Googlebook Laptops: ల్యాప్‌టాప్ మార్కెట్లో మరో కొత్త సంచలనం చోటుచేసుకుంది. ఇప్పటివరకు మనం ఎన్నో క్రోమ్‌బుక్స్, విండోస్ ల్యాప్‌టాప్స్ చూశాం. అయితే ఇప్పుడు గూగుల్ సరికొత్తగా ‘గూగుల్ బుక్’ (Googlebook) పేరుతో ఓ కొత్త రకం ల్యాప్‌టాప్‌ను పరిచయం చేసింది. ఆండ్రాయిడ్, క్రోమ్ ఓఎస్ రెండింటి అనుభవాన్ని కలిపేలా రూపొందించిన ఈ డివైజ్‌లో ఆకట్టుకునే డిజైన్‌తో పాటు ఏఐ ఆధారిత ఫీచర్లను కూడా అందిస్తున్నారు. మరి ఈ కొత్త గూగుల్ బుక్‌లో ప్రత్యేకతలు ఏంటి? దీని ఫీచర్లు, డిజైన్, ఏఐ సామర్థ్యాలు ఎలా ఉన్నాయి? అసలు ఇది సాధారణ ల్యాప్‌టాప్స్‌కు ఎంత భిన్నంగా ఉండబోతోంది? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ కొత్త గూగుల్ బుక్ ధర అమెరికా కరెన్సీ ప్రకారం సుమారు 899 డాలర్లతో స్టార్ట్ అవుతుంది. మన ఇండియన్ కరెన్సీలో లెక్కేస్తే సుమారు రూ.86,000 వరకు ఉంటుంది. ఏసర్, ఆసుస్, డెల్, హెచ్‌పీ, లెనోవో లాంటి ప్రముఖ కంపెనీల నుంచి ఇవి మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పటికే వీటి ప్రీ-ఆర్డర్స్ కూడా మొదలైపోయాయి. అయితే మన దేశంలో ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఇక ఈ ల్యాప్టాప్‌తో పాటు ఏడాది పాటు గూగుల్ ఏఐ ప్రో ఫ్రీ సేవలు, 5 టీబీ క్లౌడ్ స్టోరేజ్, అలాగే యూట్యూబ్ ప్రీమియం వంటి బంపర్ ఆఫర్లు కూడా ఇస్తున్నారు.
Also Read: ఎప్పుడూ అదే గ్రీన్ స్క్రీన్‌తో బోర్ అనిపిస్తుందా? వాట్సప్‌లో రాబోతున్న ఈ కొత్త థీమ్స్ చూశారా?
మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే చాలు.. ఈ ల్యాప్‌టాప్‌తో కనెక్ట్ చేసిన తర్వాత మీకు సరికొత్త అనుభవం ఎదురవుతుంది. ల్యాప్‌టాప్‌ను మొదటిసారి సెటప్ చేసేటప్పుడే ఫోన్‌లో సేవ్ చేసిన వైఫై నెట్‌వర్క్‌లు, పాస్‌వర్డ్‌లు, కొన్ని సెట్టింగ్స్ ఆటోమేటిక్‌గా సింక్ అవుతాయి. ఫోన్‌లో మధ్యలో ఆపేసిన పనిని కూడా ల్యాప్‌టాప్‌లో అక్కడి నుంచే కంటిన్యూ చేసుకునే అవకాశం ఉంటుంది. అంతేకాదు.. ఫోన్‌లోని ఫొటోలు, ఫైల్స్‌ను ల్యాప్‌టాప్ నుంచే సులభంగా యాక్సెస్ చేసుకోవచ్చు. ముఖ్యంగా, మీ ఆండ్రాయిడ్ ఫోన్‌లోని యాప్స్‌ను ల్యాప్‌టాప్ స్క్రీన్‌పైనే నేరుగా ఉపయోగించుకునే సదుపాయం కూడా ఉంది. దీంతో ఫోన్, ల్యాప్‌టాప్ రెండూ వేర్వేరు డివైజ్‌లుగా కాకుండా.. ఒకే ఎకోసిస్టమ్‌లో భాగంగా పనిచేస్తాయి.
ఈ ల్యాప్‌టాప్‌లో ప్రధాన హైలైట్ జెమిని ఏఐ (Gemini AI) అనే చెప్పాలి. ఇందులో ఉన్న మ్యాజిక్ పాయింటర్ సాయంతో మీ క్యాలెండర్‌ను ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు, ఏ భాషనైనా ఇట్టే ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు. అలాగే మీరు నోట్స్ రాసుకోవడానికి ‘రాంబర్’ అనే ఫీచర్ ఉంది. మీరు చెప్తుంటే అదే ఆటోమేటిక్‌గా హెడ్డింగ్‌లతో సహా చక్కటి నోట్స్‌లా రాసేస్తుంది. మీకు నచ్చిన డిజైన్‌లో సొంతంగా విడ్జెట్స్ క్రియేట్ చేసుకునే ఆప్షన్ కూడా ఇందులో ఉంది.
ఇందులో ప్లే స్టోర్ నుంచి మీకు నచ్చిన అన్ని ఆండ్రాయిడ్ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అల్యూమినియం, కార్బన్ ఫైబర్ బాడీతో ఇవి చాలా ప్రీమియమ్‌గా కనిపిస్తాయి. దీని డిస్‌ప్లే విషయానికొస్తే.. అద్భుతమైన 2.8కే ఓఎల్ఈడీ టచ్ స్క్రీన్‌తో వస్తోంది. ఇంటెల్, క్వాల్కమ్ ప్రాసెసర్లు దీని వేగాన్ని మరింత పెంచుతాయి. ముఖ్యంగా ఏఐ పనుల కోసం ప్రత్యేకంగా ఎన్పీయూలను అమర్చారు. దీనిని ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 14 గంటల పాటు నాన్‌స్టాప్ బ్యాటరీ బ్యాకప్ ఇస్తుంది. సెక్యూరిటీ పరంగా కూడా గూగుల్ గట్టి భద్రతను అందించింది.
Also Read: అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్‌లో ఊహించని ఆఫర్లు.. ఈ కార్డ్ గనుక ఉంటే సగానికి పైగా డిస్కౌంట్!