Indian Railways: భారతీయ రైల్వే ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు తీసుకున్నది. ఎప్పటికప్పుడు ప్రయాణీకులకు ప్రమాదాలపై అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. అంతేకాదు, ప్రమాదాలను అరికట్టేందుకు రైల్వే ట్రాక్స్, రైల్వే స్టేషన్స్, రైళ్లలో ఫోటోలు, వీడియోలను తీసుకోవడం నిషేధించారు. అంతేకాదు, ఫుట్ బోర్డు ప్రయాణాన్ని అరికట్టడంతో పాటు రైళ్లు ఆగినప్పుడే ఎక్కాలనే నిబంధనను తీసుకొచ్చారు. అయినప్పటికీ ప్రమాదాలు తగ్గడం లేదు.
నాగర్ కోయిల్ యువతి వీడియో వైరల్
రీసెంట్ గా తమిళనాడులోని నాగర్ కోయిల్ లో వేగంగా దూసుకుపోతున్న రైలు ఫుట్ బోర్డ్ పై ఓ యువతి డ్యాన్స్ చేసిన వీడియో నెట్టింట వైరల్ అయ్యింది. అయితే, ఈ వీడియోపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు యువతిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఆ అమ్మాయి కోసం రైల్వే అధికారులు కూడా ఆరా తీశారు. ఆమెపై కేసు నమోదు చేసినట్లు ప్రకటించారు. ఈ ఘటన జరిగిన మధురై డివిజన్ లో రైళ్ల నుంచి పడి చనిపోయిన ఘటలు పెద్ద సంఖ్యలో ఉన్నట్లు రైల్వే గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
7 ఏళ్లలో 146 మంది మృతి
మధురై రైల్వే డివిజన్ లో గత 7 సంవత్సరాలలో కదులుతున్న రైళ్లలో నుంచి పడి 146 మంది మరణించారు. దక్షిణ రైల్వే టిఎన్‌ఇఇ దాఖలు చేసిన ఆర్‌టిఐ ప్రశ్నకు మధురై డివిజన్ అధికారికంగా సమాధానం ఇచ్చింది. 2015 నుంచి 2018 వరకు తమ వద్ద డేటా లేదని సమాధానం ఇచ్చింది. అయితే, 2019లో 26, 2020లో 11, 2021లో 9, 2022లో 17, 2023లో 38, 2024లో 37, 2025లో (ఏప్రిల్ వరకు) 8 మంది చనిపోయినట్లు వెల్లడించింది. మొత్తంగా గత సంవత్సరాల్లో కదులుతున్న రైళ్ల నుంచి పడి 146 మంది చనిపోయినట్లు తెలిపింది.
మధురై రైల్వే డివిజన్ గురించి..
మధురై డివిజన్ తమిళనాడు రాష్ట్రంలోని పన్నెండు జిల్లాలను, కేరళలోని ఒక జిల్లాను కవర్ చేస్తుంది. రైళ్లలో ప్రమాదవశాత్తు పడిపోవడం నివారించదగిన మరణాలు అని ఓ RPF అధికారి వెల్లడించారు. ముఖ్యంగా ప్రమాదవశాత్తు పడిపోయి చనిపోయిన ఘటనలన్నీ స్టంట్ల వల్లే జరగలేదన్నారు. ప్రయాణీకులు సురక్షితంగా ప్రయాణించడానికి రైల్వే సంస్థ అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రయాణీకులకు తగిన సూచనలను చేస్తున్నట్లు వెల్లడించారు.
Read Also: రైలు ఎక్కబోయి జారిపడ్డ ప్రయాణీకుడు, క్షణాల్లోనే..
ఫుట్ బోర్డు ప్రయాణానికి జరిమానాలు
2023-24లో మధురై డివిజన్ లో రైల్వే పోలీసులు ఫుట్‌బోర్డ్ ప్రయాణానికి 21 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. మొత్తం రూ.8,700 జరిమానా విధించినట్లు తెలిపారు. అటు 2024-25లో 148 కేసులకు పెరిగినట్లు తెలిపారు. రూ.56,900 జరిమానా వసూలు చేసినట్లు ప్రకటించారు. అటు రైలు ప్రమాదాలను తగ్గించేందుకు కీలక చర్యలు చేపడుతున్నట్లు డిఆర్‌ఎం మధురై శరద్ శ్రీవాస్తవ వెల్లడించారు. ఆర్‌పిఎఫ్, టికెట్ చెకింగ్ సిబ్బంది ప్రయాణీకులు ఫుట్ బోర్డ్ ప్రయాణం చేయకుండా తగిన చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు తీస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read Also: రన్నింగ్ ట్రైన్ లో యువతి ఓవరాక్షన్, ఫుట్ బోర్డు మీద డ్యాన్స్.. సీన్ కట్ చేస్తే!