ACE Movie Review : విజయ్ సేతుపతికి తెలుగులో కూడా క్రేజ్ ఉంది. ఈ మధ్య మళ్ళీ వరుసగా అతను హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ఈ లైనప్ లో వచ్చిన సినిమా ‘ఏస్’. మరి ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాతో అతను హిట్టు కొట్టాడా? లేదా? ఈ రివ్యూ ద్వారా తెలుసుకుందాం రండి :
కథ :
బోల్డ్ కాశీ(విజయ్ సేతుపతి) కొన్ని ప్రతికూల పరిస్థితుల కారణంగా జైలుకి వెళ్తాడు. తిరిగి వచ్చిన తర్వాత గతాన్ని మర్చిపోయి సింపుల్ గా జీవించాలని మలేషియాకి షిఫ్ట్ అవుతాడు. అక్కడ ఫ్లైట్ దిగగానే ఎయిర్‌పోర్టులో జ్ఞానం (యోగి బాబు) పరిచయమవుతారు. అతని ద్వారా కల్పన (దివ్యా పిళ్లై) హోటల్‌లో ఉద్యోగం లభిస్తుంది. అటు తర్వాత కౌలాలంపూర్ కి వెళ్లగా అక్కడ మరో అమ్మాయి రుక్మిణిని (రుక్మిణి వసంత్) చూసి తొలిచూపులోనే ప్రేమలో పడతాడు. ఆమె ఆర్ధికంగా ఇబ్బంది పడుతుంటుంది. దీంతో కాశీ గ్యాంబ్లర్ గా మారి ఆమె కష్టాలు తీర్చాలి అనుకుంటాడు. ఈ క్రమంలో ధర్మ (బీఆర్ అవినాష్) చేతిలో కాశి మోసపోతాడు. అది ఎలా? తర్వాత కాశీ ఏం చేశాడు? అసలు జైలుకి ఎందుకు వెళ్ళాడు? అతని గతం ఏంటి? భవిష్యత్తు ఎలా మారింది? రుక్మిణి ఎవరి వల్ల కష్టాల పాలైంది? ఇన్స్పెక్టర్ రాజదురై(బబ్లూ పృథ్వీరాజ్) ఎవరు? ఈ ప్రశ్నలకి సమాధానమే మిగిలిన సినిమా?
విశ్లేషణ :
విజయ్ సేతుపతి సినిమాలో ఏదో ఒక కొత్త ఎలిమెంట్ ఉంటుంది. అయితే అతని పాత్ర విషయంలో అయినా.. లేదంటే కథ, ముఖ్యంగా సోల్ పాయింట్ అయినా..! ఇలా ఏదో ఒక కొత్త అనుభూతి చెందాలని అతను మ్యాగ్జిమమ్ ట్రై చేస్తూ ఉంటాడు.అదే అతన్ని స్టార్ ను చేసింది. ‘ఏస్’ టీజర్, ట్రైలర్ చూసినప్పుడు.. ‘ఏస్’ కూడా అదే తరహాలో ఉంటుంది అని అంచనా వేస్తాం. కానీ ఫస్ట్ హాఫ్ అయ్యేసరికి ఆ ఒపీనియన్ మారిపోతుంది అనడంలో సందేహం లేదు. స్టార్టింగ్ ఏదో కొత్తగా ఉండబోతుంది అనే ఫీలింగ్ వచ్చినా.. తర్వాత సాదా సీదాగా ఉందేంటి? అనే ఫీలింగ్లోకి మనం వచ్చేస్తాం.
కొంత కామెడీ బాగున్నప్పటికీ మిగిలిన లేయర్స్ కనెక్ట్ అవ్వకుండా, ఎంజాయ్ చేయనివ్వకుండా చేసేస్తాయి. ఇక సెకండాఫ్ విషయానికి వస్తే.. మొత్తం ఒక్కటే సీన్ ను సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది. దీంతో క్లైమాక్స్ ఎప్పుడు వస్తుందా? అంటూ ప్రేక్షకుడు నిట్టూర్పులు వదలాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎండింగ్లో కూడా థియేటర్ నుండి బయటకి వచ్చే ప్రేక్షకుల మైండ్లో చాలా ప్రశ్నలు మెదులుతాయి. హీరో క్యారెక్టరైజేషన్ ను సరిగ్గా డిజైన్ చేయకపోగా.. అతను జైలుకి ఎందుకు వెళ్ళాడు? అనే ప్రశ్నకి సమాధానం లభించదు. దాని కోసం సెకండ్ పార్ట్ ప్లాన్ చేస్తారేమో చూడాలి. ఆరుమూగకుమార్ సినిమాని స్టైలిష్ గా తీయాలి అనుకున్నాడు కానీ కథనంపై శ్రద్ద పెట్టలేదు. నిర్మాత కూడా అతనే కాబట్టి.! మరింత బర్డెన్ పెట్టుకుని సరైన ఔట్ఫుట్ ఇవ్వలేకపోయాడేమో అనిపిస్తుంది.
నటీనటుల విషయానికి వస్తే.. ఇందులో విజయ్ సేతుపతి మునుపటితో పోలిస్తే కొంచెం స్టైలిష్ గా కనిపించాడు. యోగిబాబుతో కలిసి అతను పలికిన డైలాగులు నవ్విస్తాయి. వీరి కాంబోలో వచ్చే సన్నివేశాలు కొంతలో కొంత ఎంజాయ్ చేసేలానే ఉంటాయి. మంగళవారం బ్యూటీ దివ్య పిళ్ళై ఇందులో మరింత బొద్దుగా కనిపించింది. ఆమెలో మంచి నటి ఉంది. కానీ ఆమెను చూడగానే చాలా మందికి ‘మంగళవారం’ లో ఆమె చేసిన బోల్డ్ పెర్ఫార్మన్స్ మాత్రమే మైండ్లోకి వస్తుంటుంది. కొంచెం స్లిమ్ అయితే.. ఇంకాస్త బెటర్ రోల్స్ వచ్చే అవకాశం ఉంది. రుక్మిణి వసంత కి ఇప్పుడు ఉన్న క్రేజ్ కి.. ఇలాంటి సినిమాల్లో నటించడం తగ్గించుకుంటేనే మంచిదనిపిస్తుంటుంది. ఆమెకి కూడా సరైన పాత్రలు పడటం లేదు. హిట్లు కూడా ఆమడ దూరంలోనే ఆగిపోతున్నాయి. అవినాష్, బబ్లూ పృథ్వీరాజ్.. బాగానే పెర్ఫార్మ్ చేశారు. కాకపోతే వాళ్ళ పాత్రల నిడివి ఇంకాస్త ఉంటే బాగుండేది.
ప్లస్ పాయింట్స్ :
విజయ్ సేతుపతి
మొదటి 15 నిమిషాలు
మంచి క్యాస్టింగ్
మైనస్ పాయింట్స్ :
కథలో కొత్తదనం లేకపోవడం
సాగదీత
సరైన ఎండింగ్ లేకపోవడం
మొత్తంగా.. ‘ఏస్’ కొంచెం స్టైలిష్ గా మొదలయ్యింది. కానీ రొటీన్ గా ముగిసింది. సింపిల్ గా థియేటర్లలో స్కిప్ కొట్టేసి ఓటీటీలో చూసుకోవడం బెటర్ అనిపించే సినిమాల్లో ఇది కూడా చేరిపోయింది.
ACE Movie Rating : 1.5/5