Fixed deposits vs mutual funds: సంపాదించిన డబ్బును భవిష్యత్తు కోసం దాచుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో చాలా ముఖ్యం. అయితే ఆ డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలనే.. దానిపై చాలా మందిలో అనేక సందేహాలు ఉంటాయి. సాంప్రదాయకంగా బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అంటే సేఫ్టీకి మారుపేరుగా భావిస్తుంటారు. కానీ ఈ కాలంలో యూత్ మ్యూచువల్ ఫండ్ల వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు ఫిక్స్‌డ్ డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్ల మధ్య ప్రధాన తేడా ఏంటి? ఏది మీకు అధిక రాబడిని అందిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్యాంకులు లేదా పోస్టాఫీసుల్లో ఒక నిర్దిష్ట కాలానికి (ఉదాహరణకు 1 సంవత్సరం నుంచి 5 సంవత్సరాలు) ఒకేసారి పెద్ద మొత్తాన్ని డిపాజిట్ చేయడాన్ని ఎఫ్‌డీ అంటారు.
వడ్డీ రేట్లు , రాబడి: ప్రస్తుతం దేశంలోని ప్రముఖ బ్యాంకులు ఎఫ్‌డీలపై దాదాపు 6.5% నుంచి 7.5% వరకు వార్షిక వడ్డీని అందిస్తున్నాయి. ఉదాహరణకు మీరు రూ.1,00,000 ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో ఎంత వస్తాయో ముందుగానే స్పష్టంగా తెలుస్తుంది.
రిస్క్: ఎఫ్‌డీలలో ఎలాంటి మార్కెట్ రిస్క్ ఉండదు. డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ ద్వారా రూ. 5,00,000 వరకు మీ డబ్బుకు పూర్తి భద్రత ఉంటుంది.
ద్రవ్యోల్బణం : ఎఫ్‌డీలపై వచ్చే రాబడి మంచిదే అయినప్పటికీ, ద్రవ్యోల్బణం పెరుగుతున్న తీరుతో పోలిస్తే.. ఇవి పెద్దగా సంపదను సృష్టించలేవు.
2. మ్యూచువల్ ఫండ్స్:
మ్యూచువల్ ఫండ్స్ అంటే అనేక మంది ఇన్వెస్టర్ల డబ్బును సేకరించి, నిపుణులైన ఫండ్ మేనేజర్లు షేర్ మార్కెట్ లేదా బాండ్లలో పెట్టుబడి పెట్టడం. ఇందులో సిస్టమెటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ ద్వారా ప్రతి నెలా కేవలం రూ.500 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయడం ప్రారంభించొచ్చు.
రాబడి : ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ చాలా కాలానికి ..సగటున వార్షికంగా 12% నుంచి 18% లేదా అంతకంటే.. ఎక్కువ రాబడిని అందించే అవకాశం ఉంది.ఎందుకంటే ఇవి నేరుగా స్టాక్ మార్కెట్ పనితీరుపై ఆధారపడి ఉంటాయి.
రిస్క్: మ్యూచువల్ ఫండ్స్ మార్కెట్ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. మార్కెట్ పడిపోయినప్పుడు రాబడి తగ్గవచ్చు, కానీ దీర్ఘకాలికంగా (5 నుంచి 10 సంవత్సరాలు) ఇన్వెస్ట్ చేస్తే మంచి లాభాలను పొందొచ్చు.
కాంపౌండింగ్ పవర్: చక్రవడ్డీ సూత్రం పని చేయడం వల్ల మీ డబ్బు భారీగా పెరుగుతుంది.
నిస్సందేహంగా మ్యూచువల్ ఫండ్స్.. (ముఖ్యంగా ఈక్విటీ ఫండ్లు) ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే.. చాలా ఎక్కువ రాబడిని అందిస్తాయి. ఎఫ్‌డీలు కేవలం ఫిక్స్డ్ వడ్డీని మాత్రమే ఇస్తాయి. కానీ మ్యూచువల్ ఫండ్లు మీ సంపదను వేగంగా పెంచడానికి సహాయ పడతాయి. అయితే.. ఎఫ్‌డీలలో డబ్బు పూర్తిగా సేఫ్‌గా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్లలో ఒడిదుడుకులు ఉంటాయి.
Also Read: ఇల్లు ఖాళీ చేసాక ఓనర్ డిపాజిట్ ఇవ్వట్లేదా? మీ డబ్బును తిరిగి పొందే సింపుల్ టిప్స్
ఒకవేళ మీకు అత్యవసర ఖర్చుల కోసం లేదా రిస్క్ అసలు ఇష్టం లేకపోతే.. ఫిక్స్‌డ్ డిపాజిట్లు బెస్ట్. మీ పిల్లల చదువులు, రిటైర్మెంట్ లేదా దీర్ఘకాలిక లక్ష్యాల కోసం సంపదను సృష్టించాలనుకుంటే.. మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్.
పెట్టుబడి పెట్టడంలో.. ‘అన్ని గుడ్లను ఒకే గంపలో పెట్టకూడదు’ అంటారు. అలా మీ దగ్గర ఉన్న డబ్బులో కొంత భాగం అత్యవసరాల కోసం ఎఫ్‌డీలలో ఉంచుకుంటూ.. మిగిలిన మొత్తాన్ని మంచి మ్యూచువల్ ఫండ్లలో సిప్ రూపంలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సేఫ్టీతో అధిక రాబడిని కూడా పొందొచ్చు!