September 2026 Car Sales: భారత కార్ల మార్కెట్ లో సెప్టెంబర్ 2026లో మంచి అమ్మకాలు నమోదయ్యాయి. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల అమ్మకాలు 15.5 శాతం పెరిగాయి. ఈ లిస్టులో మారుతి సుజుకి తన ఆధిపత్యాన్ని కొనసాగించగా, టాటా మోటార్స్‌కు చెందిన నెక్సాన్, పంచ్ SUVలు కూడా టాప్ స్థానాల్లో నిలిచాయి. సెప్టెంబర్‌లో ఏ కార్లు ఎక్కువగా అమ్ముడయ్యాయో చూద్దాం.
సెప్టెంబర్ 2026లో మారుతి బాలెనో 25,392 యూనిట్ల అమ్మకాలతో మొదటి స్థానంలో నిలిచింది. గతేడాది ఇదే నెలలో 13,173 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలు ఏకంగా 93 శాతం పెరిగాయి. ఈ జాబితాలో ఇదే అత్యధిక వృద్ధి సాధించిన మోడల్‌గా నిలిచింది. రెండో స్థానంలో టాటా నెక్సాన్ 20,456 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. అయితే గతేడాది సెప్టెంబర్‌తో పోలిస్తే దీని అమ్మకాలు 9 శాతం తగ్గాయి. మూడో స్థానంలో ఉన్న టాటా పంచ్ 20,333 యూనిట్లను అమ్మి 28 శాతం వృద్ధిని నమోదు చేసింది.
మారుతి ఫ్రాంక్స్ 19,282 యూనిట్ల అమ్మకాలతో నాలుగో స్థానాన్ని దక్కించుకుంది. గతేడాదితో పోలిస్తే దీని అమ్మకాలు 40 శాతం పెరిగాయి. ఐదో స్థానంలో ఉన్న మారుతి వాగన్ ఆర్ 18,835 యూనిట్ల విక్రయాలతో 22 శాతం వృద్ధిని సాధించింది. ఆ తర్వాతి స్థానాల్లో మారుతి డిజైర్ 17,754 యూనిట్లు, హ్యుందాయ్ క్రెటా 17,657 యూనిట్ల అమ్మకాలతో నిలిచాయి. అయితే ఈ రెండు మోడళ్ల అమ్మకాలు వరుసగా 11 శాతం, 6 శాతం తగ్గాయి.
ఎనిమిదో స్థానంలో మారుతి స్విఫ్ట్ 17,399 యూనిట్ల అమ్మకాలతో నిలిచింది. దీని అమ్మకాలు 12 శాతం పెరిగాయి. మహీంద్రా స్కార్పియో 17,313 యూనిట్ల విక్రయాలతో తొమ్మిదో స్థానాన్ని దక్కించుకోగా, మారుతి ఎర్టిగా 16,911 యూనిట్లతో పదో స్థానంలో నిలిచింది. ఈ రెండు మోడళ్లలో స్కార్పియో అమ్మకాలు 6 శాతం తగ్గగా, ఎర్టిగా అమ్మకాలు 40 శాతం పెరిగాయి.
టాప్ 10 జాబితాలో మారుతి సుజుకికి చెందిన ఆరు మోడళ్లు చోటు దక్కించుకున్నాయి. ఈ ఆరు కార్ల మొత్తం అమ్మకాలు 1,15,573 యూనిట్లుగా ఉన్నాయి. మరోవైపు, నెక్సాన్, పంచ్, ఫ్రాంక్స్, క్రెటా, స్కార్పియో వంటి SUVలు కూడా లిస్టులో చోటు సంపాదించాయి. SUVల హవా కొనసాగుతున్నప్పటికీ, బాలెనో, వాగన్ ఆర్, స్విఫ్ట్ వంటి హ్యాచ్‌బ్యాక్‌లకు కూడా మంచి డిమాండ్ కనిపించింది. ఈ మూడు మోడళ్లు కలిపి 61,626 యూనిట్లు అమ్ముడైయ్యాయి. సెప్టెంబర్ 2026లో మారుతి సుజుకి కార్లు టాప్ 10 జాబితాలో ఆధిపత్యం చూపగా, టాటా SUVలు కూడా గట్టి పోటీ ఇచ్చాయి. అయితే నెక్సాన్, డిజైర్, క్రెటా, స్కార్పియో అమ్మకాలు తగ్గాయి.
Read Also: ఈ దీపావళికి సన్ రూఫ్ కార్ కొనాలనుకుంటున్నారా? రూ.15 లక్షల లోపు 5 బెస్ట్ కార్లు ఇవే!