E-Paper
Advertisement

పండుగలను మనం కోల్పోయామా..? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా..?

పండుగలను మనం కోల్పోయామా..? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా..?
Advertisement

Eco Friendly Festivals: పండుగలను మనం కోల్పోయామా? పండుగలే మనల్ని వదిలేసి వెళ్లిపోయాయా?ఇదే ప్రశ్న ఈ మధ్య నా మనసును తీవ్రంగా తొలిచేస్తోంది. ఎంతోసేపు అంతరంగ మథనం చేసిన తర్వాత తెలిసింది… పండుగలను నేనే కోల్పోయాను అని! ఇప్పుడు నా గత జ్ఞాపకాల్లో పండుగలను వెతుక్కుంటున్నాను. మనం మరిచిపోయిన మన పూర్వీకుల్లా, పండుగలు కూడా కాలగర్భంలోకి జారిపోయాయా అనిపిస్తోంది. ఇది కేవలం నా ఆవేదనే కాదు, ప్రకృతితో నేటి తరాలకు తెగిపోతున్న అనుబంధం గురించి ఒక అంతులేని బాధ. ఈ మాటలు ఒక 80 ఏళ్ల ప్రొఫెసర్ గారు నాతో అన్నవి. ఆయన మాటల లోతుల్లోకి వెళ్లి, వెలికితీసి రాసిందే ఈ కథనం.

మీ ఇంట్లో పెద్దలకు ఇలా అడగండి..

Advertisement

మన ఇంట్లో 70 ఏళ్లు పై బడిన తాతయ్యో, అమ్మమ్మో, నానమ్మో ఉంటారు కదా! ఒకసారి వారి దగ్గర కూర్చుని, ‘మీ చిన్నప్పుడు పండుగలు ఎలా చేసుకునేవారు?’ అని అడగండి. వినాయక చవితి, దసరా, దీపావళి.. ఇలా ప్రతి పండుగను వారు ఎలా జరుపుకునేవారో చెబుతున్నప్పుడు శ్రద్ధగా వినండి. వారి ముఖంలో విరిసే ఆనందాన్ని గమనించండి. ప్రస్తుత కాలంలో మనం చేసుకుంటున్న పండుగలను ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి. దాంతో పాటే భవిష్యత్తు తరాల పరిస్థితిని కూడా ఊహించుకోండి. అంతకు మించిన గీతాసారం ఇంకొకటి అవసరం లేదు. అప్పుడు తెలుస్తుంది పండుగలు మనల్ని వదిలేసి ఎందుకు వెళ్లిపోయాయో!

పెద్దలు చెబితేన జ్ఞానోదయం..

Advertisement

పండుగలకు-ఆడంబరాలకు, భక్తికి-భక్తి పేరుతో మనం అవలంబిస్తున్న బహిరంగ ప్రదర్శనకు మధ్య ఉన్న తేడా అప్పుడు అర్థమవుతుంది. పరులు చెబితే మనకు కోపం రావచ్చు, కానీ ప్రకృతిలో పరమాత్మను కొలిచిన నాటి తరం.. మన అనుకున్న మన పెద్దలు చెబితేనే జ్ఞానోదయం అవుతుంది. ఆ జ్ఞానోదయంలో నుంచే ఒక ఆలోచన పుట్టుకొస్తుంది. ఆ ఆలోచనే మార్పుకు నాంది వేస్తుంది. అప్పుడే పండుగ సంతోషంగా మళ్లీ మన ఇంటికి వస్తుంది.

సంస్కృతికి, ప్రకృతికి మధ్య బొడ్డు పేగు లాంటి బంధం..

కాబట్టి, మన పెద్దల అనుభవాల నుంచి మన పండుగల అసలు అర్థాన్ని తెలుసుకోండి. పెద్దలను అడగడం అంటే గతంలోని మంచిని గుర్తించి, వర్తమానంలోని లోపాలను సరిదిద్దుకుని, భవిష్యత్తుకు ఒక మంచి వారసత్వాన్ని అందించడం. పండుగలంటే కేవలం పూజలు, పిండివంటలు, రంగురంగుల విగ్రహాలు, అలంకరణలు, బాణసంచా మాత్రమే కాదు. పండుగలంటే ఒక ప్రకృతి శాస్త్రం, ఒక అద్భుతమైన జీవన తత్వం. అందుకే ఒకప్పుడు మన పండుగలన్నీ ప్రకృతితో మమేకమై ఉండేవి. మనిషికి, మట్టికి, చెట్టుకు, పుట్టకు, పశువుకు, పక్షికి మధ్య ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసేవి. అచ్చంగా చెప్పాలంటే, మన సంస్కృతికి, ప్రకృతికి మధ్య తల్లికి బిడ్డకు ఉన్న బొడ్డుపేగు లాంటి బంధాన్ని దృఢంగా కలిపి ఉంచేవి మన పండుగలు.

