Google Maps safety settings: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకసారి గూగుల్ మ్యాప్స్ వాడుతున్నారు. తెలియని ప్రాంతాలకు వెళ్లేటప్పుడు ఇది మనల్ని సరిగ్గా గమ్యస్థానానికి చేరుస్తుంది. అయితే కారు లేదా బైక్ డ్రైవింగ్ చేసేటప్పుడు చిన్న పొరపాటు జరిగినా పెద్ద ప్రమాదాలకు దారితీసే అవకాశం ఉంది. అందుకే గూగుల్ మ్యాప్స్ మన సేఫ్టీ దృష్టిలో ఉంచుకుని అనేక అడ్వాన్స్డ్ ఫీచర్లను అందిస్తోంది. డ్రైవ్ చేయడానికి ముందే వాటిని ఆన్ చేసుకోవడం ద్వారా ప్రయాణాన్ని ఎంతో ప్రశాంతంగా ముగించవచ్చు.
మొదటిగా స్పీడోమీటర్ ఆప్షన్‌ను ఆన్ చేసుకోవడం చాలా ముఖ్యం. చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు స్పీడ్ పరిమితిని మించిపోతుంటారు. దీని వల్ల ట్రాఫిక్ చలానాలు పడే అవకాశం ఉంది. గూగుల్ మ్యాప్స్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి నావిగేషన్ సెక్షన్ కింద స్పీడోమీటర్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసుకుంటే.. మనం ప్రయాణించే రోడ్డుపై గరిష్ట వేగ పరిమితి ఎంత ? మన వెహికిల్ ఎంత స్పీడ్‌తో వెళ్తుందనేది స్క్రీన్‌పై స్పష్టంగా కనిపిస్తుంది. దీని వల్ల ఓవర్ స్పీడ్‌ను ఈజీగా కంట్రోల్ చేయొచ్చు.
రెండవది వాయిస్ గైడెన్స్, సైలెంట్ అలర్ట్ సెట్టింగ్స్. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ప్రతిసారీ మొబైల్ స్క్రీన్ వైపు చూడటం చాలా ప్రమాదకరం. అందుకే వాయిస్ డైరెక్షన్స్‌ను ఆడియో మోడ్‌లో పెట్టుకోవడం బెస్ట్. కేవలం ముఖ్యమైన టర్నింగ్స్ మాత్రమే అనౌన్స్ చేసేలా లేదా పూర్తిగా మ్యూట్ కాకుండా సరైన వాల్యూమ్‌లో సెట్ చేసుకోవాలి. దీని వల్ల రోడ్డుపై నుంచి దృష్టి మరలకుండా సేఫ్‌గా డ్రైవ్ చేయవచ్చు.
మూడవది ఆఫ్‌లైన్ మ్యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవడం. మనం లాంగ్ జర్నీలు చేసేటప్పుడు కొన్ని ప్రాంతాల్లో మొబైల్ నెట్‌వర్క్ లేదా ఇంటర్నెట్ సిగ్నల్ పూర్తిగా పోతుంటుంది. సరిగ్గా.. అదే సమయంలో దారి మారిపోతే తీవ్ర ఇబ్బంది కలుగుతుంది. కాబట్టి ప్రయాణం ప్రారంభించే ముందే ఆయా ప్రాంతాలకు సంబంధించిన మ్యాప్స్‌ను ఆఫ్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసి పెట్టుకుంటే.. నెట్‌వర్క్ లేకపోయినా జీపీఎస్ లొకేషన్ ఖచ్చితంగా పని చేస్తుంది.
నాలుగవది ట్రాఫిక్ అండ్ ఆక్సిడెంట్ అలర్ట్స్ ఫీచర్. గూగుల్ మ్యాప్స్‌లో మార్గ మధ్యంలో ఎక్కడైనా రోడ్డు ప్రమాడాలు జరిగినా.. ట్రాఫిక్ జామ్ ఉన్నా, లేదా రోడ్డు రిపేర్ పనులు జరుగుతున్నా.. రియల్ టైమ్‌లో అలర్ట్స్ వస్తుంటాయి. ఈ ఫీచర్‌ను ఎనేబుల్ చేయడం ద్వారా మనం ప్రత్యామ్నాయ మార్గాన్ని ఎంచుకోవడానికి వీలవుతుంది. తద్వారా గంటల తరబడి ట్రాఫిక్‌లో ఇరుక్కు పోకుండా సమయాన్ని సేవ్ చేసుకోవచ్చు.
Also Read: వాషింగ్ మెషీన్ కొనాలనుకుంటున్నారా? IFB, Boschలలో ఏది బెస్ట్ ఛాయిస్?
చివరిగా లొకేషన్ షేరింగ్ ఆప్షన్. ముఖ్యంగా రాత్రి సమయాల్లో లేదా లాంగ్ ట్రిప్స్ వెళ్లేటప్పుడు మన లైవ్ లొకేషన్‌ను కుటుంబ సభ్యులకు షేర్ చేయడం సేఫ్టీ పరంగా చాలా మంచిది. దీని వల్ల మనం ఎక్కడ ఉన్నామనే విషయం వారికి ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి సిద్ధమయ్యే ముందే.. ఈ చిన్న చిన్న సెట్టింగ్స్‌ని చెక్ చేసుకుని, సురక్షితమైన, సంతోషకరమైన ప్రయాణాన్ని ఆస్వాదించండి.