Social Media Rules for Minors: సోషల్ మీడియాలో రోజుకో రకమైన వార్తలు వైరల్ అవుతుంటాయి. ముఖ్యంగా 18 ఏళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం పూర్తిగా బ్యాన్ చేయబోతోందంటూ ఇటీవల కొన్ని వార్తలు తెగ చక్కర్లు కొట్టాయి. ఇది చూసి చాలామంది తల్లిదండ్రులు, యూత్ కాస్త కంగారు పడ్డారు. అయితే ఇందులో ఎలాంటి నిజం లేదని, అవన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని కేంద్ర ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఎలాంటి బ్యాన్ విధించే ఆలోచన లేదని తేల్చి చెప్పారు.
అసలు ఈ ప్రచారం ఎక్కడి నుంచి మొదలైందంటే.. ఇటీవల సుప్రీంకోర్టులో పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ఒక కీలకమైన పిటిషన్ విచారణకు వచ్చింది. భారతదేశ చట్టాల ప్రకారం 18 ఏళ్ల లోపు ఉన్న మైనర్లు ఎలాంటి ఒప్పందాలపైనా సంతకాలు చేయడానికి అర్హులు కారు. కానీ, సోషల్ మీడియా యాప్స్ ఓపెన్ చేసేటప్పుడు Terms and Conditions ఓకే చేస్తూ ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. ఇది ఒకరకంగా చట్టపరమైన నిబంధనలను పక్కన పెట్టడమేనని కోర్టులో చర్చ జరిగింది.
ఈ విషయంలో సుప్రీంకోర్టు చాలా తీవ్రంగా స్పందించింది. కేవలం సూచనలతో సరిపెట్టుకోకుండా మైనర్ల భద్రత కోసం బలమైన చట్టపరమైన నిబంధనలు తీసుకరావాలని కేంద్రాన్ని కోరింది. ఐటీ నియమాల్లో మార్పులు చేసి, వీటిని కఠినంగా అమలు చేయాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాకు సూచించింది. దీనిపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. పిల్లల భద్రతకు సంబంధించి పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి తగిన నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చింది.
నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా వల్ల పిల్లల మనస్సులపై తీవ్ర ప్రభావం పడుతోందని పలువురు ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే అసభ్యకరమైన, సైబర్ వేధింపులకు దారితీసే కంటెంట్‌ను చూడటం వల్ల పిల్లల మానసిక వికాసం దెబ్బతింటోంది. అందుకే పిల్లలను ఈ డిజిటల్ ప్రమాదాల నుంచి కాపాడుకోవాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది.
ప్రభుత్వం సోషల్ మీడియాను పూర్తిగా బ్యాన్ చేయకపోయినా.. రాబోయే రోజుల్లో కొన్ని కఠినమైన రూల్స్ తీసుకువచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మైనర్లు ఖాతాలు తెరిచేటప్పుడు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరి చేయడం వంటి నిబంధనలు తెచ్చే ఆలోచనలో ఉంది. కాబట్టి.. ప్రచారంలో ఉన్న పుకార్లను నమ్మాల్సిన పనిలేదు. కానీ పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలపై ప్రతి ఒక్కరూ కాస్త నిఘా పెట్టడం మంచిది.