iPhone Face ID vs Android Face Unlock: మొబైల్ ఫోన్ వాడేటప్పుడు భద్రత అనేది మనందరికీ చాలా ముఖ్యం. ఎవరికైనా మన ఫోన్ దొరికితే వెంటనే ఓపెన్ కాకుండా ఉండటానికి పాస్‌వర్డ్స్, ఫింగర్‌ప్రింట్స్ లాంటివి వాడతాం. ఇవన్నింటి కంటే ఫేషియల్ రికగ్నిషన్ లేదా మొహాన్ని స్కాన్ చేసి ఫోన్ అన్‌లాక్ చేయడం చాలా సులభమైన పద్ధతి. మనం ఊరికే ఫోన్ వైపు చూడగానే క్షణంలో ఓపెన్ అయిపోతుంది. అయితే, ఈ ఫేస్ లాక్ టెక్నాలజీ ఆండ్రాయిడ్ ఫోన్లలోనూ, ఐఫోన్లలోనూ ఒకేలా పనిచేయదు. ఐఫోన్లలో దీన్ని ‘ఫేస్ ఐడీ’ అంటారు. ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ఫేస్ అన్‌లాక్’ అంటారు. ఈ రెండింటి మధ్య అసలు తేడా ఏంటో ఇప్పుడు చూద్దాం.
యాపిల్ ఐఫోన్ ఎక్స్ మోడల్ వచ్చినప్పటి నుంచి ఫేస్ ఐడీ అందుబాటులోకి వచ్చింది. ఐఫోన్ ముందు భాగంలో ఉండే ట్రూడెప్త్ కెమెరా మన ముఖంపై కొన్ని వేల అదృశ్య చుక్కలను ప్రసరింపజేస్తుంది. దీనివల్ల మన ముఖం త్రీడీ మ్యాప్‌లా మారుతుంది. అంతేకాకుండా ఒక ఇన్‌ఫ్రారెడ్ ఇమేజ్‌ని కూడా క్యాప్చర్ చేసి సేవ్ చేసుకుంటుంది. మనం ఫోన్ చూడగానే ఇది కేవలం ఫ్లాట్ ఫోటోలా కాకుండా.. మన ముఖం యొక్క త్రీడీ రూపాన్ని పర్ఫెక్ట్ గా పోల్చుకుని అన్‌లాక్ చేస్తుంది. అందుకే చీకటిలో ఉన్నా, అద్దాలు పెట్టుకున్నా ఇది పనిచేస్తుంది.
Also Read: వేడి నీళ్లలో ముంచినా చెక్కుచెదరదు.. హానర్ నుంచి అసాధారణ ఫీచర్లతో సరికొత్త ఫోన్!
యాపిల్ ఫేస్ ఐడీ ఎంత సెక్యూర్ అంటే.. దీన్ని ఎవరూ మన ఫోటో చూపించి మోసం చేయలేరు. మనం నిద్రపోతున్నప్పుడు వేరేవాళ్లు ఫోన్ మన ముఖం ముందు పెట్టినా ఓపెన్ అవ్వదు. కేవలం మన కళ్లు తెరిచి ఉన్నప్పుడు మాత్రమే ఇది ఓపెన్ అవుతుంది. ఒక మిలియన్‌లో కేవలం ఒక్కసారి మాత్రమే ఇది తప్పుగా గుర్తించే అవకాశం ఉంటుంది. అందుకే యాప్ లాగిన్స్, పేమెంట్స్ వంటి సున్నితమైన విషయాల్లో కూడా ఐఫోన్ యూజర్లు ఫేస్ ఐడీని నమ్మి వాడుతుంటారు.
సాధారణంగా చాలా ఆండ్రాయిడ్ ఫోన్లలో ఫేస్ అన్‌లాక్ అనేది పూర్తిగా సాఫ్ట్‌వేర్ ఆధారంగా పనిచేస్తుంది. ఇందులో ఎలాంటి ప్రత్యేక హార్డ్‌వేర్ ఉండదు. మన ఫొటోను మొబైల్ కెమెరా క్యాప్చర్ చేసి టూడీ ఇమేజ్‌గా సేవ్ చేసుకుంటుంది. చీకట్లో ఉన్నప్పుడు లేదా మనం కళ్లజోడు పెట్టుకున్నప్పుడు ఇది సరిగ్గా పనిచేయకపోవచ్చు. అంతేకాకుండా.. కొన్ని సాధారణ ఆండ్రాయిడ్ ఫోన్లలో మన ఫోటోను కెమెరా ముందు చూపించినా ఫోన్ అన్‌లాక్ అయిపోయే రిస్క్ ఉంటుంది.
అయితే అన్ని ఆండ్రాయిడ్ ఫోన్లు ఒకేలా ఉండవు. గూగుల్ పిక్సెల్, శాంసంగ్ గెలాక్సీ వంటి లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో మాత్రం భద్రత చాలా ఎక్కువగా ఉంటోంది. గూగుల్ పిక్సెల్ 8 ఆపై మోడళ్లలో పవర్‌ఫుల్ ప్రాసెసర్లు, అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఫేస్ అన్‌లాక్‌ను చాలా సెక్యూర్ చేశారు. ఇవి ఫోటోలతో అస్సలు మోసపోవు. మొత్తానికి మీరు ఫోన్ భద్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే ఐఫోన్ ఫేస్ ఐడీ చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.
Also Read: USB-A To USB-C కేబుల్‌తో ఫాస్ట్ ఛార్జింగ్ సాధ్యమేనా? టెక్ నిపుణులు ఏం చెబుతున్నారంటే!