Trade License: కోర్ అర్బన్ రీజియన్ పరిధిలోని ప్రజలకు అభివృద్ది, పౌర సేవల నిర్వహణతో పాటు అత్యవసర సేవలందించే మూడు మున్సిపల్ కార్పొరేషన్లు తమ పరిధిలోని వ్యాపార సంస్థలకు జారీ చేసే ట్రేడ్ లైసెన్స్ ల రెన్యూవల్ వ్యాపార సంస్థల నిర్వాహకులకు తలభారంగా మారింది. మూడు కార్పొరేషన్ల ఆదాయ వనరుల్లో ఒకటైన ట్రేడ్ లైసెన్స్ ఫీజుల వసూళ్ల విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారన్న విమర్శ ఉంది. ఒక వైపు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు ఎలాంటి పెనాల్టీ లేకుండా నవంబర్ 30వ తేదీలోపు ట్రేడ్ లైసెన్స్ లను రెన్యూవల్ చేసుకోవాలని, లేని పక్షంలో డిసెంబర్ 1వ తేదీ నుంచి జరిమానాలు విధించనున్నట్లు ప్రకటనలు గుప్పిస్తున్నారు.
మూడు మున్సిపల్ కార్పొరేషన్ల వెబ్ సైట్లతో పాటు మీ-సేవా కేంద్రాలు, కార్పొరేషన్ల పరిధిలోని సిటిజన్ సర్వీస్ సెంటర్లలో రెన్యూవల్ చేసుకోవచ్చునని అధికారులు గొప్పగా ప్రచారం చేస్తున్నా, అక్కడ సర్వర్లు మోరాయించటంతో వ్యాపారులు తలలు పట్టుకుంటున్నట్లు సమాచారం. రెన్యూవల్ చేసుకోవాలని భారీగా ప్రచారం చేసుకున్న కార్పొరేషన్ల అధికారులకు అందుకు వీలుగా సాంకేతికపరంగా ఏర్పాట్లు చేయటంలో విఫలయ్యారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కోర్ అర్బన్ రీజియన్ (ఇంటిగ్రేటెడ్ గవర్నెన్స్) బిల్లు – 2026లోని సెక్షన్ 60(1) ప్రకారం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కమిషనర్ జారీ చేసిన ట్రేడ్ లైసెన్స్ లేకుండా ఎటువంటి వ్యాపారం లేదా వాణిజ్య సంస్థను నిర్వహించరాదని కూడా అధికారులు స్పష్టం చేస్తున్నారు.
సెక్షన్ 61 ప్రకారం లైసెన్స్ లేదా అనుమతుల కోసం నిర్దేశిత ఫీజులతో కమిషనర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సూచిస్తున్నారు. మూడు మున్సిపల్ కమిషనర్ల కమిషనర్ ఆమోదం మేరకు ప్రస్తుతం అమల్లో ఉన్న 1973 ట్రేడ్ లైసెన్స్ బై-లాస్, 2017 సెప్టెంబర్ 7వ తేదీన జరిగిన స్టాండింగ్ కమిటీ తీర్మానం నెం.19 ప్రకారం 2027 సంవత్సరానికి లైసెన్సుల రెన్యువల్ ప్రక్రియ చేపట్టారు. మీ సేవా కేంద్రాల్లో ట్రేడ్ లైసెన్స్ ఆప్షన్ ఓపెన్ కావటం లేదని కొందరు అధికారులను ప్రశ్నించగా, మీ సేవాలో సాధ్యం కాకపోతే మై క్యూర్ యాప్ లో చెల్లించుకోవచ్చునని సమాధానం చెబుతున్నారే తప్పా, మీ సేవాల్లో టెక్నికల్ గా ఏర్పడిన సమస్యను పరిష్కరించే విషయాన్ని ప్రస్తావించటం లేదన్న విమర్శలున్నాయి.
వర్తమాన సంవత్సరానికి సంబంధించిన ట్రేడ్ లైసెన్స్ ల గడువు రానున్న డిసెంబర్ 31తో ముగియనుంది. ముగియనుంది. ఈ నేపథ్యంలో 2027 జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు చెల్లుబాటులో ఉండే ట్రేడ్ లైసెన్సుల రెన్యువల్ కోసం ఈ నెల 30వ తేదీని రెన్యూవల్ కు డెడ్ లైన్ గా నిర్ణయించినట్లు అధికారులు తెలపటంతో వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ ల రెన్యూవల్ కోసం మీ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. పైగా వచ్చ సంవత్సరం 2027 కు సంబంధించి జారీ చేయనున్న ట్రేడ్ లైసెన్స్ కొత్తగా జారీ, రెన్యూవల్ కు సంధించిన నిబంధనలు క్యూర్ చట్టంలో కఠినంగా ఉన్నాయి.
