WhatsApp Birthday Reminder: ప్రముఖ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ యూజర్లకు.. ముఖ్యంగా పెళ్లయిన మగవారికి ఒక అదిరిపోయే గుడ్ న్యూస్. భార్య పుట్టినరోజులు మర్చిపోయి.. సమయానికి విష్ చేయకుండా ఆమె చేతిలో చీవాట్లు తినే భర్తలకు ఇకపై ఆ కష్టాలు తప్పనున్నాయి. ఎందుకంటే.. మెటా సంస్థ వాట్సాప్‌లో ‘బర్త్‌డే రిమైండర్’ అనే సరికొత్త ఫీచర్‌ను తీసుకురాబోతోంది. మీ శ్రీమతి బర్త్‌డేను వాట్సాప్ ముందే గుర్తుచేసి, మీ కాపురాన్ని కాపాడటానికి రెడీ అవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..
మన ఫోన్ కాంటాక్ట్స్‌లో ఉన్న స్నేహితులు, కుటుంబ సభ్యుల పుట్టినరోజులను గుర్తుచేయడానికి వాట్సాప్ సిద్ధమవుతోంది. ఐఓఎస్ (iOS) లేటెస్ట్ బీటా వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను మెటా పరీక్షిస్తోంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే గనుక.. మీ కాంటాక్ట్ లిస్ట్‌లో ఎవరిదైనా పుట్టినరోజు ఉంటే వాట్సాప్ మీకు ముందే నోటిఫికేషన్ ద్వారా గుర్తుచేస్తుంది. దీనివల్ల భార్యకు లేదా ఆప్తులకు సర్‌ప్రైజ్ గిఫ్ట్‌లు ఇవ్వడానికి, పార్టీలు ప్లాన్ చేయడానికి తగినంత సమయం దొరుకుతుంది.
Also Read: మీ ప్రైవేట్ ఫొటోలు, చాట్స్ హ్యాకర్స్ చేతికి వెళ్లకూడదంటే.. ఫ్రీ వైఫై వాడేటప్పుడు ఇలా చేయండి!
ఈ ఫీచర్ కోసం వాట్సాప్ యాప్‌లో ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను తీసుకురాబోతున్నారు. దీనిలో రాబోయే పుట్టినరోజుల వివరాలన్నీ ఒకేచోట కనిపిస్తాయి. అయితే, ప్రతి ఒక్కరి పుట్టినరోజు వివరాలను మనం మాన్యువల్‌గా ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. మన ఫోన్‌లోని కాంటాక్ట్ బుక్ రీడ్ చేయడానికి వాట్సాప్ పర్మిషన్ అడుగుతుంది. మనం అనుమతి ఇస్తే చాలు, ఫోన్ కాంటాక్ట్స్‌లో సేవ్ అయి ఉన్న డేటా ఆధారంగా వాట్సాప్ తన లిస్ట్‌ను ఆటోమేటిక్‌గా అప్‌డేట్ చేసుకుంటుంది.
భారతదేశంలో 80 కోట్లకు పైగా యూజర్లతో వాట్సాప్ నెంబర్ వన్ మెసెంజర్ యాప్‌గా కొనసాగుతోంది. అయితే ఈ అగ్రస్థానాన్ని కాపాడుకోవడం కోసం మెటా ఎప్పటికప్పుడు ఇలాంటి ఉపయోగకరమైన ఫీచర్లను ప్రవేశపెడుతోంది. ఇటీవల తీసుకొచ్చిన మెటా ఏఐ ఇన్‌కాగ్నిటో మోడ్, అలాగే కొత్త ‘వాట్సాప్ ప్లస్’ సబ్‌స్క్రిప్షన్ వంటివి ఇందులో భాగమే. ఇప్పుడు రాబోయే బర్త్‌డే రిమైండర్ కూడా యూజర్లకు ఎంతగానో కనెక్ట్ అవుతుందని సంస్థ భావిస్తోంది.
మరోవైపు.. వాట్సాప్‌లో ఫోన్ నెంబర్ కనిపించకుండా చాట్ చేసుకునేలా తీసుకురావాలనుకున్న ‘యూజర్‌నేమ్’ ఫీచర్‌కు భారత్‌లో ప్రస్తుతానికి బ్రేక్ పడింది. ఒకే పేరుతో ఉన్న ఇతరులను మోసం చేసేందుకు నేరగాళ్లు దీనిని వాడుకునే ప్రమాదం ఉందని టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్) ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి భద్రతా చర్యలపై ప్రభుత్వం అడిగిన ప్రశ్నలకు మెటా సమాధానమిచ్చి, గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తోంది.
Also Read: వన్‌ప్లస్ ప్రియులకు బ్యాడ్ న్యూస్.. ఆ పాపులర్ ట్యాబ్లెట్ల ధరలు భారీగా పెంపు.. కొత్త ధరలు ఇవే!