Retro Movie Review : ‘కంగువా’ అనే పాన్ ఇండియా సినిమాతో నిరాశ పరిచిన తమిళ హీరో సూర్య… తాజాగా ‘రెట్రో’ అనే రొమాంటిక్ యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ తమిళ రొమాంటిక్ యాక్షన్ థ్రిల్లర్ ను కార్తీక్ సుబ్బరాజ్ డైరెక్ట్ చేశారు. సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా మే 1న అంటే ఈరోజు తమిళం, తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకుందా ? మూవీ ఎలా ఉంది? అనేది రివ్యూలో తెలుసుకుందాం.
కథ
‘రెట్రో’ 1970 – 1980ల నేపథ్యంలో సాగే పీరియడ్ గ్యాంగ్‌స్టర్ డ్రామా. ఇందులో సూర్య ఒక పవర్ ఫుల్ మాజీ గ్యాంగ్‌స్టర్. ఆయన తన హింసాత్మక గతాన్ని వదిలేసి, భార్య (పూజా హెగ్డే)తో ప్రశాంతమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాడు. అయితే ఆయన గతాన్ని వదిలినా, గతం మాత్రం ఆయనను వదలదు. ఫలితంగా పాత శత్రువులు తిరిగి వస్తారు, అలాగే హీరో దాచిన రహస్యాలు బయటపడతాయి. దీంతో అతనిలోని మృగం మేల్కొంటుంది. శాంతి కోసం హీరో చేసే పోరాటం హింసాత్మక యుద్ధంగా మారుతుంది. మరి ఆ పోరాటంలో హీరో గెలిచాడా ? మాజీ గ్యాంగ్‌స్టర్ దాచిపెట్టిన సీక్రెట్స్ ఏంటి? ఆయన గతం ఏంటి? దానివల్ల హీరోయిన్ కు ఎదురైన ఇబ్బందులు ఏంటి? అనే విషయాలు తెలియాలంటే సినిమాను తెరపై చూడాల్సిందే.
విశ్లేషణ
డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ స్టైలిష్ డైరెక్షన్, క్లాప్-వర్తీ డైలాగులు, క్లైమాక్స్ సినిమాకు అతిపెద్ద బలం. ఆయన 70-80ల నేపథ్యాన్ని చక్కగా తెరపై చూపించారు. ఇది సినిమాకు ఒక నాస్టాల్జిక్ ఫీల్ ఇస్తుంది. సంతోష్ నారాయణన్ సంగీతం సినిమాకు ప్రాణం పోసింది. ‘కనిమా’ అనే పాట యూట్యూబ్‌లో ఇప్పటికే 40 మిలియన్ వ్యూస్ సాధించింది. ఇక సినిమాలో ఎమోషనల్, యాక్షన్ సన్నివేశాలలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. శ్రేయాస్ కృష్ణ సినిమాటోగ్రఫీ 70ల శైలిని అద్భుతంగా చూపించింది. షఫీక్ మొహమ్మద్ అలీ ఎడిటింగ్ సినిమాను స్మూత్‌గా, ఆకర్షణీయంగా చేసింది. అలాగే ట్రైలర్‌లోని ఆల్ఫోన్స్ పుత్రెన్ కట్ కూడా ఆకట్టుకుంది.
అయితే సినిమా కథ విమర్శకులను అసంతృప్తికి గురి చేస్తుంది. సినిమా ప్రథమార్థం నెమ్మదిగా, కొన్ని సన్నివేశాలు అనవసరంగా సాగదీసినట్టు అన్పిస్తాయి. కథలో కొన్ని సందర్భాల్లో లాజిక్ లెస్ అన్పిస్తుంది. సూర్య మునుపటి సినిమా ‘కంగువ’ నిరాశపరిచిన నేపథ్యంలో, ‘రెట్రో’పై భారీ అంచనాలు ఉన్నాయి. కానీ ఈ సినిమా కూడా అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయింది. కథలో కొత్తదనం లేకపోవడమే దీనికి కారణం.
ఇక సూర్య ఒక హింసాత్మక గ్యాంగ్‌స్టర్, ప్రేమించే భర్తగా రెండు వెరియేషన్స్ లో అద్భుతమైన నటన కనబరిచాడు. ముఖ్యంగా ఆయన నటించిన ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీక్వెన్స్‌లు ఆకట్టుకున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే టాప్-నాచ్ పెర్ఫార్మెన్స్. అలాగే పూజా హెగ్డే ఒక సాధారణ అమ్మాయి పాత్రలో మెప్పించింది. ఆమె కెమిస్ట్రీ సూర్యతో బాగా కుదిరింది. ఈ సినిమాతో ఆమెకు లాంగ్ టైమ్ తర్వాత హిట్ దక్కే అవకాశం ఉంది. ప్రకాష్ రాజ్, జోజు జార్జ్, జయరాం, నాజర్ వంటి నటులు తమ పాత్రల్లో బాగా నటించి, సినిమాకు బలమైన సపోర్ట్ ఇచ్చారు.
పాజిటివ్ పాయింట్స్
హీరో హీరోయిన్ల నటన
సంగీతం
సినిమాటోగ్రఫీ
ఎడిటింగ్
క్లైమాక్స్
నెగెటివ్ పాయింట్స్
నెమ్మదిగా సాగే కథ
స్క్రీన్ ప్లే
చివరగా…
కథలో కొత్తదనం ఆశించే వారిని నెమ్మదిగా సాగే ఈ సినిమా నిరాశ పరుస్తుంది. ‘కంగువ’ తర్వాత సూర్య నుండి ఒక బలమైన కమ్‌బ్యాక్ కోరుకునే ఫ్యాన్స్‌కు, యాక్షన్-రొమాన్స్, నాస్టాల్జిక్ సెట్టింగ్ ఇష్టపడే వారికి ఈ సినిమా నచ్చే అవకాశం ఉంది.
Retro Movie Rating : 2/5