Telangana Drought: స్వేచ్చ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా నెలకొన్న కరువు పరిస్థితులు చూస్తుంటే కడుపు తరుక్కుపోతోందని, అన్ని జిల్లాల్లో కరువు తాండవం చేస్తోందని, కొన్ని జిల్లాల్లో భూగర్బ జలాలు 20 మీటర్ల లోతుకు పడిపోయాయని కరువును ఎదుర్కోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయ్యిందని తెలంగాణ రక్షణసేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని తెలంగాణ రక్షణసేన కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఎన్ నినో ప్రభావం ఉంటుందని సైంటిస్టులు హెచ్చరించారని.. అయినా పరిస్థితిని ప్రభుత్వం రివ్యూ చేయలేదన్నారు. ప్రభుత్వ చేతగానితనంతో రాష్ట్రంలో కోటి 20 లక్షల ఎకరాల్లో పంటలు ప్రమాదంలో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. కరువుతో అల్లాడుతున్న ప్రజలు, రైతులను ఆదుకోవడానికి తక్షణ చర్యలు చేపట్టాల్సిన సీఎం నాగార్జున సాగర్ లో వరుణయాగం చేసి.. ప్రజలను వారి ఖర్మకు వదిలేశారని మండిపడ్డారు. ఆగస్టులోనే ప్రభుత్వం స్పందించి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదన్నారు.
అడుక్కుంటారో, కొనుక్కుంటారో గానీ రైతులకు నవంబర్ వరకు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వాల్సిందేనని ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేశారు. కర్ణాటక, మహారాష్ట్ర, ఏపీ లాంటి రాష్ట్రాలు ఇప్పటికే కరువు మండలాలను ప్రకటిస్తే.. మన ప్రభుత్వం కనీసం ఆ పనికూడా చేయలేదన్నారు. కరువు మండలాలను ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి కొంత అయినా సాయం అందేదని తెలిపారు. కరువు, రైతుల సమస్యలను తీర్చేందుకు వెంటనే ప్రత్యేక కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.
కృష్ణా జలాలను కాపాడటంలో కూడా కాంగ్రెస్ సర్కార్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో భాగమైన నార్లాపూర్ రిజర్వాయర్ లోని గ్రామ ప్రజలకు పునరావాసం కల్పించి ఆ రిజర్వాయర్ నింపి ఉంటే సమీప ప్రాంతాల్లో గ్రౌండ్ వాటర్ పెరిగేదని.. కల్వకుర్తి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి ఆయకట్టుకైనా ఆ నీటిని ఉపయోగించుకునే ఆస్కారం ఉండేదన్నారు. మన కృష్ణా నీళ్లను ఏపీకి గిఫ్ట్ ప్యాక్ చేసి కుప్పంకు పంపిస్తున్నారని విమర్శించారు. పక్కనే ఉన్న మహబూబ్ నగర్ కు కృష్ణా నీళ్లు రావడం లేదని.. వందల కి.మీ.ల దూరంలో ఉన్న కుప్పంకు నీళ్లు వెళ్తున్నాయని.. ఇది ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ ఫెయిల్యూర్ అని స్పష్టం చేశారు.
Also read: ఇండస్ట్రీలోకి రాకముందు సింగీతం శ్రీనివాస్ రావు ఏం పని చేశారో తెలుసా?
సింగరేణికి ప్రభుత్వం రూ.60 వేల కోట్ల బిల్లులు పెండింగ్ లో పెట్టిందని.. ఆ బకాయిలు చెల్లిస్తే ఇప్పుడు కరెంట్ ఉత్పత్తికి సమస్య వచ్చేది కాదన్నారు. భవిష్యత్ లో హైదరాబాద్ నగరానికి తాగునీటి ముప్పు ఉందని హెచ్చరించారు. రిజర్వాయర్లలో నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజీ కి పడిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత పెరుగుతాయని.. దానికి అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కార్యాచరణ రూపొందించాలన్నారు. తీవ్రమైన కరువుతో ఇబ్బంది పడుతున్న తెలంగాణకు ప్రధాని మోదీ ఉచిత కరెంట్ ఇచ్చి ఆదుకోవాలని కోరారు. రాష్ట్రంలో కరువు ప్రాంతాలను తమ పార్టీ అసెంబ్లీ నియోజకవర్గాల ఇన్ చార్జీలు, ఇతర ముఖ్య నాయకులు సందర్శిస్తారని తెలిపారు. ఇప్పటికే ‘‘ఆపరేషన్ బ్లూ కోడ్’’ పేరుతో రాష్ట్రంలోని ప్రభుత్వ హాస్పిటళ్లలో నెలకొన్న పరిస్థితులపై తమ పార్టీ నేతలు అధ్యయనం చేస్తున్నారని తెలిపారు.
దేశంలో ఎన్నికల ప్రక్రియ మళ్లీ బ్యాలెట్ విధానంలో జరగాలని కవిత డిమాండ్ చేశారు. ఈవీఏంలను మ్యానిపులేషన్ చేసే అవకాశం ఉందని చెప్పారు. దేశంలో మళ్లీ బ్యాలెట్ విధానంలో ఎన్నికలు జరిగితేనే పారదర్శకత ఉంటుందని, అందుకోసం ఢిల్లీ వరకు వెళ్లైనా ఫైట్ చేస్తామని చెప్పారు. సర్ ప్రక్రియలో జరిగిన తప్పులకు సీఈసీ రిజైన్ చేస్తే సమస్య పరిష్కారం కాదన్నారు. టెంపరరీ సొల్యుషన్ కాకుండా సిస్టమ్ లో ఛేంజ్ వచ్చేలా పర్మినెంట్ సొల్యుషన్ కావాలన్నారు. ఖైరతాబాద్ ఉప ఎన్నిక సహా రాష్ట్రంలో ఏ ఎన్నికలు వచ్చినా తమ పార్టీ పోటీ చేస్తుందని చెప్పారు. కొత్త పార్టీకి తమ అజెండా చెప్పుకునేందుకు ఎన్నికలు మంచి అవకాశమని చెప్పారు.
Also read: ఫుడ్ డెలివరీ లేట్ చేసాడని డెలివరీ బాయ్‌ని కొట్టిన భర్త భార్య.. కేసు నమోదు!