Jio vs Vi: దేశీయ టెలికాం రంగంలో అగ్రగామి సంస్థలైన రిలయన్స్ జియో, వొడాఫోన్ ఐడియా (Vi) వినియోగదారుల కోసం రూ. 299 ధరలో ఆకర్షణీయమైన ప్లాన్లను అందిస్తున్నాయి. అయితే ఏ ప్లాన్ ఎలాంటి ప్రయోజనాలను ఇస్తుందో, బెనిఫిట్స్ పరంగా ఏది బాగా ఉపయోగపడుతుందో ఈ కథనంలో చూద్దాం.
జియో అందిస్తున్న రూ. 299 ప్లాన్ 28 వ్యాలిడితో రూపొందింది. ఇందులో రోజుకు 1.5 జీబీ చొప్పున మొత్తం 42 జీబీ హై-స్పీడ్ డేటా లభిస్తుంది. పరిమితి పూర్తయిన తర్వాత డేటా స్పీడ్ 64 కేబీపీఎస్‌కు తగ్గుతుంది. వీటితో పాటు అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితంగా లభిస్తాయి.
జియో ప్లాన్ ప్రత్యేకతకు వస్తే.. రూ. 35,100 విలువైన గూగుల్ జెమిని ప్రో ప్లాన్ (5,000 జీబీ క్లౌడ్ స్టోరేజ్) ఉచితంగా లభిస్తుంది. అంతేకాకుండా జియోటీవీ, జియో ఏఐ క్లౌడ్, జియో హాట్‌స్టార్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉచితంగా పొందవచ్చు. అయితే హాట్‌స్టార్ ప్రయోజనాలు పొందాలంటే రీఛార్జ్ ముగిసిన 48 గంటల్లో మళ్లీ అర్హత గల ప్లాన్‌తో రీఛార్జ్ చేసుకోవాల్సి ఉంటుంది.
వొడాఫోన్ ఐడియా రూ. 299 ప్లాన్ కాలపరిమితి కూడా 28 రోజులే. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, ప్రతీరోజు 100 ఎస్‌ఎంఎస్‌లు చేసుకోవచ్చు. అలాగే రోజుకు 2 జీబీ డేటాను సైతం వీఐ అందిస్తోంది. Vi ప్లాన్‌లోని ప్రత్యేకత ఏంటంటే.. రాత్రి 12 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉచితంగా అపరిమిత నైట్ డేటాను వాడుకోవచ్చు.
వీఐ ప్లాన్ లో సోమవారం నుంచి శుక్రవారం వరకు మిగిలిపోయిన డేటాను శని, ఆదివారాల్లో వాడుకునే ‘వీకెండ్ డేటా రోల్‌ఓవర్’ సౌకర్యం ఉంది. దీంతో పాటు ప్రతినెల 2 జీబీ బ్యాకప్ డేటాను Vi యాప్ ద్వారా పొందవచ్చు. అలాగే వీఐ మూవీస్ & టీవీ యాప్ ద్వారా ఉచితంగా సినిమాలు, టీవీ షోలు చూడవచ్చు. ‘టుడేస్ ఆఫర్’ కింద ఎంపిక చేసిన వినియోగదారులకు నాన్‌స్టాప్ అపరిమిత డేటా అప్‌గ్రేడ్‌ను కూడా కంపెనీ ఇస్తోంది.
Also Read: రూ. 699లకే Airtel, Jio బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్లు.. రెండింటిలో ఏది బెస్ట్? దేని వల్ల ఎక్కువ లాభం!
ప్రస్తుతం ఎయిర్‌టెల్ వద్ద రూ. 299 ప్లాన్ అందుబాటులో లేకపోవడంతో పోటీ అంతా జియో, వీఐ మధ్యనే ఉంది. కాబట్టి మీకు ఉచిత ఓటీటీలు, ఏఐ టూల్స్, క్లౌడ్ స్టోరేజ్ వంటి ప్రయోజనాలు కావాలనుకుంటే జియో ప్లాన్ బెస్ట్. అలా కాకుండా రాత్రివేళ అపరిమిత ఇంటర్నెట్, వీకెండ్ డేటా రోల్‌ఓవర్ వంటి డేటా ఆధారిత బెనిఫిట్స్ కావాలనుకునే వారికి వొడాఫోన్ ఐడియా ప్లాన్ బాగా ఉపయోగపడుతుంది.