Sri Sri Sri Rajavaru Review: జూనియర్ ఎన్టీఆర్ బావమరిది మొదటి సినిమాగా మొదలైన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’.. కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తర్వాత కిందా మీదా పడి మేకర్స్ షూటింగ్ కంప్లీట్ చేసినా… రిలీజ్ చేయడానికి 2 ఏళ్ళు కష్టపడ్డారు. మొత్తానికి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఏ మేర ఆకట్టుకుందో ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి..
కథ :
రాజా(నార్నె నితిన్) పుట్టినప్పుడు చలనం లేకుండా పుడతాడు. దీంతో చచ్చిన కొడుకు పుట్టాడు అని.. ఇతని తండ్రి(సీనియర్ నరేష్) అండ్ ఫ్యామిలీ బాధపడతారు. కానీ బాబాయ్ కాల్చే సిగరెట్ పొగ వల్ల రాజాలో చలనం వస్తుంది. దీంతో అతను బ్రతికాడని కుటుంబ సభ్యులు సంతోషిస్తూ ఉంటారు. మరోపక్క రాజా తండ్రి స్నేహితుడు(రావు రమేష్) కి నిత్య(సంపద) కూతురు పుడుతుంది. వీళ్ళు చిన్నప్పటి నుండే ఇష్టపడతారు. మరోపక్క రాజా తండ్రి అమాయకుడు. జనాలు బాగుండాలి అని ఆశపడే రకం. ఇక నిత్య తండ్రి స్వార్థపరుడు. స్నేహితుడైనా సరే తన మాటే వినాలి. తన వెనుకే ఉండాలి అనుకునే మనస్తత్వం.ఇక హీరో, హీరోయిన్ పెద్దయ్యాక పెళ్లి చేసుకోవాలని అనుకుంటారు. అందుకు పెద్దలు కూడా ఒప్పుకుంటారు. కానీ మధ్యలో రాజకీయ నాయకులు కుట్ర పన్ని ఈ కుటుంబాలని విడదీస్తారు.? అది ఎందుకు? చివరికి రాజా, నిత్య కలిశారా? రాజాకి సిగరెట్ అలవాటు వల్ల ఎదురైన సమస్యలు ఏంటి? అనే ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా.
విశ్లేషణ :
సతీష్ వేగేశ్న.. ‘శతమానం భవతి’ తో నేషనల్ అవార్డు కొట్టాక… కేవలం ఫ్యామిలీ ఎంటర్టైనర్ సినిమాలు అయితేనే చేయగలను అనుకుంటున్నాడో? లేక అవి మాత్రమే చేయగలడో? జనాలకి అర్ధం కావడం లేదు. ఇప్పుడు ట్రెండ్ మారింది. గ్రామాల్లో ఉండే కుర్రాళ్ళు కూడా ఫ్యామిలీ ఎమోషన్, ఊరు, పండుగ వంటి అంశాలతో సినిమాలు అంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. అది దర్శకుడు సతీష్ వేగేశ్న పూర్తిగా గమనించినట్టు లేడు. మరోపక్క ఎన్టీఆర్ బావమరిదితో సినిమా అన్నప్పుడు ఏదో ఒక కొత్త పాయింట్ కావాలని భావించి హీరోకి సిగరెట్ అలవాటు అనేది ఒక ఓసిడిగా చూపించాలి అనుకున్నాడు. దాని వల్ల ప్రేయసికి దూరమవ్వడం అనే థీమ్ కూడా చాలా సినిమాల్లో ఆడియన్స్ చూసినదే. దర్శకుడు మారుతి అయితే ఒకానొక టైంలో ఎక్కువగా ఇలాంటి సినిమాలే తీస్తూ వచ్చాడు. సరే కథ సంగతి ఎలా ఉన్నా.. కథనం ఏమైనా కనెక్ట్ అయ్యే విధంగా ఉందా? అంటే అదీ లేదు. ఫస్ట్ హాఫ్ లో ఇంటర్వెల్ ఎపిసోడ్ వచ్చే వరకు కథ ముందుకు కదిలిన ఫీలింగ్ కలుగదు. అప్పటివరకు హీరో సిగరెట్లు మీద సిగరెట్లు కాల్చడం… అతని సిగరెట్ అలవాటు గురించే అందరూ మాట్లాడటం.. ఆడియన్స్ కి విరక్తి తెప్పిస్తుంది. సినిమాలో రావు రమేష్ పాత్రతో ఒక డైలాగ్ చెప్పించారు. ‘వాడిని పెళ్లి చేసుకుంటే.. సినిమాకి ముందు వచ్చే రెండు గాజులు అమ్ముకోవాలి’ అంటూ చెబుతాడు రావు రమేష్. ఆడియన్స్ పరిస్థితి కూడా ఆల్మోస్ట్ అలానే ఉంటుంది అని చెప్పాలి. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ ఏవీ కూడా ఆకట్టుకోవు. మ్యూజిక్ సంగతి ఇక చెప్పనవసరం లేదు.
నటీనటుల విషయానికి వస్తే.. ‘చైన్ స్మోకర్’ లుక్ కి నార్నె నితిన్ కరెక్ట్ గా సెట్ అయ్యాడు. ఫైట్ సీన్స్ కూడా బాగున్నాడు. సంపద లుక్స్ బాగానే ఉన్నాయి. సీనియర్ నరేష్, రావు రమేష్ తన స్థాయికి తగ్గ పెర్ఫార్మన్స్ ఇచ్చారు. వారి పాత్రలకి నిండుతనం తీసుకొచ్చారు.మిగిలిన నటీనటులంతా పాడింగ్ ఆర్టిస్టుల్లా అనిపిస్తారు. ఒక్కరి ఫేస్..లు కూడా గుర్తుండవు.
ప్లస్ పాయింట్స్ :
క్యాస్టింగ్
యాక్షన్ సీన్స్
మైనస్ పాయింట్స్ :
డైరెక్షన్
రొటీన్ స్టోరీ
సెకండాఫ్
మొత్తంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ఓటీటీ కంటెంట్ కి ఎక్కువ థియేటర్ కంటెంట్ కి తక్కువ అన్నట్టు అనిపిస్తుంది. ఈ సినిమా ఎందుకు ఇంత లేట్ గా రిలీజ్ అయ్యిందో.. ప్రతి సీన్ చెబుతూనే ఉంటుంది.
రేటింగ్ : 1.5/5