Home Projector Tips: ఇంట్లోనే థియేటర్ లాంటి అనుభూతితో సినిమాలు చూడటం చాలా మందికి ఇష్టం. ఒకప్పుడు ఇందుకోసం పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు తక్కువ ధరకే మంచి హోమ్ ప్రొజెక్టర్లు అందుబాటులోకి రావడంతో చాలామంది టీవీలకు బదులుగా వీటిని ఎంచుకుంటున్నారు. అయితే టీవీలా ప్రొజెక్టర్‌ను కూడా నిర్లక్ష్యంగా వాడితే త్వరగానే సమస్యలు రావచ్చు. ముఖ్యంగా వేడి, దుమ్ము విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ప్రొజెక్టర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే ఈ నాలుగు తప్పులను మాత్రం చేయకండి.
సినిమా అయిపోయిన వెంటనే ప్రొజెక్టర్‌ను ఆఫ్ చేసి ప్లగ్ లాగేయడం చాలామంది చేసే పొరపాటు. ప్రొజెక్టర్ ఆఫ్ చేసిన తర్వాత కూడా లోపలి ఫ్యాన్లు కొంతసేపు పనిచేస్తాయి. ఇవి లోపల ఉన్న వేడిని బయటకు పంపుతాయి. వెంటనే కరెంట్ కట్ చేస్తే వేడి అలాగే ఉండిపోయే అవకాశం ఉంది. కాబట్టి.. పవర్ ఆఫ్ చేసిన తర్వాత ఫ్యాన్ పూర్తిగా ఆగే వరకు వేచి ఉండి, ఆ తర్వాతే ప్లగ్ తీయండి.
ప్రొజెక్టర్‌ను కప్‌బోర్డ్‌లో లేదా చుట్టూ వస్తువులతో నిండిన చిన్న ప్రదేశంలో పెట్టడం మంచిది కాదు. గాలి సరిగా ప్రసరించకపోతే వేడి బయటకు వెళ్లదు. దీంతో ఫ్యాన్ ఎక్కువగా తిరగడం, శబ్దం రావడం, చివరికి ప్రొజెక్టర్ ఆటోమేటిక్‌గా ఆఫ్ అవడం వంటి సమస్యలు రావచ్చు. చుట్టూ తగినంత ఖాళీ ఉండేలా చూసుకోండి.
సినిమా చూసిన వెంటనే ప్రొజెక్టర్‌ను మరో గదికి మార్చడం కూడా మంచిది కాదు. లోపలి భాగాలు వేడిగా ఉన్న సమయంలో కుదుపులు లేదా ప్రమాదవశాత్తూ జారిపడటం వల్ల నష్టం కలగొచ్చు. అందుకే ఆఫ్ చేసిన తర్వాత కనీసం 5 నుంచి 10 నిమిషాలు చల్లబడే వరకు వేచి ఉండండి.
ప్రొజెక్టర్‌లోకి వెళ్లే గాలితో పాటు దుమ్ము, వెంట్రుకలు కూడా లోపలికి చేరుతుంటాయి. ఫిల్టర్‌లో దుమ్ము పేరుకుపోతే గాలి ప్రసరణ తగ్గి ప్రొజెక్టర్ వేడెక్కవచ్చు. లెన్స్‌పై దుమ్ము చేరితే చిత్ర నాణ్యత కూడా తగ్గుతుంది. కాబట్టి.. మీ మోడల్ సూచనల ప్రకారం ఎయిర్ ఫిల్టర్, వెంటిలేషన్ ప్రాంతాలను క్రమం తప్పకుండా శుభ్రం చేయండి. ఈ చిన్న జాగ్రత్తలతో ప్రొజెక్టర్‌ను ఎక్కువ కాలం సాఫీగా ఉపయోగించుకోవచ్చు.
Also Read: ఎలక్ట్రానిక్స్‌కు ఎక్స్‌ట్రా వారెంటీ నిజంగా అవసరమా? ఈ ట్రిక్స్‌తో డబ్బు ఆదా చేసుకోండి!