Social Media Nuisance: ఇటీవల పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఒక టీనేజ్ జంట ఏకాంత వీడియో వైరల్ అయ్యింది. ఆ వీడియో కోసం సోషల్ మీడియా అంత చర్చ జరిగింది. వాళ్ల ఫొటోలు పెట్టి మరీ.. 19 నిమిషాలు అద్భుతమని కామెంట్లు పెట్టారు. వారి వ్యక్తి గత జీవితాన్ని రోడ్డు మీదకు లాగారు.
‘‘భయ్యా ఆ వీడియో చూశావా? లింకు పెట్టు చూసేద్దాం’’ అంటూ మీరు కూడా వాళ్ల ఫొటోల కింద కామెంట్లు పెడుతున్నారా? ఒక్కసారి ఆలోచించండి.. వారి స్థానంలో మీవాళ్లే ఎవరైనా ఉంటే? ఇలాగే అడుగుతారా? ఏమైంది మన విచక్షణ? ఎక్కడికి పోతున్నాం? అసలు అది సోషల్ మీడియానా? లేదా అసాంఘిక పనులకు అడ్డానా? పోలీసులు ఏం చేస్తున్నారు? లా అండ్ ఆర్డర్ ఏమైంది? నిఘా నిద్రపోతుందా? జనాలు బుర్రల్లో మానవత్వం అనేదే మాయమైందా? లేదా పెద్దలు తమ పిల్లలకు బుద్ధులు చెప్పడం మరిచిపోయారా? లేదా డబ్బుల కక్కుర్తితో విలువలకు వీడ్కోలు చెప్పేశామా?
భూ ప్రపంచంలో ఏ జీవికి లేని విచక్షణ జ్ఞానం మనిషి ఉంది. ఏది మంచి? ఏది చెడు? అని ఆలోచించగలిగేది మనం మాత్రమే. కానీ, ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. తలలో ఉండాల్సిన మెదడు చాలా మందికి మోకాళ్లకు చేరింది. మరికొంత మందికి అరికాళ్లకూ జారిపోయింది. అందుకే, విచక్షణ మరిచి ప్రవర్తిస్తున్నారు. తాము చెప్పిందే వేదం, తమకు నచ్చింతే రంభ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కోతికి కొబ్బరి చిప్ప దొరికినట్టు వారికి సోషల్ మీడియా తోడయ్యింది. మొత్తంగా మనిషి విలువలు వలువలు ఊడదీసుకుని నగ్నంగా చౌరస్తా దగ్గర నిలబడ్డాయి. పరిస్థితి మారకపోదా? అని ఎదురుచూస్తున్నాయి. సాధ్యం అవుతుందో? కాదో? తెలియక అయోమయంలో కొట్టుమిట్టాడుతున్నాయి.
చట్టాలు దేశ పౌరులందరికీ సమానమే. మీడియా అయినా, సోషల్ మీడియా అయినా, చట్టం ముందు తలవంచాల్సిందే. కానీ, పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. మీడియాను కట్టడి చేయడానికి చాలా చట్టాలు ఉన్నాయి. అవే చట్టాలు సోషల్ మీడియాకు వర్తించినా, నిఘా పెట్టే పరిస్థితి లేదు. ఒక యువతి అత్యాచారానికి గురైతే, ఆమె ముఖం చూపించకూడదనేది రూల్. మైనర్ ఏదైనా నేరం చేసినా, వాళ్ల అశ్లీల వీడియోలు లీక్ అయినా ఫొటోలు, వీడియోలు పబ్లిష్ చేయకూడదు. ఈ నియమం టీవీ చానెళ్లకు, పత్రికలకు కఠినంగా వర్తిస్తుంది. అతిక్రమించిన చానెళ్లపై కేసులు వేస్తారు. జరిమానాలు విధిస్తారు. కానీ, సోషల్ మీడియా తెరిస్తే, అదే అత్యాచార బాధితుల ఫొటోలు, మైనర్ల అశ్లీల వీడియోలు, రివెంజ్ పోర్న్ విజువల్స్ విచ్చల విడిగా కనిపిస్తాయి. ఇదే పని టీవీ ఛానల్ చేస్తే తప్పు అయినప్పడు, సోషల్ మీడియా చేస్తే ఒప్పు ఎలా అవుతుంది? చట్టం ఎందుకు మౌనంగా ఉంటుంది.
