Jio Recharge Plans: మొబైల్‌లో ఇంటర్నెట్ ఎక్కువగా వాడకుండా.. కేవలం ఫోన్ కాల్స్ కోసం సిమ్ ఉపయోగించే వారికి రిలయన్స్ జియో మంచి అవకాశం తీసుకొచ్చింది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో కొత్త వాయిస్ ఓన్లీ రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తెచ్చింది. ఈ ప్లాన్ల ధరలు రూ.147 నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇందులో మొబైల్ డేటా ఉండదు. కాల్స్, ఎస్ఎంఎస్‌లకు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చే వినియోగదారులకు ఈ ప్లాన్లు ఉపయోగపడతాయి. ఎయిర్‌టెల్, వీఐ కూడా ఇలాంటి ప్లాన్లను తీసుకొచ్చిన నేపథ్యంలో జియో ఈ నిర్ణయం తీసుకుంది.
జియో తీసుకొచ్చిన వాయిస్ ఓన్లీ ప్లాన్లలో రూ.147 రీఛార్జ్ మొదటి ఎంపిక. ఈ ప్లాన్‌తో 22 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, 300 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. రూ.177 ప్లాన్‌తో 28 రోజుల వ్యాలిడిటీ వస్తుంది. రూ.196 ప్లాన్‌తో 30 రోజుల పాటు సేవలు పొందొచ్చు. ఇక రూ.197 ప్లాన్ నెలవారీ రీఛార్జ్ కోరుకునే వారికి ఉపయోగపడుతుంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ రీఛార్జ్ చేసిన తేదీ ఆధారంగా ఉంటుంది. ఉదా: ఒక నెల 5వ తేదీన రీఛార్జ్ చేస్తే.. తర్వాతి నెల 5వ తేదీన మళ్లీ రీఛార్జ్ చేసుకోవాలి.
Also Read: మనలాగే మాట్లాడే ఈ ‘పర్సనల్ ఏఐ అవతార్’ గురించి తెలుసా? గూగుల్ జెమిని కొత్త ఫీచర్ ఇదే!
తరచూ రీఛార్జ్ చేసుకోవడం ఇష్టం లేని వారికి జియో రూ.448 ప్లాన్ మరో ఎంపికగా ఉంది. ఈ ప్లాన్‌తో 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు 1,000 ఎస్ఎంఎస్‌లు కూడా వస్తాయి. ప్లాన్ వివరాల్లో జియో యాప్స్, ఇతర ఓటీటీ సేవలకు యాక్సెస్ కూడా పేర్కొన్నారు. అయితే, ఈ ప్రయోజనాల ఖచ్చితమైన వివరాలను రీఛార్జ్ చేసే ముందు చెక్ చేసుకోవడం మంచిది.
ఎక్కువ రోజులు సిమ్ యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారి కోసం జియో రూ.1,748 ప్లాన్‌ను అందిస్తోంది. దీనితో 336 రోజుల వ్యాలిడిటీ, అన్‌లిమిటెడ్ కాలింగ్, 3,600 ఎస్ఎంఎస్‌లు లభిస్తాయి. అలాగే ఓటీటీ సబ్‌స్క్రిప్షన్లు కూడా ఉచితంగా అందుతాయని ప్లాన్ వివరాలు చెబుతున్నాయి. ఇందులో మొబైల్ డేటా మాత్రం ఉండదు.
ఇంట్లో వైఫై వాడుతూ బయటకు వెళ్లినప్పుడు కాల్స్ మాత్రమే చేసే వారికి ఈ ప్లాన్లు సరిపోవచ్చు. అలాగే రెండో సిమ్‌ను యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి కూడా ఇవి ఉపయోగపడతాయి. అయితే, వాట్సప్, యూట్యూబ్ వంటి యాప్స్‌ను మొబైల్ డేటాతో వాడాలంటే ప్రత్యేక డేటా ప్యాక్ అవసరం. రీఛార్జ్ చేసే ముందు జియో అధికారిక యాప్‌లో వ్యాలిడిటీ, ఓటీటీ ప్రయోజనాలు, ఎస్ఎంఎస్ పరిమితులను ఒకసారి చూసుకోవడం మంచిది.
Also Read: టెక్ ప్రపంచంలో ఊహకందని అద్భుతం.. శాంసంగ్ నుంచి 17 ఇంచుల ట్యాబ్లెట్, జేబులో పట్టేస్తుంది!