రివ్యూ : మండల మర్డర్స్ సిరీస్
దర్శకులు : గోపి పుత్రన్, మనన్ రావత్
నటీనటులు : వాణి కపూర్ (రియా థామస్), వైభవ్ రాజ్ గుప్తా (విక్రమ్ సింగ్), సుర్వీన్ చావ్లా (అనన్య భరద్వాజ్), శ్రియా పిల్గాంకర్ (రుక్మిణి), జమీల్ ఖాన్ (జిమ్మీ ఖాన్), రఘుబీర్ యాదవ్
జానర్ : క్రైమ్ థ్రిల్లర్, మిథాలజీ, సైకలాజికల్ డ్రామా
ఎపిసోడ్‌లు : 8 (ఒక్కో ఎపిసోడ్ సుమారు 40-50 నిమిషాలు)
ఓటీటీ ప్లాట్‌ఫామ్ : Netflix
Mandala Murders series review in Telugu : నెట్‌ఫ్లిక్స్ తాజా హిందీ ఒరిజినల్ సిరీస్ ‘మండల మర్డర్స్’ ఈ శుక్రవారం ఓటీటీలోకి అడుగు పెట్టింది. ‘మర్దానీ 2’ దర్శకుడు గోపీ పుత్రన్ రూపొందించిన ఈ సిరీస్ లో క్రైమ్ థ్రిల్లర్, మిథాలజీ, సైకలాజికల్ డ్రామా వంటి జానర్లను మిక్స్ చేసి ప్రేక్షకులను థ్రిల్ చేయాలనుకున్నారు. మరి ఆ ప్రయత్నం సఫలం అయ్యిందా? సిరీస్ ఎంత వరకు ఆకట్టుకుంది? అనేది రివ్యూలో చూద్దాం.
కథ
మండల మర్డర్స్ ఉత్తరప్రదేశ్‌లోని చరందాస్‌పూర్‌లో జరిగే క్రైమ్ థ్రిల్లర్ సిరీస్. కథ రియా థామస్ (వాణి కపూర్) అనే పోలీస్ ఆఫీసర్, సస్పెండెడ్ ఢిల్లీ పోలీస్ ఆఫీసర్ విక్రమ్ సింగ్ (వైభవ్ రాజ్ గుప్తా) చుట్టూ తిరుగుతుంది. వీరు ఆయస్త మండల అనే శతాబ్దాల నాటి రహస్య సంఘంతో సంబంధం కలిగిన రిటువలిస్టిక్ హత్యల కేసును పరిష్కరించడానికి కలిసి పని చేస్తారు.
1952లో చరందాస్‌పూర్‌లోని వరుణ అడవిలో ఆయస్తీలు, రుక్మిణి (శ్రియా పిల్గాంకర్) నాయకత్వంలో ఒక రిటువల్‌ను పూర్తి చేయడంలో విఫలమవడంతో కథ ప్రారంభమవుతుంది. ఈ రిటువల్ ద్వారా యస్త్ అనే దేవతకు పునర్జన్మను ఇవ్వడానికి, విశ్వ శక్తిని నియంత్రించే ఆయస్త యంత్రాన్ని సృష్టించడానికి ట్రై చేస్తారు. దీనికి నరబలి అవసరం.
ప్రస్తుత కాలంలో విక్రమ్ సింగ్ తన తల్లి అదృశ్యం, తమ్ముడి మరణం వంటి గత ట్రామాతో చరందాస్‌పూర్‌కు తిరిగి వస్తాడు. అదే సమయంలో అభిషేక్ సహాయ్ (ఆకాష్ దహియా) అనే ఫోటోగ్రాఫర్ హత్య జరుగుతుంది. అతని శరీరం మిస్సైన పార్ట్ రియా థామస్‌ను ఈ కేసును దర్యాప్తు చేయడానికి రప్పిస్తుంది.
