Xiaomi Mijia Smart Dishwasher: ఇంట్లో పండగలు, పార్టీలు జరిగినప్పుడు లేదా కుటుంబ సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పుడు భోజనం తర్వాత గిన్నెలు కడగడం పెద్ద తలనొప్పిగా మారుతుంది. ఒకటి రెండు గిన్నెలైతే పర్లేదు.. కానీ గిన్నెల కొండలా పేరుకుపోతే వాటిని శుభ్రం చేయడం నిజంగానే విసుగెత్తించే పని. ప్రతిరోజూ ఈ పనితో ఇబ్బంది పడుతున్న వారికి షావోమి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గిన్నెలు కడిగే పనిని ఈజీ చేసేలా కొత్త మిజియా స్మార్ట్ డిష్‌వాషర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. తాజాగా లాంచ్ చేసిన ఈ డిష్‌వాషర్‌లో ఉన్న ఫీచర్లు ఏంటి? ఇది గిన్నెలను ఎలా క్లీన్ చేస్తుంది? చూద్దాం.
ఈ డిష్‌వాషర్ ముఖ్యమైన ప్లస్ పాయింట్ ఏంటంటే.. దీని సైజు. ఏకంగా 156 లీటర్ల కెపాసిటీతో వస్తున్న ఈ మిషిన్‌లో దాదాపు 144 రకాల టేబుల్‌వేర్ గిన్నెలను ఒకేసారి సర్దేయవచ్చు. అంటే ఒకే రౌండ్‌లో ఏకంగా 20 ప్లేట్ల సెట్‌ను శుభ్రం చేసుకోవచ్చన్నమాట. వంటగది క్యాబినెట్లలో ఎంతో నీట్‌గా, ఇమిడిపోయేలా దీన్ని డిజైన్ చేశారు. చూడటానికి కూడా చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది.
ఇందులో ఉన్న బిఎల్‌డిసి ఇన్వెర్టర్ మోటార్ సహాయంతో నీటి పీడనం చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. చిన్న సందుల్లో ఉన్న జిడ్డును కూడా ఇది సులభంగా వదిలిస్తుంది. గిన్నెలు శుభ్రం చేయడానికి 75 డిగ్రీల వేడి నీటిని వాడుతుంది. అంతేకాదు.. గిన్నెలు తడి లేకుండా ఆరబెట్టడానికి ఏకంగా 115 డిగ్రీల స్టీమ్ డ్రైయింగ్ సిస్టమ్‌ను ఉపయోగిస్తుంది. కింద చిన్న ప్రొజెక్షన్ లైట్ ద్వారా మిషన్ ఏ స్టేజ్‌లో ఉందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు.
Also More: కాల్స్, మ్యూజిక్, హెల్త్ ట్రాకింగ్ అన్నీ ఈ ఒక్క ఉంగరంతోనే.. Rogbid ZenRing ప్రత్యేకతలు ఇవే!
ఇళ్లలో హైజీన్ చాలా ముఖ్యం కాబట్టి.. ఇందులో ఏడు స్టార్ల స్టెరిలైజేషన్ రేటింగ్ ఉంది. దాదాపు 99.99 శాతం క్రిములను ఇది ఇట్టే చంపేస్తుంది. ప్రత్యేకమైన మోడ్ ద్వారా గిన్నెలను శుభ్రం చేసుకోవచ్చు. పని అయిపోయిన తర్వాత కూడా లోపల గాలి సర్క్యులేట్ అవుతూనే ఉంటుంది. దీనివల్ల కడిగిన గిన్నెలను రోజుల తరబడి అలాగే ఉంచినా ఎలాంటి వాసన రాకుండా ఫ్రెష్‌గా ఉంటాయి.
చైనా మార్కెట్లో ప్రస్తుతం దీని ప్రీ-ఓర్డర్ నడుస్తోంది. అక్కడి కరెన్సీ ప్రకారం దీని ధర సుమారు రూ.55,000 వరకు ఉంటుంది. కొన్ని సబ్సిడీలు పోతే ఇంకా తక్కువ ధరకే వస్తుంది. ప్రస్తుతం ఇది చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే షావోమి తమ మిజియా బ్రాండ్‌ను ఇతర దేశాలకు కూడా విస్తరిస్తున్న నేపథ్యంలో.. త్వరలోనే ఈ అద్భుతమైన డిష్‌వాషర్ భారత మార్కెట్లోకి కూడా వచ్చే అవకాశం ఉంది.
Also More: 48MP కెమెరా, A19 చిప్ కలిగిన iPhone 17eపై భారీ తగ్గింపు.. ఈ డీల్ మిస్ కావద్దు మామా!