అత్యాచార బాధితుల గుర్తింపు బయటపెట్టడం అనేది సెక్షన్ 228-A ఐపీసీ ప్రకారం 7 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడుతుంది. మైనర్ల అశ్లీల కంటెంట్ షేర్ చేస్తే, పోక్సో యాక్ట్, ఐటీ యాక్ట్ 67B ప్రకారం 7–10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుంది. రివెంజ్ పోర్న్, అశ్లీల వీడియోలు ఫేర్ చేస్తే ఐటీ యాక్ట్ 66E, 67, 67A ప్రకారం కఠిన శిక్షలు పడుతాయి. ఇంత కఠినమైన చట్టాలు ఉన్నప్పటికీ.. ఎందుకు సోషల్ మీడియాకు అడ్డూ అదుపూ లేకుండాపోతోంది? మీడియాకు ఉన్న భయం.. సోషల్ మీడియాకు ఎందుకు లేదు? కారణం ఒక్కటే.. టీవీ ఛానల్, పత్రిక అంటే రిజిస్టర్డ్ కంపెనీ. ఎడిటర్ పేరు, ఆఫీసు అడ్రస్ ఉంటుంది. ఒక్క ఫిర్యాదు చేస్తే అదే రోజు FIR, మరుసటి రోజు రైడ్ ఉంటుంది. కానీ, సోషల్ మీడియాలో 99 శాతం అకౌంట్స్ ఫేక్. వీపీఎన్ వాడి, పాకిస్తాన్, బంగ్లాదేశ్, నైజీరియా సిమ్ తో అప్ లోడ్ చేస్తున్నారు. వారిని గుర్తించడం, పట్టుకోవడం అంత ఈజీ కాదు.
సోషల్ మీడియా ద్వారా జరిగే ఫేక్ ప్రచారాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా, పూర్తి స్థాయిలో వారికి సహకారం లభించడం లేదు. దేశంలో సైబర్ క్రైమ్ పోలీస్ సిబ్బంది 2024 NCRB రికార్డుల ప్రకారం 10 వేల లోపే ఉన్నారు. ఒక్కో కేసుకు ట్విట్టర్, మెటా, టెలిగ్రామ్ నుంచి డేటా తీసుకోవాలి. ఆ డేటా కోసం చాలా సమయం పడుతుంది. చాలా అకౌంట్స్ విదేశాల నుంచి నడుస్తున్నాయి. అంతర్జాతీయ సహకారం లేకుండా ఏమీ చేయలేరు. 2023-24 మధ్య అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే డజన్ల కొద్దీ టెలిగ్రాం గ్రూపులు బయటపడ్డాయి. కానీ 90 శాతం మంది నిందితులు ఇప్పటికీ బయటే ఉన్నారు. 2024లో భారత ప్రభుత్వం ఎక్స్, ఇన్ స్టా, టెలిగ్రాంకు సంబంధించిన 1,20,000 అకౌంట్లను బ్లాక్ చేయాలని ఆదేశించింది. అయినా, కొత్త అకౌంట్స్ మళ్లీ పుట్టుకొస్తూనే ఉన్నాయి.
సోషల్ మీడియా కట్టడి అనేది కష్టమైన పని అయినా.. పూర్తిగా సాధ్యం కాదని చెప్పలేం. సైబర్ పోలీస్ స్టేషన్ల సంఖ్యను 10 రెట్టు పెంచాలి. ఆధార్ లింక్డ్ సోషల్ మీడియా రావాలి. ఎక్స్, మెటా, టెలిగ్రాం లాంటి కంపెనీలు IT Rules 2021 ప్రకారం గ్రీవెన్స్ ఆఫీసర్లను పెట్టాలి. అప్పుడే కొంత కట్టడి చేసే అవకాశం ఉంటుంది.
నిజం చెప్పాలంటే.. సోషల్ మీడియా కట్టడిలో చట్టం ఫెయిల్ కాలేదు. అమలు చేసే యంత్రాంగం పూర్తిగా ఫెయిల్ అయ్యింది. టీవీ ఛానల్‌కు భయం ఉంది కాబట్టి ఆగుతోంది. సోషల్ మీడియాకు భయం లేకపోవడం వల్ల రెచ్చిపోతోంది. ఈ పరిస్థితి మారాలంటే ప్రభుత్వం, పోలీసులు, ఆన్ లైన్ ప్లాట్ ఫామ్‌లు కలిసి పని చేయాలి. ఇప్పుడు అది జరగడం లేదు. అందుకే, మనం రోజూ సోషల్ మీడియా న్యూస్ ఫీడ్ కోసం స్క్రోల్ చేస్తూనే ఉన్నాం. ఎవరో ఒకరి జీవితాన్ని నాశనం చేసే వీడియోలను చూస్తూనే ఉన్నాం.
Read Also: ఒడిలో నిద్రిస్తున్న చిన్నారి మాయం.. 6 నెలలు తర్వాత ఊహించనిది జరిగింది, కన్నీళ్లు పెట్టించే ఘటన!