Samsung Galaxy Glasses: స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ వైపు చూడాల్సిన అవసరం లేకుండా.. కళ్ల ముందే టెక్నాలజీ కనిపిస్తే ఎలా ఉంటుంది? ఇక ఇది ఊహ కాదు.. నిజం కాబోతోంది. స్మార్ట్‌ఫోన్, స్మార్ట్‌వాచ్‌ల తర్వాత టెక్ ప్రపంచం ఇప్పుడు స్మార్ట్ గ్లాసెస్ వైపు వేగంగా అడుగులు వేస్తోంది. ఈ రేసులోకి శాంసంగ్ కూడా అడుగుపెట్టేందుకు సిద్ధమైంది. తమ తొలి ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించేందుకు కంపెనీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే గ్లోబల్ ఈవెంట్లలో వీటి లుక్, ఫీచర్లను పరిచయం చేసిన శాంసంగ్.. ఇప్పుడు మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. మరి ఈ ఏఐ గ్లాసెస్‌లో ఏముంది? ఇవి ఎలా పనిచేస్తాయి? ఎప్పటి నుంచి అందుబాటులోకి రానున్నాయి? అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందామా..
ఈ స్మార్ట్ అద్దాల ధర ఎంత ఉంటుందనేది ఇప్పటివరకు శాంసంగ్ అధికారికంగా చెప్పలేదు. అయితే వచ్చే నవంబర్ నెలలోనే వీటి అసలు ధర, ఏయే దేశాల్లో అందుబాటులోకి వస్తాయనే వివరాలను కంపెనీ ప్రకటించనుంది. అదే నెలలో ఇవి కొనుగోలుకు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రముఖ కొరియన్ మీడియా నివేదికల ప్రకారం.. ఈ గ్లాసెస్‌తో శాంసంగ్ కొత్త వేరబుల్ కేటగిరీలోకి అడుగుపెడుతోంది. ఇప్పటికే మార్కెట్‌లో ఉన్న మెటా రేబాన్ స్మార్ట్ గ్లాసెస్‌కు ఇవి గట్టిపోటీ ఇస్తాయని భావిస్తున్నారు.
Also Read: సంచలనం సృష్టిస్తున్న Google Pixel 11a లీక్స్.. ఫీచర్లు చూస్తే వావ్ అనాల్సిందే!
కేవలం టెక్నాలజీ మాత్రమే కాకుండా.. రోజూ వేసుకునేలా ఇవి చాలా స్టైలిష్‌గా ఉండేలా శాంసంగ్ కేర్ తీసుకుంది. దీని కోసం ప్రముఖ లైఫ్‌స్టైల్ బ్రాండ్లయిన జెంటిల్ మాన్స్టర్, వార్బీ పార్కర్‌లతో చేతులు కలిపింది. జులైలో జరిగిన గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో వీటిని మొదటిసారి డిజైన్ పరంగా చూపించారు. ప్రారంభంలో ఇవి కొన్ని ఎంపిక చేసిన దేశాల్లో మాత్రమే అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాత మిగిలిన మార్కెట్లకు విస్తరించే ప్లాన్‌లో ఉంది శాంసంగ్.
ఈ స్మార్ట్ గ్లాసెస్ పనితీరు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ ఏఆర్1 జెన్ 1 చిప్‌సెట్‌ను వాడారు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఏకంగా 9 గంటల పాటు నాన్‌స్టాప్‌గా పనిచేస్తాయి. దీనికి తోడు వైర్‌లెస్ ఛార్జింగ్ కేస్ కూడా ఇస్తున్నారు. ఈ కేస్ ద్వారా గ్లాసెస్‌ను మరో ఏడు సార్లు ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే ట్రావెలింగ్ చేసేటప్పుడు ఛార్జింగ్ గురించి అస్సలు భయపడాల్సిన అవసరమే ఉండదు.
ఈ గ్లాసెస్‌లోని మెయిన్ హైలైట్ గూగుల్ జెమిని ఏఐ అసిస్టెంట్. ఇందులో ఉన్న ఇన్‌బిల్ట్ కెమెరా ద్వారా మనం చూసే వస్తువులను ఏఐ గుర్తించి, మన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తుంది. రెస్టారెంట్లలో టేబుల్స్ బుక్ చేయడం, చిన్న చిన్న పనులు చేయడం లాంటివి వాయిస్ కమాండ్స్‌తోనే చేసేస్తుంది. అలాగే మైక్రోఫోన్, స్పీకర్లు ఉండటం వల్ల ఫోన్ కాల్స్ మాట్లాడటం, మ్యూజిక్ వినడం చాలా సులభం అవుతుంది. కళ్లద్దాలు పెట్టుకుని హ్యాండ్స్‌ఫ్రీగా అన్ని పనులూ పూర్తి చేసుకోవచ్చు.
Also Read: మోటో, ఒప్పో, ఐఫోన్ లవర్స్‌కి పండగే పండగ.. ఏ ఫోన్ ఎంత తక్కువకొస్తుందో తెలిస్తే షాకే!