రియాను ఒక చిన్న అమ్మాయి గుండెలో గాయంతో కనిపించే దృశ్యాలు సతమతం చేస్తూ ఉంటాయి. అయినప్పటికీ విక్రమ్‌తో కలిసి హత్యల వెనుక రహస్యాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది. హత్యలు ఆయస్త మండల సంఘంతో ముడిపడి ఉన్నాయని, “వర్దాన్” (బూన్) ఇవ్వడానికి ఒక యంత్రాన్ని ఉపయోగిస్తాయని, దీనికి శరీర భాగాలు (అంగుష్టం, చేతులు, కాళ్లు, ముఖం, గుండె) అవసరమని తెలుస్తుంది. మరి చివరికి ఈ కేసు ఎలాంటి మలుపు తిరిగింది? పొలిటికల్ లీడర్ అనన్య భరద్వాజ్ (సుర్వీన్ చావ్లా), జిమ్మీ ఖాన్ (జమీల్ ఖాన్)లకు ఈ కేసుతో సంబంధం ఏంటి? యస్త్ దేవత పునర్జన్మ ఎత్తిందా లేదా? అనేది సిరీస్ ను చూసి తెలుసుకోవాల్సిందే.
విశ్లేషణ
సాధారణంగా మిథాలజీ, మిస్టరీ, క్రైమ్, సైకలాజికల్ జానర్లలో ఓటీటీలో వచ్చే సినిమాలు, సిరీస్ లకు మంచి ఫ్యాన్ బేస్ ఉంది. అయితే ఈ సిరీస్ లో మాత్రం అవన్నీ మిక్స్ చేసి కలగాపులగం చేశారు మేకర్స్. మొదటి ఎపిసోడ్‌లు సస్పెన్స్, భయంకరమైన సన్నివేశాలతో (అబిషేక్ హత్య, యాదవ్ సోదరుల మరణం) ప్రేక్షకులను ఆకర్షిస్తాయి. కానీ ఆ తరువాత వచ్చే సాగదీత ఎపిసోడ్లు ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్ష. టైమ్‌లైన్‌లు, పాత్రలు గందరగోళాన్ని సృష్టిస్తాయి. రిటువలిస్టిక్ హత్యల కలయిక క్రైమ్ థ్రిల్లర్ జానర్‌కు కొత్త ఒరవడిని ఇస్తుంది.
ఆయస్త యంత్రం, శరీర భాగాల డిమాండ్ వంటి సీన్లు భయంకరంగా, ఆసక్తికరంగా ఉన్నాయి. అయితే మిథాలజీ, క్రైమ్ డ్రామా మధ్య బ్యాలెన్స్ తప్పింది కథ. క్లైమాక్స్ గ్రిప్పింగ్ గా ఉన్నప్పటికీ అసంపూర్తిగా అన్పిస్తుంది. సినిమాటోగ్రఫీ (సందీప్ యాదవ్, షాజ్ మహ్మద్), ఆర్ట్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైన్ బాగున్నాయి. వాణి కపూర్ తప్ప మిగతా ప్రధాన నటులంతా బాగా నటించారు. వాణి కపూర్ యాక్టింగ్ ఓటీటీ డెబ్యూలో కూడా ప్రేక్షకులను మెప్పించలేకపోవడం దారుణం. నిర్మాణ విలువలు బాగున్నాయి. డబ్బింగ్ అక్కడక్కడా ఇబ్బంది పెడుతుంది.
ప్లస్ పాయింట్స్
విజువల్స్
టెక్నికల్ అంశాలు
నటీనటులు
మైనస్ పాయింట్స్
సాగదీసిన ఎపిసోడ్స్
వాణి కపూర్
మొత్తానికి
క్రైమ్ థ్రిల్లర్, మిథాలజీ కాంబోలో సిరీస్ ను చూడాలనే ఇంట్రెస్ట్ ఉంటే… అంచనాలు లేకుండా ఓసారి చూడొచ్చు.
Mandala Murders series Rating : 2/5