Axiom-4 Launch: వాయిదాల మీద వాయిదా పడుతున్న శుభాంశు శుక్లా అంతరిక్ష యాత్ర ఇవాళ జరగనుంది. యాక్సియం-4లో మొత్తం నలుగురు వ్యోమగాములు.. మధ్యాహ్నం అంతరిక్ష యాత్రకు బయలు దేరనున్నారు. వ్యోమగాముల రోదసియాత్రపై నాసా ఓ ప్రకటన విడుదల చేసింది. ఈరోజు మధ్యాహ్నం 12:01 గంటలకు ఫాల్కన్ 9 రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు వెల్లడించింది. రేపు సాయంత్రం నాలుగున్నర గంటలకు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంతో అనుసంధానం కానుంది. ఈ ప్రయోగంలో శుభాంశు మిషన్ పైలట్‌గా బాధ్యతలు నిర్వహిస్తారు. అసలు ఈ ప్రయోగం మే 29న జరగాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. శుభాంశు శుక్లా బృందం ఐఎస్‌ఎస్‌లో 14 రోజుల పాటు ఉండనుంది.
41 ఏళ్ల తర్వాత ఓ భారతీయుడు.. అంతరిక్ష కేంద్రంలోకి అడుగు పెట్టబోతున్నాడు. 1984లో రష్యాకు చెందిన సోయజ్ రాకెట్ ద్వారా.. రోదసియానం చేసిన రాకేశ్ శర్మ తర్వాత.. మళ్లీ ఓ భారత పౌరుడు స్పేస్‌లోకి వెళ్లడం ఇదే తొలిసారి. యాక్సియమ్ స్పేస్ చేపడుతున్న యాక్సియమ్-4 మిషన్‌లో భాగంగా.. శుక్లా రోదసీలోకి వెళ్తున్నారు. 28 గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం చేరుకుని 14 రోజుల పాటు వివిధ ప్రయోగాలు నిర్వహిస్తారు. శుభాన్షు అనుభవాలను భవిష్యత్ ప్రయోగాలకు పునాదిగా మార్చుకోవాలని ఇస్రో భావిస్తోంది.
ఈ మిషన్‌కు శుక్స్ పైలట్‌గా వ్యవహరిస్తారు. ఈ ప్రయోగం.. భారతదేశ అంతరిక్ష పరిశోధనల్లో ఓ మైల్ స్టోన్‌గా నిలవనుంది. భవిష్యత్తులో భారత్ చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌కు.. ఈ యాత్ర కీలకమైన అనుభవాన్ని అందిస్తుంది. యాక్సియమ్-4 మిషన్‌లో.. జీరో గ్రావిటీ వాతావరణంలో.. మెంతి, పెసర మొలకల్ని పెంచే ప్రయోగాలు చేపట్టనున్నారు. ఇది భవిష్యత్తులో అంతరిక్ష యాత్రల్లో ఆహార ఉత్పత్తికి సంబంధించిన పరిశోధనలకు సహాయపడనుంది. ఇక.. యోగాసనాలను ప్రదర్శించి.. వాటి ప్రభావంపై అధ్యయనం చేయనున్నారు. ఇది.. వ్యోమగాముల ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావాలను చూపుతుందనేది అర్థం చేసుకునేందుకు సాయపడుతుంది.
Also Read: గూగుల్ ఏఐ ట్రైనింగ్ కోసం యూట్యూబ్ వీడియోలు.. కంటెంట్ క్రియేటర్లు సీరియస్
నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్ రూపొందించిన కొన్ని ప్రత్యేక భారతీయ కళాఖండాలను శుక్లా ఐఎస్ఎస్‌కు తీసుకెళ్తున్నారు. తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ జ్ఞాపకంగా.. ఆయనకు సంబంధించిన ఓ జ్ఞాపకాన్ని కూడా తనతో పాటు రోదసీలోకి తీసుకెళ్లనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్న తర్వాత.. భారత ప్రధాని నరేంద్రమోడీతో.. వ్యోమగాములు మాట్లాడే అవకాశం ఉంది. అదేవిధంగా.. స్కూల్ విద్యార్థులు, విద్యావేత్తలు అంతరిక్ష రంగంలో పనిచేస్తున్న వారితోనూ ఆన్ లైన్ ద్వారా ముచ్చటించే అవకాశం ఉంది. ఈ మిషన్ ద్వారా.. అంతరిక్ష పరిశోధనల్లో భారత్ తన పాత్రను మరింత బలోపేతం చేసుకునేందుకు.. శుభాన్షు శుక్లా యాత్ర ఎంతో కీలకమైనదిగా భావిస్తున్నారు.