Blind Man AI Smart Glasses| ఆండీ ఎవాన్స్ అనే 57 ఏళ్ల వ్యక్తి, ఇంగ్లాండ్ లోని సోమర్‌సెట్‌లో నివసిస్తున్నాడు. గత ఏడాది అతను కంటి చూపును కోల్పోయాడు. దీనివల్ల అతను మోరిసన్స్ సూపర్‌మార్కెట్‌లో రాత్రి షిఫ్ట్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చింది. వైద్యులు అతడిని ఒక అంధుడిగా ప్రకటించారు. రోజువారీ పనులు చేయడం కూడా అతనికి కష్టంగా మారింది. ఇక తనకు భవిష్యత్తు లేదని ఆండీ వాన్స్ డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు.
ఆండీ జీవితం మెటా కంపెనీ రూపొందించిన రే-బాన్ ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌తో పూర్తిగా మారిపోయింది. ఈ గ్లాసెస్‌లో కెమెరా, చిన్న స్పీకర్లు ఉన్నాయి. ఇవి ధరించిన వ్యక్తి ముందు ఉన్న వస్తువులను గుర్తించి, వాటి గురించి వివరిస్తాయి. మెనూలను చదవడం, చుట్టూ ఉన్న వాతావరణాన్ని గుర్తించడం వంటివి ఈ గ్లాసెస్ చేస్తాయి.
ఆండీ ఈ గ్లాసెస్‌ను తనకు అనుగుణంగా సెట్ చేసుకున్నప్పుడు. అందులో వాయిస్, యాసను ఎంచుకునే అవకాశం వచ్చింది. అతను బ్రిటిష్ నటి డేమ్ జూడీ డెంచ్ గొంతును ఎంచుకున్నాడు. ఈ గొంతు అతడిని సరదాగా “జేమ్స్ బాండ్” లేదా “007” అని పిలుస్తుంది. అందుకే ఆండీ తనను హీరోగా లాగా ఊహించుకుంటూ ఎంతో ఆనందాన్ని, ఆత్మవిశ్వాసంతో పనిచేస్తున్నాడు.
స్మార్ట్ గ్లాసెస్ సహాయంతో ఆండీ మళ్లీ ఉద్యోగంలో చేరాడు. అతను ఇప్పుడు సైట్ సపోర్ట్ వెస్ట్ ఆఫ్ ఇంగ్లండ్‌లో పనిచేస్తున్నాడు. అక్కడ అతను చూపు కోల్పోయిన వ్యక్తులకు సహాయం చేస్తాడు. స్వతంత్రంగా జీవించడానికి వారికి శిక్షణ ఇస్తాడు.
ఆండీ చెప్పినట్లు, ఈ గ్లాసెస్ అతడిని జీవితాన్ని పూర్తిగా మార్చాయి. అతను ఇప్పుడు ఆత్మవిశ్వాసంతో.. సమాజంలో ఉపయోగకరంగా ఉన్నట్లు భావిస్తున్నాడు. సైన్‌బోర్డులు, మెనూలు చదవడం, వస్తువులను గుర్తించడం అతడికి సులభమైంది. ప్రజా స్థలాల్లో స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాడు.
రాయల్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్లైండ్ (RNIB) నిపుణుడు రాబిన్ స్పింక్స్ మాట్లాడుతూ.. ఏఐ సాంకేతికత గుడ్డివారి జీవితాల్లో నిజమైన మార్పును తెచ్చిందని చెప్పాడు. ఈ సాంకేతికత వారిని చురుకుగా, స్వతంత్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. చాలా మంది దృష్టి లోపం ఉన్నవారు ఇలాంటి ఏఐ పరికరాలను ఉపయోగిస్తున్నారు.
మెటా, రే-బాన్ కలిపి రూపొందించిన ఈ ఏఐ స్మార్ట్ గ్లాసెస్ అనేక దేశాల్లో వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ధర, లభ్యత దేశాన్ని బట్టి మారవచ్చు. భారతదేశంలో కొన్ని ప్రాంతాల్లో ఇవి లభిస్తాయి.
Also Read: ఫాస్‌ట్యాగ్ కొత్త స్కామ్.. ఆ తప్పు చేశారో మీ అకౌంట్‌లో డబ్బులు ఖాళీ