Ola Electric : విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా (OLA) చూట్టూ రోజురోజుకు ఉచ్చు బిగుస్తోంది. ద్విచక్ర వాహనాల నాణ్యత, విక్రయానంతరం సేవలకు సంబంధించి వినియోగదారుల నుంచి తరచూ ఫిర్యాదులు రావటంపై వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ తాజాగా విచారణకు ఆదేశించింది. ఈ విషయంపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని వెల్లడించింది.
ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ ఓలా అతి తక్కువ కాలంలోనే ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తనదైన ముద్ర వేసింది. అయితే ఈ సంస్థ తీసుకువస్తున్న వాహనాల నాణ్యతపై ఇప్పటికే పలు ఫిర్యాదులు అందాయి. నాణ్యతలో లోపాలు ఉండటంతో పాటు విక్రయానంతరం పలు సమస్యలు ఎదురైనట్టు వినియోగదారులు ఫిర్యాదుల్లో పేర్కొన్నారు. ఎన్నో ఫిర్యాదులు అందినప్పటికీ సర్వీస్ సెంటర్స్ సైతం వినియోగదారుల్ని పట్టించుకోకపోవడంపై వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ విచారణను ముమ్మరం చేసింది. దీంతో తాజాగా విచారణకు ఆదేశించిన ఈ సంస్థ బిఐఎస్ డైరెక్టర్ జనరల్ 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించింది.
ఇక ఓలా ఎలక్ట్రిక్ (OLA ELECTRIC) పై ఏడాదిలో జాతీయ వినియోగదారుల సేవా కేంద్రంకు దాదాపు 10వేలకు పైగా ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో సీసీపీఏ (CCPA) రంగంలోకి దిగింది. ఛార్జింగ్, ఉచిత సర్వీస్, వారంటీ, సేవల్లో వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేశారు. వీటితో పాటు వారంటీని తిరస్కరించడం, సర్వీస్ చేసినప్పటికీ లోపాలు పునరావృతం కావడం జరుగుతూనే ఉందని తెలిపారు. ఈ సంస్థ ప్రచారం చేసిన దానితో పోలిస్తే పనితీరులో తీవ్ర స్థాయిలో లోపాలు ఉన్నాయని వినియోగదారులు పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదులతో సీసీపీఏ అక్టోబరు 7న ఓలాకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. దీనిపై అక్టోబర్ 21న స్పందించిన ఓలా.. 99.1 శాతం ఫిర్యాదులను పరిష్కరించామని, వినియోగదారులకు ఎటువంటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని తెలిపింది. ఇక ఓలా ఈ వివరణ ఇచ్చినప్పటికీ తాజాగా ఆ సంస్థపై విచారణకు ఆదేశించడం చర్చకు దారితీసింది.
ఇక ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో తనదైన ముద్ర వేసిన ఓలా (OLA).. ఇప్పటికే పలు స్కూటర్స్ ను లాంఛ్ చేసింది. పలు బ్యాటరీ ఆఫ్షన్స్ లో స్కూటర్స్ ను తీసుకొచ్చింది. ఈ స్కూటర్స్ కు మొదట్లో ఎక్కువ డిమాండ్ కనిపించినప్పటికీ తర్వాత తయారీలో పలు లోపాలు కనిపించడంతో వినియోగదారుల నుంచి ఫిర్యాదులు పెరిగిపోయాయి. ఓలా స్కూటర్స్ తో ప్రమాదాలు సైతం జరగడంతో ఈ విషయంలో కొనుగోలుదారులు అప్రమత్తమయ్యారు. తాజాగా బెంగళూరులో సైతం ఓలా తీరుపై నిరసన వ్యక్తం అయ్యింది. ఓ వినియోగదారుడు ఓలా సర్వీస్ సెంటర్ కు వచ్చి తన సమస్యను చెప్పగా.. అక్కడ వాళ్లు పట్టించుకోకపోవడంతో తీవ్ర అసహనానికి గురయ్యాడు. తన సమస్యను పట్టించుకోలేదని కోపంతో సర్వీస్ సెంటర్ కు నిప్పు పెట్టాడు. ఈ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇలాంటి ఘటనలు ఎప్పటికప్పుడు జరుగుతున్నప్పటికీ ఓలా వాహనాల్లో లోపాలు కనిపిస్తూనే వస్తున్నాయి. ఇక వరుసగా ఈ ఫిర్యాదులు వస్తూనే ఉండటంతో తాజాగా వినియోగదారుల హక్కుల నియంత్రణ సంస్థ అప్రమత్తమైంది.
ALSO READ : సామ్‌సంగ్ గెలాక్సీ ఎస్25 సిరీస్ వచ్చేస్తుందోచ్.. లాంఛ్, ప్రీ బుకింగ్స్ డేట్స్ లీక్