Also Read: స్టాలిన్‌తో ముగిసిన ఇండియా కూటమి నేతల భేటీ.. డీలిమిటేషన్‌పై ఎమన్నారంటే?
దీంతో వ్యాపారుల ప్రస్తుతమున్న ట్రేడ్ లైసెన్స్ ను ఎలాంటి జరిమానా లేకుండా రెన్యూవల్ చేసుకునేందుకు ఆసక్తి చూపుతూ ఈ సేవా కేంద్రాలకు పరుగులు తీస్తున్నారు. కానీ తీరా అక్కడకు వెళ్లిన తర్వాత మీ సేవా కేంద్రాల నిర్వాహకులు సారీ.. సర్వర్ డౌన్ గా ఉందని, ఆన్ లైన్ లో జీహెచ్ఎంసీ ట్రేడ్ లైసెన్స్ యాప్ ఓపన్ కావటం లేదని సమాధానమివ్వటంతో వ్యాపారులు ఇంటి ముఖం పట్టాల్సిన పరిస్థితి నెలకొంది. గత అక్టోబర్ 2వ తేదీ నుంచి క్యూర్ పరిధిలో అమల్లోకి వచ్చిన క్యూర్ చట్టాన్ని కొత్త సంవత్సరంలో మూడు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ట్రేడ్ లైసెన్స్, ప్రాపర్టీ ట్యాక్స్ కలెక్షన్ కోసం మరింత కట్టుదిట్టంగా అమలు చేసేందుకు సిద్దమవుతుండటంతో ప్రస్తుతమున్న లైసెన్స్ ను రెన్యూవల్ చేసుకోవటంపైనే వ్యాపారులు ఆసక్తి ఎక్కువగా చూపుతున్నారు.
కోర్ అర్బన్ రీజియన్ పరిదిలోని మూడు మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలోని ట్రేడ్ లైసెన్స్ లకు ఈ నెల 30వ తేదీతో గడువు ముగియనుంది. ఆ తర్వాత డిసెంబర్ 1వ తేదీ నుంచి ట్రేడ్ లైసెన్స్ రెన్యూవల్ కోసం చెల్లించే ఫీజులో దశల వారీగా జరిమానాలను విధించనున్నారు. డిసెంబర్ 1వ తేదీ నుంచి జనవర్ 31 వ తేదీ వరకు రెన్యూవల్ చేసుకుంటే చెల్లించాల్సిన మొత్తం ఫీజులో 25 శాతం జరిమానాను వర్తింపజేయనున్నారు. ఆ తర్వాత వచ్చే సంవత్సరం ఫిబ్రవరి 1వ తేదీ నుంచి చెల్లించాల్సిన మొత్తం ట్రేడ్ లైసెన్స్ ఫీజు ఛార్జీలలో ఏకంగా యాభై శాతం జరిమానాగా విధించనున్నట్లు ఇప్పటికే కార్పొరేషన్లు అధికారికంగా ప్రకటించాయి. గతంలో స్టాండింగ్ కమిటీ చేసిన తీర్మానం ప్రకారం క్యూర్ పరిధిలో ట్రేడ్ లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు గుర్తిస్తే గుర్తించిన సమయంలో వంద శాతం ఛార్జీలను జరిమానాగా విధించడంతో పాటు, లైసెన్స్ పొందే వరకు ప్రతి నెలా ఛార్జీల్లో పది శాతాన్ని జరిమానాగా జోడించి వసూలు చేసేందుకు కార్పొరేషన్ల అధికారులు సిద్దమవుతున్నారు.
వేగంగా పట్టణీకరణ పెరుగుతున్న కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో రోజుకు వందల సంఖ్యలో వ్యాపార సంస్థలు వెలుస్తున్నా, వాటిని గుర్తించి, ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావటంతో మున్సిపల్ కార్పొరేషన్ల అధికారులు విఫలమవుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్ఎంసీలోనూ గతంలోనే సుమారు రెండున్నర లక్షల ఆస్తులు కమర్షియల్ ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లిస్తున్నట్లు గుర్తించినా, ఆ ఆస్తుల్లో అదనంగా అంతస్తులను నిర్మించి, వ్యాపార కార్యక్రమాలు పెరిగాయి. గతంలో గుర్తించిన రెసిడెన్షియల్ ట్యాక్స్ చెల్లించే భవనాల్లోనూ వ్యాపార కార్యకలాపాలు పెరిగినా, వాటిని గుర్తించి, ట్రేడ్ లైసెన్స్ పరిధిలోకి తీసుకురావటంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నట్లు వాదనలున్నాయి.
Also Read: తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ.. డీలిమిటేషన్‌తో బీజేపీకి లాభమా నష్టమా..?