఉన్నారు. అజయ్ ఘోష్, జగపతి బాబు బాబు, రమ్య కృష్ణ, రచ్చ రవి.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా లిస్ట్ ఉంది. కానీ ఈ హిందీ సినిమాలో వాళ్ళు కొత్తగా చేసింది ఏమీ లేదు.
ప్లస్ పాయింట్స్ :
ఫస్ట్ హాఫ్
ఎలివేషన్ సీన్స్
బ్యాక్ గ్రౌండ్ స్కోర్
మైనస్ పాయింట్స్ :
రొటీన్ కథ
సెకండాఫ్ లో వచ్చే సాగదీత
పాటలు
వయొలెన్స్
మొత్తంగా… ‘జాట్’ హిందీ వాళ్ళు యూట్యూబ్లో చూసి ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది. టికెట్ పెట్టి థియేటర్ కి వెళ్లే రేంజ్లో అయితే ఇది ఉండదు. తెలుగు ప్రేక్షకులు సెకండాఫ్ స్టార్ట్ అయిన పావు గంటకే బయటకి వెళ్ళిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదు.
రేటింగ్ : 2/5