Cyber Fraud: ఆన్‌లైన్ మోసాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఫేక్ ఇన్వెస్ట్‌మెంట్లు, నకిలీ ట్రేడింగ్ యాప్స్, ఇంపర్సనేషన్ కాల్స్, ఉద్యోగాల పేరుతో మోసాలు, డబుల్ రిటర్న్ అంటూ పెట్టుబడులు, ఆన్‌లైన్ అరెస్ట్ వంటి ఘటనల్లో చాలామంది కష్టపడి సంపాదించిన డబ్బును కోల్పోతున్నారు. అయితే మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే.. డబ్బు ఇంకా మోసగాడి ఖాతాలో ఉంటే దాన్ని ఫ్రీజ్ చేసే అవకాశం ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో బాధితులకు ఉపయోగపడేలా కేంద్ర ప్రభుత్వం Money Restoration Moduleను అందుబాటులోకి తీసుకొచ్చింది.
ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (I4C), మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఆధ్వర్యంలో పనిచేసే ఈ మాడ్యూల్.. NCRP ఫిర్యాదుకు సంబంధించిన డబ్బు ట్రేస్ చేసి ఫ్రీజ్ అయినప్పుడు రిఫండ్ ప్రక్రియను సులభం చేయడానికి ఉపయోగపడుతుంది. ముందుగా బ్యాంక్ లేదా ప్రభుత్వ కార్యాలయానికి వెళ్లకుండానే ఆన్‌లైన్‌లో రిఫండ్ రిక్వెస్ట్ పెట్టే అవకాశం ఉంటుంది.
సైబర్ నేరగాళ్లు మీ డబ్బును కాసేజిన వెంటనే ఆలస్యం చేయకుండా 1930కి కాల్ చేయాలి లేదా నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలి. కంప్లైంట్ ఎంత త్వరగా చేస్తే.. డబ్బును ట్రేస్ చేసి ఫ్రీజ్ చేసే అవకాశం అంత మెరుగ్గా ఉంటుంది. అందుకే ఫ్రాడ్ జరిగిన తర్వాత కొన్ని గంటలు కూడా వృథా చేయకపోవడం మంచిది.
Also Read: జియో 10వ వార్షికోత్సవ కానుక.. ఆ పాపులర్ ప్లాన్‌పై 120GB డేటా, జియోహాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ!
Money Restoration Module ద్వారా రిఫండ్ అడగాలంటే మీ ఫిర్యాదుకు సంబంధించిన డబ్బు ట్రేస్ అయి ఫ్రీజ్ అయి ఉండాలి. డబ్బు ఇంకా గుర్తించబడకపోతే వెంటనే రిఫండ్ రాదు. కాబట్టి ఫ్రీజ్ స్థితి నిర్ధారించుకున్న తర్వాతే తదుపరి ప్రక్రియకు వెళ్లాలి.
పోర్టల్‌లో Raise Refund Request ఆప్షన్ ఎంచుకుని 14 అంకెల NCRP acknowledgement number నమోదు చేయాలి. తర్వాత OTPతో వెరిఫై చేయాలి. అడిగిన వివరాలు పరిశీలించి, రిఫండ్ రావాల్సిన బ్యాంక్ ఖాతా వివరాలు ఇవ్వాలి. అవసరమైతే PAN కార్డు కాపీ లేదా కోర్టు ఆర్డర్ వంటి పత్రాలను అప్‌లోడ్ చేయాలి.
ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. మనీ రెస్ట్రోలేషన్ మాడ్యూల్‌లో రిక్వెస్ట్ పెట్టడం అంటే డబ్బు ఖచ్చితంగా తిరిగి వస్తుందని కాదు. డబ్బు ట్రేస్ అయి ఫ్రీజ్ కావడం, సంబంధిత బ్యాంకింగ్ ప్రక్రియ, పోలీసుల దర్యాప్తు, అవసరమైన చట్టపరమైన చర్యలు పూర్తవడం వంటి అంశాలపై రికవరీ ఆధారపడి ఉంటుంది. అందుకే సైబర్ ఫ్రాడ్ జరిగిన వెంటనే 1930కి ఫిర్యాదు చేయడం చాలా ముఖ్యం.
Also Read: అచ్చం మేకప్ బాక్స్ లాగే ఉంటుంది.. 35 క్రిస్టల్స్‌తో మోటోరోలా కొత్త రేజర్ ఫోన్ చూశారా?