Samsung One UI 9.0: స్మార్ట్‌ఫోన్ వినియోగాన్ని మరింత స్మార్ట్‌గా మార్చేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ సరికొత్త ఫీచర్లతో మన ముందుకొస్తోంది. గెలాక్సీ యూజర్ల కోసం తీసుకొచ్చిన ‘వన్ యూఐ 9.0’ అప్‌డేట్ ఇప్పుడు టెక్ ప్రపంచంలో ఆసక్తికరంగా మారింది. ఆండ్రాయిడ్ 17 ఆధారంగా రూపొందిన ఈ అప్‌డేట్‌లో ఫోన్ వాడకాన్ని సులభతరం చేయడంతో పాటు, ఏఐ సాయంతో పనులను మరింత వేగంగా పూర్తి చేసే ఫీచర్లు ఉన్నాయి.
ముఖ్యంగా వీడియో షూటింగ్ నుంచి లైవ్ ట్రాన్స్‌లేషన్ వరకు, ఫోన్ వారంటీ వివరాల నుంచి ఏఐ యాక్టివిటీ ట్రాకింగ్ వరకు ఎన్నో ఉపయోగకరమైన మార్పులు ఇందులో చోటుచేసుకున్నాయి. ఇంతకీ ఈ కొత్త అప్‌డేట్‌లో యూజర్లను ఆకట్టుకునే ఆ 5 ఫీచర్లు ఏంటో తెలుసుకుందామా?
కాన్సర్ట్‌లు, మ్యాచ్‌లు లేదా ఏదైనా వేడుకల్లో వీడియోలు తీసేటప్పుడు ఒకే వ్యక్తిని స్క్రీన్ మధ్యలో ఉంచడం కాస్త కష్టమైన పనే. దీనికోసం వచ్చిన ఫీచరే My Fan Cam. మీరు మామూలుగా వీడియో షూట్ చేసిన తర్వాత గ్యాలరీలోని గెలాక్సీ ఏఐ మెనూకి వెళ్లి ఈ ఆప్షన్ ఎంచుకోవచ్చు. అక్కడ మీరు ఎవరిని ఫోకస్ చేయాలనుకుంటున్నారో ఎంచుకుంటే.. ఏఐ ఆ వ్యక్తిని మాత్రమే స్క్రీన్ మధ్యలో ఉంచుతూ వీడియోను రీఫ్రేమ్ చేస్తుంది.
శాంసంగ్ ఇంటర్‌ప్రిటర్ ఫీచర్ వేరే భాషలు మాట్లాడేవారితో సులభంగా మాట్లాడటానికి సహాయపడుతుంది. ఇప్పటివరకు ఇందులో ఉన్న సంభాషణలను చూసే అవకాశం మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన Thread Viewతో మనం ఇప్పటివరకు మాట్లాడిన మొత్తం సంభాషణను వెనక్కి స్క్రోల్ చేసి చూసుకోవచ్చు. ప్రయాణాల్లో ఉన్నప్పుడు లేదా హోటల్స్, క్యాబ్ డ్రైవర్లతో మాట్లాడేటప్పుడు పాత వివరాలను సరిచూసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది.
Also Read: గూగుల్ అకౌంట్ అక్కర్లేదు.. బడ్జెట్‌లో లభించే బెస్ట్ ఆండ్రాయిడ్ ఫోన్లు!
మనకు కావలసిన వాతావరణ సమాచారం, రోజువారీ వివరాలను అందించే Now Brief ఫీచర్‌లో ఇప్పుడు మనకు నచ్చిన మార్పులు చేసుకోవచ్చు. మన అవసరాలకు తగ్గట్టుగా కస్టమ్ కార్డ్స్‌ను డిజైన్ చేసుకునే వెసులుబాటు వచ్చింది. ఉదా: వాతావరణానికి సంబంధించిన కార్డ్ పెట్టుకుంటే వర్షం పడే అవకాశం, గాలి నాణ్యత వంటి వివరాలను మనకు కావలసిన సమయంలో స్క్రీన్‌పై చూపిస్తుంది. ఒకేసారి గరిష్టంగా మూడు కార్డ్స్ వరకు ఉపయోగించుకోవచ్చు.
స్మార్ట్‌ఫోన్లలో ఏఐ వాడకం పెరిగిన తర్వాత, బ్యాక్‌గ్రౌండ్‌లో ఏఐ ఏయే పనులు చేస్తోందో తెలుసుకోవడం వినియోగదారులకు అవసరంగా మారింది. దీనికోసం వన్ యూఐ 9.0లో ఒక కొత్త డ్యాష్‌బోర్డ్ తీసుకొచ్చారు. మన ఫోన్ లోని ఏఐ అసిస్టెంట్ ఏయే యాప్‌లను ఉపయోగించింది, ఏ సమయంలో ఎలాంటి పనులు పూర్తి చేసిందో ఈ డ్యాష్‌బోర్డ్ ద్వారా చాలా సులభంగా తెలుసుకోవచ్చు.
ఫోన్ సెట్టింగ్స్‌లోనే నేరుగా మన పరికరం వారంటీ వివరాలను తెలుసుకునేలా ఈ కొత్త ఫీచర్ డిజైన్ చేశారు. సెట్టింగ్స్‌లోని Warranty and Care విభాగానికి వెళ్తే ఫోన్ రిపేర్ హిస్టరీ, వారంటీ గడువు, డయాగ్నోస్టిక్స్ టెస్ట్‌లు వంటివి చూసుకోవచ్చు. ఒకవేళ డిస్‌ప్లే లాంటివి పాడైతే ఉదా: సాధారణంగా అయ్యే రూ.15,000 రిపేర్ ఖర్చుతో పోలిస్తే.. శాంసంగ్ కేర్ ప్లస్ ఉంటే ఎంత ఆదా అవుతుందో పక్కపక్కనే చూపిస్తుంది.
Also Read: వన్‌ప్లస్ ఫోన్లలో ఇక సరికొత్త లుక్ అండ్ స్పీడ్.. ColorOS 17 అప్‌డేట్ ఎలా చేసుకోవాలంటే?