TRAI New Rules 2026: డేటా అవసరం లేక కేవలం కాల్స్, ఎస్ఎంఎస్ సేవలు మాత్రమే వినియోగించే సాధారణ మొబైల్ వినియోగదారుల కోసం టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కీలక నిర్ణయం తీసుకుంది. ‘టెలికాం కన్స్యూమర్ ప్రొటెక్షన్ నిబంధనలు – 2026’ను ఖరారు చేస్తూ డేటా లేకుండా కేవలం వాయిస్, ఎస్ఎంఎస్ రీచార్జ్ ప్లాన్లను విధిగా అందించాలని ఇటీవల టెలికాం కంపెనీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో అక్టోబర్ నెల నుంచి జియో, ఎయిర్‌టెల్, విఐ వంటి దిగ్గజ టెలికాం ఆపరేటర్లందరికీ ఈ నూతన నిబంధనలు వర్తించనున్నాయి. దీనికి సంబంధించిన 5 ప్రధాన అంశాల గురించి ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.
ఇన్నాళ్లు డేటాతో కూడిన రీచార్జ్ ప్యాక్‌లకు ఉన్న కాలపరిమితులకు సమానంగా కేవలం వాయిస్, SMS ప్లాన్లను కూడా అందుబాటులోకి తేవాలని ట్రాయ్ స్పష్టం చేసింది. ఉదాహరణకు ఒక టెలికాం సంస్థ డేటాతో కూడిన 28 రోజుల ప్లాన్‌ను అందిస్తుంటే అదే 28 రోజుల వ్యాలిడిటీతో డేటా లేని వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్‌ను కూడా కచ్చితంగా అందుబాటులో ఉంచాలి.
డేటా తొలగించిన నేపథ్యంలో దానికి తగినట్లుగా రీచార్జ్ ఛార్జీలను తగ్గించాలని టెలికాం సంస్థలకు ట్రాయ్ సూచించింది. కాబట్టి డేటాతో కూడిన బండిల్ ప్లాన్లతో పోలిస్తే ఇవి తక్కువ ధరకే లభించనున్నాయి. అయితే ఎంత శాతం ధరలు తగ్గించాలనే అంశంపై నిర్దిష్ట పరిమితిని ట్రాయ్ ను విధించకపోవడంతో వినియోగదారులకు లభించే పొదుపు టెలికాం సంస్థలు నిర్ణయించే తుది ధరలపై ఆధారపడి ఉండనుంది.
ప్రస్తుతం వినియోగదారులు ఎదుర్కొంటున్న 28 రోజుల వ్యాలిడిటీ సమస్యకు పరిష్కారంగా ప్రతినెల ఒకే తేదీన రెన్యూవల్ అయ్యేలా కనీసం ఒక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్‌ను అందించాలని ట్రాయ్ తాజా రూల్స్ పేర్కొంటున్నాయి. అంటే రీచార్జ్ ఒక నెలలో 10వ తేదీన పూర్తయితే మళ్లీ వచ్చే నెల 10వ తేదీనే రెన్యూవల్ అవుతుంది
స్మార్ట్‌ఫోన్లు వాడని గ్రామీణ ప్రాంత వినియోగదారులు, వృద్ధులపై ఆర్థిక భారాన్ని తగ్గించేందుకు ఎక్కువ రోజుల కాలపరిమితి ఉండే ప్రత్యేక వాయిస్, ఎస్ఎంఎస్ ప్లాన్లను సైతం ప్రవేశపెట్టాలని ట్రాయ్ ఆదేశించింది. ఈ నేపథ్యంలో డేటా లేని లాంగ్ వ్యాలిడిటీ ప్లాన్లు.. చాలా చౌకగా యూజర్లకు అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది.
Also Read: రూ.106 వల్ల ఇన్సూరెన్స్ కట్.. బ్యాంక్‌కు ఊహించని షాక్.. రూ. 1.5 లక్షల జరిమానా!
పైన పేర్కొన్న నిబంధనలకు సంబంధించిన ఉత్తర్వులను ట్రాయ్ సెప్టెంబర్ 22న జారీ చేసింది. వీటి అమలుకు 30 రోజుల గడువును టెలికాం సంస్థలకు విధించింది. కాబట్టి అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ ప్రారంభంలో జియో, ఎయిర్‌టెల్, వీఐ సంస్థలు తమ కొత్త రీచార్జ్ ప్లాన్లను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి
Also Read: ట్రాయ్ టెలికాం యూజర్ల గణాంకాలు.. Jio, Airtelకి షాకిచ్చిన BSNL.. పాపం చతికిలపడ్డ వీఐ!