WhatsApp Web: మనం ల్యాప్‌టాప్ లేదా కంప్యూటర్‌లో వాట్సప్ వాడాలంటే సాధారణంగా ‘వాట్సాప్ వెబ్’ ఓపెన్ చేస్తుంటాం. ఇప్పటివరకు ఇందులో కేవలం మెసేజ్‌లు పంపడం, ఫొటోలు షేర్ చేసుకోవడం మాత్రమే కుదిరేది. వీడియో లేదా ఆడియో కాల్స్ మాట్లాడాలంటే కచ్చితంగా డెస్క్‌టాప్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇకపై ఆ అవసరం లేదు. వాట్సప్ వెబ్ నుంచే నేరుగా ఆడియో, వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని సంస్థ అందుబాటులోకి తెచ్చింది.
ఇకపై కంప్యూటర్‌లో ఎలాంటి యాప్ ఇన్‌స్టాల్ చేయకుండానే నేరుగా వెబ్ బ్రౌజర్ ద్వారా గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. ఫోన్‌లో ఉన్నట్లే ఈ కాల్స్ కూడా పూర్తి ‘ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్’తో చాలా సురక్షితంగా ఉంటాయి. వీటికి ఎలాంటి సమయ పరిమితి కానీ, అదనపు రుసుములు కానీ ఉండవు. దీంతో పాటు కాల్ మాట్లాడే సమయంలో స్క్రీన్ షేర్ చేసుకోవడం, ఎమోజీలతో రియాక్ట్ అవ్వడం వంటి ఫీచర్లు కూడా ఇచ్చారు. రీసెంట్ కాల్స్, ఫేవరెట్ కాంటాక్ట్స్ చూసుకోవడానికి ప్రత్యేకంగా ‘కాల్స్ ట్యాబ్’ను కూడా జత చేశారు.
Also Read: ఈ ఒక్క ఫీచర్ చాలు బ్రో.. Honor Band 11ను కళ్లు మూసుకొని కొనేయొచ్చు!
ఈ అప్‌డేట్‌లో అందరినీ ఆకట్టుకునే ఫీచర్ ‘కాల్ ట్రాన్స్‌ఫర్’. ఉదా: మీరు బయట ఉన్నప్పుడు ఫోన్‌లో గ్రూప్ వీడియో కాల్ మాట్లాడటం ప్రారంభించారనుకోండి. ఇంటికి వచ్చాక కాల్ కట్ చేయకుండానే, దాన్ని నేరుగా మీ ల్యాప్‌టాప్‌కి మార్చుకోవచ్చు. అలాగే ల్యాప్‌టాప్‌లో మాట్లాడే కాల్‌ను ఫోన్‌కి కూడా సులభంగా మార్చుకునే వెసులుబాటు ఉంది.
కాల్ లింక్ ద్వారా జరిగే గ్రూప్ కాల్స్ కోసం ‘వెయిటింగ్ రూమ్’ ఫీచర్‌ను తీసుకొచ్చారు. హోస్ట్ (కాల్ స్టార్ట్ చేసిన వారు) అనుమతి ఇస్తేనే ఇతరులు కాల్‌లోకి రాగలరు. దీనివల్ల అనవసరమైన వ్యక్తులు మీ మీటింగ్స్ లేదా ఫ్యామిలీ కాల్స్‌లోకి రాకుండా అడ్డుకోవచ్చు.
టెక్నికల్ పరంగా కూడా వాట్సప్ కొన్ని మార్పులు చేసింది. ‘క్విక్ హెచ్‌డీ’ వల్ల కాల్ కనెక్ట్ అవ్వగానే వీడియో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ‘నాయిస్ సప్రెషన్’ ఫీచర్ వల్ల మన వెనకాల వచ్చే ట్రాఫిక్, ఫ్యాన్ లేదా ఇతర ల్యాప్‌టాప్ శబ్దాలు అవతలి వారికి వినపడకుండా క్లియర్ ఆడియో వస్తుంది. ఈ ఫీచర్లు రాబోయే కొన్ని వారాల్లో వినియోగదారులందరికీ అందుబాటులోకి రానున్నాయి.
Also Read: సాధారణ ఫ్యాన్ల కంటే BLDC ఫ్యాన్లు ఎందుకు బెస్ట్? కరెంట్ బిల్లు తగ్గించే టాప్ ఆప్షన్స్ ఇవే!