Orkut Returning: ఆర్కుట్.. ఈ పేరు చెప్పగానే కొందరు వ్యక్తులు వెంటనే రియాక్ట్ అవుతారు. భారతదేశంలో ఒకప్పుడు నంబర్ వన్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్. కాలక్రమేణా మార్పులు జరుగుతుండడంతో ట్రెండ్‌ను క్యాచ్ చేయలేకపోయింది. పుష్కర కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. దాని వ్యవస్థాపకుడు చేసిన ఓ కీలక ప్రకటన ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
జెన్ Z, జెన్ ఆల్ఫా.. ఈ తరానికి ఆర్కుట్ పేరు కొత్తగా అనిపించవచ్చు. ఒకప్పుడు దాన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌గా పిలుచుకునేవారు. ప్రొఫైల్‌లను చూడటం, ఒకరి ప్రొఫైల్‌లపై ఒకరు సందేశాలు పంపడం, ఇష్టమైన కమ్యూనిటీలతో కనెక్ట్ కావడం రెండు దశాబ్దాల కిందట మొదలైంది. ఫీడ్‌కు బదులుగా స్క్రాప్స్ ఉండేవి. ప్రజలు తమ స్నేహితులకు స్క్రాప్స్ పంపేవారు. ఎక్కువ స్క్రాప్స్ ఉన్నవారిని పాపులర్‌గా పరిగణించేవారు.
ఇదంతా రెండు దశాబ్దాల మాట. ఫేస్‌బుక్, ఎక్స్, ఇన్‌స్టా రావడంతో ఆర్యుట్ ప్రభావం తగ్గింది. దాదాపు 12 ఏళ్ల తర్వాత ఆర్కుట్ మళ్లీ వార్తల్లోకి వచ్చింది. వ్యవస్థాపకుడు ఆర్కుట్ బ్యూక్కోక్టెన్ కొత్త సోషల్ నెట్‌వర్క్‌ను నిర్మించడానికి ప్రజల నుంచి మద్దతు కోరారు. లైక్‌లు, వీక్షణలు, అల్గారిథమ్‌ల కంటే నిజమైన వ్యక్తులు, స్నేహాలు-సంబంధాలకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే ఇంటర్నెట్‌ను సృష్టించడమే అతడి లక్ష్యం. గూగుల్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఓర్కుట్ బయుకోక్టెన్.. 2004లో ఓర్కుట్ ప్లాట్‌ఫామ్‌ను క్రియేట్ చేశారు. అది గూగుల్ అంతర్గత ప్రాజెక్ట్‌గా అభివృద్ధి చేశారు.
2014లో గూగుల్.. ఓర్కుట్‌ను మూసివేసినప్పటికీ దాని హక్కులు అతని వద్ద ఉన్నాయి. ఓర్కుట్.కామ్ యజమానిగా ఆయన కొనసాగుతున్నారు. ఏఐ సృష్టించిన కంటెంట్, నకిలీ ప్రొఫైల్స్, అల్గారిథమ్‌ల పెరుగుతున్న ప్రభావం వల్ల ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో ఆర్కుట్ రీఎంట్రీ వార్త కలకలం రేపింది. ప్రజలను కనెక్ట్ చేయడం కంటే.. వారిని స్క్రీన్‌లకు అతుక్కుపోయేలా చేయడంపైనే సోషల్ మీడియా ఎక్కువ దృష్టి పెట్టిందని ఆర్కుట్ వ్యవస్థాపకుడు బలంగా నమ్ముతున్నారు. ఇంటర్నెట్‌ను తిరిగి మానవులకు మరింత చేరువ చేయాలన్నది ఆయన కోరికగా తెలుస్తోంది.
ఆర్కుట్.. భారతదేశం, బ్రెజిల్‌లో అత్యంత ప్రజాదరణ పొందింది. 2014లో గూగుల్ దీన్ని మూసివేసింది. ఆర్కుట్ పాత వెబ్‌సైట్, ఖాతాలు పునఃప్రారంభించబడలేదు. ప్రస్తుతం నిజమైన వ్యక్తులు, స్నేహాలు-కమ్యూనిటీ ఆధారంగా కొత్త సోషల్ నెట్‌వర్క్ కావాలా అని వినియోగదారులను అడుగుతూ దాని అధికారిక వెబ్‌సైట్‌లో ఓ ప్రచారం సాగుతోంది. ప్రజలు అందులో నమోదు చేసుకుని మద్దతు పొందవచ్చు. నమోదు చేసుకున్నంత మాత్రాన పాత ఖాతా తిరిగి వస్తుందని గానీ, కొత్త ప్లాట్‌ఫామ్‌లో మీ యూజర్ నేమ్ సురక్షితంగా ఉంటుందని అర్థం కాదు. కొత్త సోషల్ నెట్‌వర్క్ ఎప్పుడు ప్రారంభమవుతుందో ఇంకా ప్రకటించలేదు.
ALSO READ: ఇంట్లోనే కెఫే లాంటి కాఫీ రావాలా? రూ.15,000 బడ్జెట్‌లో బెస్ట్ కాఫీ మెషిన్స్ ఇవే!
తమ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసిన ఒక బహిరంగ లేఖలో నేటి యుగంలో సోషల్ మీడియా మారుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేసింది ఆర్కుట్. సోషల్ నెట్‌వర్కింగ్ అసలు ఉద్దేశ్యం ప్రజలను అనుసంధానించడమే. ఇప్పుడు చాలా ప్లాట్‌ఫారమ్‌లు వినియోగదారుల దృష్టిని నిలుపుకోవడంపై ఫోకస్ చేస్తున్నాయని వాదిస్తున్నారు. ప్రజలు మరో మనిషితో అనుసంధానం అవ్వడమే సోషల్ మీడియా ముఖ్య ఉద్దేశం. ఈ నమ్మకం బలహీనపడితే ఆన్‌లైన్ సంభాషణల అనుభవం కూడా మారిపోవచ్చు. ఆర్కుట్ అధికారిక వెబ్‌సైట్‌లో జరుగుతున్న ఈ ప్రచారానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల నుండి మద్దతు లభించింది. 115 దేశాలకు చెందిన ప్రజల నుండి ఇప్పటివరకు 2,60,000కు పైగా మద్దతు పోస్టులు వచ్చాయి. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఏదైనా వినియోగదారుల గోప్యత, నకిలీ ఖాతాలు, ఆన్‌లైన్ భద్రత, కంటెంట్ నియంత్రణ వంటి సవాళ్లను పరిష్కరించాలి.