* వినాయక చవితి అంటే మట్టే దైవంగా, ఆ దైవమే ఆదిగణపతిగా గౌరవించే ప్రకృతి తత్వం.
* దసరా అంటే ప్రకృతిలోని వైవిధ్యాన్ని, జీవశక్తిని ఆరాధించడం.
* దీపావళి అంటే అంతరంగాన్ని కడిగే వెలుగుల పండుగ.
* సంక్రాంతి అంటే పంట చేతికొచ్చిన ఆనందం, రైతు జీవితంలో కొత్త వెలుగు, పశువుల పట్ల కృతజ్ఞత.

ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం..

కానీ, ఒక్కసారి మనల్ని మనం ప్రశ్నించుకుందాం. నేడు ఎలా ఉన్నాయి ఈ పండుగలు? వినాయక చవితి నుంచి సంక్రాంతి వరకు, దీపావళి నుంచి దసరా వరకు.. ఏ పండుగలోనైనా ప్రకృతిని కాపాడే తపన మనకు కనిపిస్తోందా? మన తాత్కాలిక ఆనందం కోసం గాలిని కలుషితం చేస్తున్నాం. మన అలంకరణల కోసం నీటిని విషతుల్యం చేస్తున్నాం. మన సంబరాల కోసం మూగజీవాల మనుగడను ప్రమాదంలోకి నెడుతున్నాం. ఇవే పండుగలని నేటి తరం భావిస్తే.. రేపటి తరానికి ఇదే కాలుష్య సంస్కృతి వారసత్వంగా అందుతుంది. ఇప్పటికే కాలుష్యంతో సతమతమవుతున్న భవిష్యత్తు తరాలకు మరింత కలుషితమైన గాలిని, నీటిని, నేలను అందిస్తే వాళ్ల భవిష్యత్తు ఏమవుతుంది? ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బంది పడే పరిస్థితులు వస్తే, అందుకు బాధ్యత ఎవరిది? పండుగలు కాలంతో పాటు మారవచ్చు, ఆచారాలు కొత్త రూపాలు సంతరించుకోవచ్చు. కానీ వాటి వెనుక ఉన్న ప్రకృతి ప్రేమ, జీవకారుణ్యం, సామాజిక పరమార్థం మాత్రం కనుమరుగు కాకూడదు. ఎందుకంటే పండుగ అంటే ప్రకృతిని జయించడం కాదు.. ప్రకృతితో కలిసి జీవించడం!

పండుగ మనల్ని వదిలేసిందా?

పండుగ మనల్ని వదిలేసి వెళ్లిపోయిందో, లేక పండుగల అసలు అర్థాన్ని మార్చేసి జీవం లేని పండుగలను మనమే జరుపుకుంటున్నామో తెలియదు కానీ.. పండుగల పేరుతో ప్రకృతిని గాయపరుస్తూ జరుపుకునే సంబరాల్లో ఏదో తెలియని వెలితి కనిపిస్తోంది. ‘ఇది కాదు పండుగ చేసుకునే విధానం’ అని ఎవరైనా చెప్పాలని చూసినా.. ‘చెప్పడానికి మీరెవరు? మా ఇష్టం.. మా పండుగ..’ అంటూ వితండవాదాలు మొదలవుతున్నాయి. మంచి చెప్పాలనుకున్నా వినని సమాజానికి ఏం చెప్పగలం? అందుకే పర్యావరణంపై ఆందోళన ఉన్నవాళ్లు, బాధ్యతగా మాట్లాడాలనుకునే వాళ్లు కూడా మౌనంగా ఉండిపోతున్నారు.

మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కునే పరిస్థితి..

ఇప్పటికే అభివృద్ధి పేరుతో మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కునే పరిస్థితికి వచ్చేశాం. ప్రకృతి వనరులను విచ్చలవిడిగా వినియోగిస్తూ, అడవులను నాశనం చేస్తూ, గాలి-నీరు-నేలను కలుషితం చేస్తూ మన మనుగడకే ముప్పు తెచ్చుకుంటున్నాం. ఇది చాలదన్నట్టు ఇప్పుడు పండుగల పేరుతో కూడా కాలుష్యాన్ని పెంచుతున్నాం. అభివృద్ధి మనిషి జీవనాన్ని మెరుగుపరచాలి కానీ, మనిషి మనుగడనే ప్రశ్నార్థకం చేయకూడదు. పండుగలు మన జీవితాల్లో ఆనందాన్ని నింపాలి కానీ, భావితరాల జీవితాల్లో విషాన్ని నింపకూడదు.

పక్కవారితో పోల్చోకోవడం పక్కన పెట్టండి..

ఇక్కడ కొందరు వితండవాదం చేయవచ్చు.. ‘కేవలం హిందూ పండుగలప్పుడే పర్యావరణం గుర్తుకొస్తుందా? పరిశ్రమలు, వాహనాల వల్ల కాలుష్యం రావడం లేదా?’ అని ప్రశ్నించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాలి, మన సంస్కృతి ఎప్పుడూ ప్రకృతిని పూజించమనే చెప్పింది కానీ, కలుషితం చేయమని చెప్పలేదు. కాబట్టి పక్కవారితో పోల్చుకోవడం పక్కన పెట్టి మన పండుగలను మనమే కాపాడుకోవాలి.

