Apple Mac Mini: టెక్ దిగ్గజం యాపిల్ లవర్స్‌కు త్వరలోనే ఒక శుభవార్త అందుతోంది. కంపెనీ తమ ప్రముఖ డెస్క్‌టాప్ కంప్యూటర్ Mac mini కొత్త వేరియంట్‌ను విడుదల చేసేందుకు సిద్ధమవుతోంది. వచ్చే నెలలో జరగబోయే iPhone 18 లాంచ్ ఈవెంట్ కంటే ముందే, అంటే కొద్ది రోజుల్లోనే ఈ కొత్త మ్యాక్ మిని మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉందనే వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
దాదాపు రెండేళ్ల విరామం తర్వాత యాపిల్ తమ మ్యాక్ మినీని అప్‌గ్రేడ్ చేస్తోంది. కంపెనీ ఇప్పటికే ఎం5 (M5), ఎం6 (M6) ప్రాసెసర్లతో పనిచేసే మోడళ్లను పరీక్షించినట్లు సమాచారం. అయితే వీటిలో ఏ చిప్‌ను ఫైనల్ చేస్తారనే దానిపై కంపెనీ ఇంకా ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో 2024లో వచ్చిన ఎం4 చిప్ వర్షన్ కంటే ఇది మరింత వేగంగా, శక్తివంతంగా ఉండబోతోంది.
ప్రస్తుతం సమాచారాన్ని క్లౌడ్‌పై ఆధారపడకుండా, నేరుగా డివైజ్‌లోనే ప్రాసెస్ చేసే లోకల్ ఏఐ వినియోగం బాగా పెరిగింది. డెవలపర్లు, టెక్ ప్రియులు ఏఐ టూల్స్ రన్ చేయడానికి మ్యాక్ మిని వైపే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాంపాక్ట్ డిజైన్, అత్యుత్తమ పనితీరు వల్ల దీనికి మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.
Also Read: కరెంట్ పోయినా నో టెన్షన్.. పవర్‌బ్యాంక్‌లా పనిచేసే నోకియా కొత్త ఫోన్ చూశారా?
ఒకవైపు డిమాండ్ పెరుగుతుంటే.. మరోవైపు గ్లోబల్‌గా మెమరీ చిప్‌ల కొరత యాపిల్‌ను కాస్త ఇబ్బంది పెడుతోంది. దీనివల్ల ప్రస్తుతం ఉన్న మోడళ్ల డెలివరీలు వారాల తరబడి ఆలస్యమవుతున్నాయి. అయితే రాబోయే కొత్త వెర్షన్‌తో ఈ స్టాక్ సమస్యలు తీరతాయా లేదా అనే దానిపై వినియోగదారుల్లో ఆసక్తి నెలకొంది.
యాపిల్ తమ తయారీ రంగాన్ని విస్తరించే దిశగా అడుగులు వేస్తోంది. టెక్సాస్‌లోని హ్యూస్టన్ క్యాంపస్‌లో త్వరలోనే ఈ మ్యాక్ మిని ఉత్పత్తులను ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ యాపిల్ ఏఐ సర్వర్ల తయారీ జరుగుతుండగా.. త్వరలోనే ఈ డెస్క్‌టాప్ అసెంబ్లింగ్ కూడా అక్కడే చేపట్టి సరఫరాను మరింత వేగవంతం చేయాలని ప్లాన్ చేస్తోంది.
కేవలం మ్యాక్ మిని మాత్రమే కాకుండా.. ఈ ఏడాది చివర్లో మరిన్ని కొత్త ప్రొడక్ట్స్‌ను కంపెనీ తీసుకురానుంది. ఇందులో కొత్త డిజైన్‌తో వచ్చే ఎయిర్‌పాడ్స్ 5, కొత్త రంగుల్లో ఐమ్యాక్, ఎం6 చిప్‌తో నడిచే మ్యాక్‌బుక్ ప్రో మరియు ఓఎల్ఈడీ (OLED) డిస్‌ప్లేతో కూడిన ఐపాడ్ మిని కూడా ఉన్నట్లు సమాచారం.
Also Read: 85 ఇంచుల బిగ్ స్క్రీన్, గూగుల్ జెమిని ఫీచర్.. హైయర్ నుంచి అద్భుతమైన స్మార్ట్ టీవీలు!