iPhone Battery Saving Tips: ఐఫోన్ వాడే ప్రతి ఒక్కరినీ వేధించే అతిపెద్ద సమస్య బ్యాటరీ లైఫ్. మీరు పాత మోడల్ ఐఫోన్ ఉపయోగిస్తున్నా లేదా కొత్తది వాడుతున్నా.. సాయంత్రానికల్లా ఛార్జింగ్ అయిపోవడం మనం తరచూ చూస్తూనే ఉంటాం. స్క్రీన్ టైమ్ తగ్గించుకోకుండా, రోజువారీ వాడకాన్ని మార్చుకోకుండా ఐఫోన్ బ్యాటరీ టైమ్‌ను పెంచుకునే ఒక అద్భుతమైన మార్గం ఉంది. మనకు తెలియకుండానే బ్యాటరీని పిండేసే ఒక హిడెన్ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం ద్వారా ఈ సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు.
Background App Refresh అనే ఫీచర్ దీనికి ప్రధాన కారణం. మనం యాప్స్ వాడకపోయినా.. బ్యాగ్రౌండ్‌లో అవి ఇంటర్నెట్ ద్వారా కొత్త సమాచారాన్ని డౌన్‌లోడ్ చేసుకుంటూ ఉంటాయి. ఉదా: వాతావరణ సమాచారం, సోషల్ మీడియా కొత్త పోస్ట్‌లు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉంచేందుకు ఇది నిరంతరం పనిచేస్తుంది. యాప్స్ తెరవగానే సరికొత్త సమాచారం కనిపించడం సౌకర్యంగానే ఉన్నప్పటికీ.. ఈ ప్రాసెస్ వల్ల ప్రాసెసర్, బ్యాటరీపై విపరీతమైన భారం పడుతుంది. ఈ ఆప్షన్ ఆఫ్ చేయడం వల్ల యాప్స్ పనిచేయడం ఆగవు, కేవలం మనం తెరిచినప్పుడు మాత్రమే రీఫ్రెష్ అవుతాయి.
Also Read: ప్రైమ్ డే సేల్ కంటే ముందే ఆఫర్లు.. ఈ 5 గాడ్జెట్స్‌పై అమెజాన్‌లో కళ్లు చెదిరే డిస్కౌంట్లు!
ఈ సెట్టింగ్‌ను ఆఫ్ చేయడం చాలా సులభం. మీ ఫోన్‌లోని సెట్టింగ్స్ ఓపెన్ చేసి, జనరల్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ బ్యాగ్రౌండ్ యాప్ రీఫ్రెష్ అనే మెనూ కనిపిస్తుంది. దానిపై టాప్ చేస్తే మీకు ఆఫ్, వైఫై, వైఫై అండ్ సెల్యులార్ డేటా అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. బై డిఫాల్ట్‌గా ఉండే మూడో ఆప్షన్ వల్లే బ్యాటరీ ఎక్కువగా ఖర్చవుతుంది. ఇక్కడ ఆఫ్ అనే ఆప్షన్ ఎంచుకుంటే బ్యాగ్రౌండ్ ప్రాసెస్ పూర్తిగా ఆగిపోయి, బ్యాటరీ లైఫ్ గణనీయంగా పెరుగుతుంది.
అన్ని యాప్స్‌కు పూర్తిగా ఆఫ్ చేయడం ఇష్టం లేకపోతే.. మీకు నచ్చిన యాప్స్‌కు మాత్రమే ఈ ఫీచర్ ఉంచుకోవచ్చు. సెట్టింగ్స్ పేజీలో కింద కనిపించే యాప్స్ లిస్ట్ నుండి ప్రతీ యాప్‌కు విడివిడిగా టోగుల్ బటన్ ఉంటుంది. సోషల్ మీడియా యాప్స్ బ్యాగ్రౌండ్‌లో ఎక్కువ సమాచారాన్ని లాగుతాయి కాబట్టి.. వాటికి ఆఫ్ చేయడం మంచిది. మ్యాప్స్, నావిగేషన్ వంటి ముఖ్యమైన యాప్స్‌కు మాత్రం ఆన్‌లో ఉంచుకోవచ్చు.
ఫోన్ మనకు ఉపయోగకరంగా ఉండాలి. అదే సమయంలో బ్యాటరీ కూడా ఎక్కువ సేపు రావాలి. ఈ చిన్న మార్పు చేసుకోవడం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఐఫోన్ బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. మీ ఐఫోన్‌లో ఈ సెట్టింగ్ ఇప్పటివరకు మార్చకపోతే.. వెంటనే ట్రై చేసి చూడండి.
Also Read: ఐఫోన్ యూజర్లకు అలర్ట్.. మీ లొకేషన్ లీక్ అవ్వకూడదంటే.. ఈ హిడెన్ ఫీచర్ ఆన్ చేసుకోండి!