మారాల్సింది కాలం కాదు.. మన ఆలోచనలే!

ఒక్కసారి ఆలోచించండి. ఇది వాదోపవాదాలు చేసుకునే సమయం కాదు. ఎవరు గొప్ప? ఎవరి పండుగ గొప్ప? అని నిరూపించుకునే సమయమూ కాదు. ఎవరి విశ్వాసాలనో, సంప్రదాయాలనో కించపరిచే ప్రయత్నం అంతకంటే కాదు. భక్తిని ప్రశ్నించడం లేదు… భక్తికి, భక్తి పేరుతో జరుగుతున్న ఆడంబరాలకు మధ్య తేడాను గుర్తించమనే ఒక ఆవేదన మాత్రమే ఇది. ఒక్కసారి గుండె మీద చెయ్యి వేసుకుని ప్రశాంతంగా ఆలోచించాల్సిన సమయం. మీ అంతరాత్మతో మీరే మాట్లాడుకోండి. మనం చేస్తున్నది నిజంగా పండుగేనా? మన ఆనందం కోసం ప్రకృతిని కలుషితం చేయడం అవసరమా? మన భవిష్యత్తును బలిపెట్టుకోవాల్సిన అవసరం ఉందా? పండుగ మనల్ని వదిలేసి వెళ్లిపోయి చాలా కాలమే అయిందనే వాస్తవాన్ని ఒప్పుకోవాల్సిన సమయం ఇది. కాబట్టి అచ్చమైన, స్వచ్ఛమైన మన పండుగలు మళ్లీ మన ఇంటికి రావాలంటే మన ఆలోచనల్లో మార్పు రావాలి. ప్రకృతి కళ్లతో ప్రపంచాన్ని చూడాలి. మట్టి, నీరు, గాలి, చెట్లు, పక్షులు, జంతువులు.. అన్నింటి క్షేమాన్ని మన పండుగల్లో భాగం చేసుకోవాలి.

పండుగ మళ్లీ రావాలంటే.. ఈ మార్పు తప్పనిసరి!

ఆర్భాటం తగ్గాలి.. ఆత్మీయత పెరగాలి. కాలుష్యం తగ్గాలి.. ప్రకృతితో అనుబంధం పెరగాలి. అప్పుడే, బాధపడి వెళ్లిపోయిన పండుగ తిరిగి మన గూటికి వస్తుంది. పండుగలను తిరిగి తీసుకురావాల్సిన బాధ్యత మనదే. మన కోసం కాదు.. మన తర్వాతి తరాల కోసం! చివరగా ఓక్కమాట ప్రకృతిని వికృతిగా చేసి మనం చేసే ఏ పూజలనూ ఆ భగవంతుడు కూడామెచ్చడు! సాక్షాత్తు భగవద్గీతలోనే ఆ పరమాత్ముడు స్పష్టంగా చెప్పాడు.. ‘పత్రం పుష్పం ఫలం తోయం.. యో మే భక్త్యా ప్రయచ్ఛతి’ అని. అంటే.. అచ్చమైన భక్తితో ఒక ఆకునో, ఒక పువ్వునో, ఒక పండునో, కాస్త నీటినో సమర్పించినా నేను ప్రీతితో స్వీకరిస్తాను అన్నాడు. ఆడంబరాలతో బంగారు పూలు సమర్పించినా ఆ దేవుడికి ఎక్కదు! భగవంతుడు చూసేది నీ భక్తిని.. ఆయన కోరేది ఈ ప్రకృతిని!

ALSO READ: పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

Tags

Related News

జియో రూ. 1,748 vs రూ. 1,799 ప్లాన్లు.. బెనిఫిట్స్ పరంగా దేని దమ్ము ఎంత? ఏది రీఛార్జ్ చేస్తే బెటర్?

పెళ్లికాని ప్రసాదులకు ఏఐ హెచ్చరిక.. ఫోటో చూసి ఫ్లాట్ అయ్యారో.. ఖాతా ఖాళీ అవ్వడం ఖాయం!

iPhone 20 Proలో ఊహించని మార్పు.. డైనమిక్ ఐలాండ్ విషయంలో యాపిల్ ప్లాన్ ఇదేనా?

వీఐ రూ.398 ప్లాన్.. కాలింగ్, 5G డేటాతో పాటు.. 19 ఓటీటీలు ఉచితం!

ఇంట్లోనే కేఫ్ స్టైల్ కాఫీ..రూ.1,899కే అగారో రాయల్ కాఫీ మేకర్‌

వాట్సప్‌లో ఏఐతో పనులు మరింత ఈజీ.. ప్రైవసీ విషయంలో మాత్రం తగ్గేదే లేదంటున్న సీఈఓ!

నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?

Big Stories

Advertisement
×