Annual Recharge Plans: దేశంలో టాప్ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ (Vi) తమ యూజర్ల కోసం ఎన్నో రకాల రీఛార్జ్ ప్లాన్లను తీసుకొచ్చాయి. అయితే ఎప్పటికప్పుడు పెరుగుతున్న రీఛార్జ్ ధరల ప్రభావం పడకుండా ఏడాది పాటు ఫ్రీ కాల్స్, డేటా అందించే వార్షిక ప్లాన్లను సైతం అందుబాటులో ఉంచాయి. 365 రోజుల వ్యాలిడిటీ కలిగిన ప్లాన్లకు సంబంధించి.. ఏ టెలికాం కంపెనీ ఎక్కువ బెనిఫిట్స్ అందిస్తుందో ఈ కథనంలో చూద్దాం.
ఇంట్లో వైఫై ఉండి, కాల్స్ కోసం మాత్రమే తక్కువ బడ్జెట్ లో ప్లాన్స్ కోరుకునేవారికి ఎయిర్ టెల్, వీఐలో మంచి ప్లాన్స్ అందుబాటులో ఉన్నాయి. ఎయిర్ టెల్ తీసుకొచ్చిన రూ. 1,849 ప్లాన్.. 365 రోజుల వ్యాలిడిటీతో అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, మొత్తం కాలానికి 3,600 ఎస్ఎంఎస్‌లు అందించనుంది. అయితే ఇందులో రోజూవారీ డేటా ఉండదు. ఇక వీఐ సైతం రూ.1,849 ధరకే వార్షిక ప్లాన్ తీసుకొచ్చింది. ఇందులో కూడా ఏడాది పొడవునా అన్‌లిమిటెడ్ కాల్స్, ఉచితంగా 3,600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అటు జియో విషయానికి వస్తే.. కేవలం కాలింగ్ కోసం మాత్రమే చౌకైన వార్షిక ప్లాన్ ఏదీ లేదు. జియో స్టార్టింగ్ వార్షిక ప్లాన్ రూ. 3,599 నుంచే ప్రారంభం కానుంది.
ప్రతిరోజూ ఎక్కువ డేటా అవసరమయ్యే వారి కోసం మూడు కంపెనీలు 1.5GB నుండి 2.5GB వరకు రోజువారీ డేటా ప్లాన్‌లను ప్రవేశపెట్టాయి. జియో రూ. 3,599 ప్లాన్ లో రోజుకు 2.5GB హై-స్పీడ్ డేటాను 365 రోజుల పాటు అందిస్తుంది. దీంతో పాటు అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజుకు 100 ఎస్ఎంఎస్‌లు, జియో టీవీ, జియో ఏఐక్లౌడ్ యాప్‌లకు ఉచిత యాక్సెస్ లభిస్తుంది. అర్హులైన యూజర్లు 5G సైతం పొందొచ్చు. అటు ఎయిర్ టెల్ కూడా రూ. 3,599 ధరకే ఏడాది ప్లాన్‌ను అందిస్తోంది. అయితే దీనిలో రోజుకు 2GB డేటా, అపరిమిత కాల్స్, అర్హులకు 5G డేటా లభిస్తాయి.
ఇక వీఐ విషయానికి వస్తే.. రూ. 3,499, రూ. 3,599 ప్లాన్‌లు అందుబాటులో ఉన్నాయి. రూ. 3,499 ప్లాన్‌లో రోజుకు 1.5GB డేటా ఇస్తుండగా రూ. 3,599 ప్లాన్‌లో రోజుకు 2GB డేటాను అందిస్తోంది. వీఐ ప్లాన్లలో ఉన్న అతిపెద్ద ప్లస్ పాయింట్ ‘హీరో అన్‌లిమిటెడ్’ ఆఫర్. దీని ద్వారా రాత్రి 12 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా అన్‌లిమిటెడ్ డేటాను వాడుకోవచ్చు. ఇది రోజువారీ లిమిట్ నుంచి కట్ అవ్వదు.
Also Read: త్వరలో 5 కొత్త CNG కార్ల ఎంట్రీ.. మైలేజీతో పాటు ఫీచర్లు కూడా అదుర్స్!
రోజువారీ డేటాతో పనిలేకుండా కేవలం కాలింగ్ ప్లాన్ మాత్రమే కావాలనుకుంటే రూ. 1,849 ధరతో ఎయిర్‌టెల్, వీఐ ప్లాన్‌లు బెస్ట్ ఆప్షన్ గా ఉన్నాయి. ఒకవేళ ప్రతిరోజూ ఎక్కువ డేటా వాడే వారైతే 5జీ కనెక్టివిటీ కోసం జియో రూ. 3,599 ప్లాన్ ప్రయోజనకరంగా ఉంటుంది. ఎందుకంటే ఇది ఎయిర్‌టెల్ కంటే రోజుకు 0.5GB అదనంగా (ప్రతీ రోజూ 2.5GB) డేటాను అందిస్తుంది. ఇక రాత్రి పూట సినిమాలు, వీడియోలు డౌన్‌లోడ్, స్ట్రీమింగ్ చేసే అలవాటు ఉన్నవారికి వీఐ నైట్ అన్‌లిమిటెడ్ ప్లాన్ బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు.
Also Read: టయోటా కార్లు ఇక మరింత స్టైలిష్.. గ్లాంజా, హైక్రాస్ కు అదిరిపోయే లుక్!