AC power saving tips: ప్రస్తుత కాలంలో ఏసీ అనేది విలాసం కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లోనూ.. ఒక నిత్యావసర వస్తువుగా మారి పోయింది. సాధారణంగా కరెంట్ బిల్లు తగ్గించడం కోసం చాలా మంది ఎక్కువ ధర పెట్టి మరీ 5-స్టార్ రేటింగ్ ఉన్న ఇన్వర్టర్ ఏసీలను కొంటారు. మార్కెట్లో ఇన్వర్టర్ ఏసీల ధరలు రూ. 35,000 నుంచి రూ. 65,000 వరకు ఉంటున్నాయి. అయితే .. ఇంత ఖరీదైన, అత్యధిక ఎనర్జీ రేటింగ్ ఉన్న ఏసీలను వాడుతున్నప్పటికీ.. కొందరికి కరెంట్ బిల్లు వేలల్లో వస్తూనే ఉంటుంది. దీనికి ప్రధాన కారణం ఏసీ టెక్నాలజీ కాదు, మనం చేసుకునే తప్పు సెట్టింగ్‌లు, వాడే విధానమే. టెక్ నిపుణుల సూచనల ప్రకారం.. మీ ఏసీ కరెంట్ బిల్లును తగ్గించే మూడు ముఖ్యమైన సెట్టింగ్‌లు ఏంటో తెలుసుకుందామా..
చాలా మంది చల్ల దనం కోసం ఏసీ టెంపరేచర్‌ను 16°C లేదా 18°C డిగ్రీలకు సెట్ చేస్తుంటారు. కానీ.. ఇది కరెంట్ బిల్లు విపరీతంగా పెరగడానికి అతిపెద్ద కారణం. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మార్గదర్శకాల ప్రకారం.. ఏసీలో ఉష్ణోగ్రత 24 డిగ్రీల నుంచి 26 డిగ్రీల సెల్సియస్ (24°C – 26°C) మధ్య ఉండాలి. ప్రతి డిగ్రీ ఉష్ణోగ్రతను తగ్గించినప్పుడు.. కంప్రెసర్ పై భారం పడి దాదాపు 6 శాతం ఎక్కువ ఖర్చు పెరుగుతుంది. మీరు టెంపరేచర్‌ను 24°C లేదా 26°C వద్ద సెట్ చేసి, దానికి తోడు సీలింగ్ ఫ్యాన్‌ను ఆన్ చేస్తే.. రూమ్ అంతటా చల్ల దనం సమానంగా ప్రసరిస్తుంది. దీని వల్ల కంప్రెసర్ నిరంతరం పని చేయాల్సిన అవసరం ఉండదు. ఫలితంగా.. కరెంట్ బిల్లు భారీగా తగ్గుతుంది.
రాత్రి పడుకునేటప్పుడు ఏసీని అలాగే రాత్రంతా ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉంచడం వల్ల కరెంట్ వృథా అవుతుంది. దీని కోసం ప్రతి ఏసీలోనూ ‘స్లీప్ మోడ్’అనే అద్భుతమైన ఫీచర్ ఉంటుంది. దీన్ని ఆన్ చేస్తే.. గదిలోని ఉష్ణోగ్రత రాత్రి సమయంలో.. గంట గంటకూ ఆటో మేటిక్‌గా ఒక డిగ్రీ చొప్పున పెరుగుతుంది. ఉదయం అయ్యే సరికి శరీరం ఉష్ణోగ్రతకు తగినట్లుగా కూలింగ్ సర్దుబాటు అవుతుంది. అలాగే ‘టైమర్’ఆప్షన్‌ను ఉపయోగించి తెల్లవారు జామున 3 లేదా 4 గంటలకు ఏసీ ఆటోమేటిక్‌గా ఆటో-ఆఫ్ అయ్యేలా సెట్ చేసుకోవచ్చు. రోజూ రాత్రి పూట ఈ రెండు సెట్టింగ్స్ వాడడం ద్వారా.. నెల వారీ కరెంట్ బిల్లులో చాలా వరకు ఆదా చేసుకోవచ్చు.
ఏసీ పని తీరు మంద గించడానికి , కరెంట్ బిల్లు విపరీతంగా.. పెరగడానికి మరో ప్రధాన కారణం ఇండోర్ యూనిట్ లోపల ఉండే.. డస్ట్ ఫిల్టర్స్. ఫిల్టర్లపై దుమ్ము పేరుకు పోతే.. గాలి సరిగ్గా బయటకు రాదు. దీని వల్ల గది చల్లబడడానికి కంప్రెసర్‌పై ఎక్కువ ఒత్తిడి పడి అదనపు కరెంట్ ఖర్చవుతుంది. ప్రతి 15 రోజులకు ఒక సారి ఏసీ ఫిల్టర్లను తీసి శుభ్రం చేయడం చాలా ముఖ్యం. అలాగే ‘స్వింగ్’మోడ్‌ను ఆన్ చేసి గాలి నలు మూలలా వెళ్లేలా చూసుకోవాలి.
Also Read: బంపర్ ఆఫర్..75 ఇంచుల టీవీపై కళ్లు చెదిరే డిస్కౌంట్
ఇవి కాకుండా రూమ్ లోకి బయటి వేడి గాలి రాకుండా కిటికీలకు డార్క్ కర్టెన్లు వేయడం, ఏసీ ఆన్ చేసినప్పుడు.. తలుపులు గట్టిగా మూసివేయడం వంటి చిన్న జాగ్రత్తలు పాటించాలి. ఈ మూడు ముఖ్యమైన సెట్టింగ్ మార్పులను సరిగ్గా పాటిస్తే మీ 5-స్టార్ ఏసీ ద్వారా వచ్చే కరెంట్ బిల్లు సగానికి పైగా తగ్గి పోతుంది.
ఖరీదైన 5-స్టార్ ఏసీని కొన్నప్పటికీ సరైన సెట్టింగ్‌లు లేకపోతే.. ప్రయోజనం ఉండదు. పైన పేర్కొన్న టెంపరేచర్, స్లీప్ మోడ్, ఫిల్టర్ మెయింటెనెన్స్ వంటి చిన్న మార్పులతో ఈ వేసవిలో.. మీ కరెంట్ బిల్లు భారాన్ని తగ్గించుకోండి. ఈ ట్రెండింగ్ చిట్కాలను పాటించి వేల రూపాయలు ఆదా చేసుకోండి!