Warangal Hospital: స్వేచ్ఛ బ్యూరో: వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణంపై సీఎం రేవంత్ రెడ్డి అసంతృప్తిని వ్యక్తం చేశారు. గ్రీన్ ఛానెల్ లో నిధులు ఇస్తున్నా.. ఇందుకు నిర్లక్ష్యం అంటూ అధికారులపై సీఎం ఫైర్ అయ్యారు. సోమవారం ఆయన మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ లోని ‘బోధి పెవిలియన్’ లో వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణ పను ల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
రాబోయే 30 రోజులే టార్గెట్!
నిర్మాణం విలంబం కాకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. రాబోయే 30 రోజుల పాటు రోజుకు 24 గంటల ప్రాతిపదికన (షిఫ్టుల వారీగా) హాస్పిటల్ నిర్మాణ పనులు నిరంతరాయంగా కొనసాగాలని సీఎం ఆదేశించారు. స్పష్టమైన వర్క్ షెడ్యూల్ తయారు చేసుకుని పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు.ప్రతి పనికీ ఒక ప్రత్యేక అధికారిని బాధ్యుడిగా నియమించాలని, పనులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. ఇకపై ప్రతిరోజూ సంబంధిత జిల్లా కలెక్టర్లు క్షేత్రస్థాయిలో ఆస్పత్రి నిర్మాణ పనులను ప్రత్యక్షంగా పరిశీలించాలని ఆదేశించారు.
రోజువారీ పర్యవేక్షణ, కో-ఆర్డినేషన్ కమిటీ
ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులు సైతం క్రమం తప్పకుండా గ్రౌండ్ లెవల్‌కి వెళ్లి పను పురోగతిని పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లోపించకుండా ఒక ‘కో-ఆర్డినేషన్ కమిటీ’ ఏర్పాటు చేసుకుని ముందుకు సాగాలని అధికారులను నిర్దేశించారు. సనత్‌నగర్ టిమ్స్ తరహాలోనే వరంగల్‌లోనూ అతిత్వరలో ఓపి సేవలను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం ఆదేశించారు. ఆస్పత్రి చుట్టూ ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా పరిసరాలను తీర్చిదిద్దాలన్నారు.సనత్‌నగర్ టిమ్స్ ప్రాంగణంలో స్టాఫ్ క్వార్టర్స్ నిర్మాణం పనులను వెంటనే ప్రారంభించాలని సూచించారు.
ఆస్పత్రి నిర్వహణ బాధ్యతలు బాహ్య ఏజెన్సీకి..
అలాగే, ఆస్పత్రి నిర్వహణ (మెయింటెనెన్స్) బాధ్యతలను బాహ్య ఏజెన్సీకి అప్పగించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమీక్షా సమావేశంలో ఎంపీ వేం నరేందర్ రెడ్డి, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జె. చోంగ్దు, మున్సిపల్ శాఖ సెక్రటరీ టి.కె. శ్రీదేవి, వరంగల్ కలెక్టర్ సత్యశారదాదేవి, హన్మకొండ కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
Also Read: విజయవాడలో విషాదం.. వేడి సాంబార్ గిన్నెలో పడి మహిళ దుర్మరణం!