Asia Cup 2025 schedule: ఇండియా – పాకిస్తాన్ క్రికెట్ జట్ల మధ్య మ్యాచ్ అంటే ఆ కిక్కే వేరు. ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులంతా చూసే మ్యాచ్ ఇది. ఎప్పుడు ఈ దాయాది పోరు జరిగినా.. నరాలు తెగే ఉత్కంఠ చివరి బంతి వరకు ఉంటుంది. ఇప్పుడు అలాంటి మరో టోర్నీ జరగబోతోంది. ఇది క్రికెట్ అభిమానులకు శుభవార్త. భారత్ – పాకిస్తాన్ దేశాల మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో.. సందిగ్ధంగా మారిన ఆసియా కప్ 2025 పై కీలక అప్డేట్ బయటకి వచ్చింది.
ఈ టోర్నీ త్వరలోనే ప్రారంభం కాబోతోంది. అయితే పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ – పాకిస్తాన్ క్రికెట్ జట్లు తెలపడే అవకాశాలు మూసుకుపోయినట్లేనని అంతా భావించారు. ఎందుకంటే బీసీసీఐ కూడా ఐసీసీ కి ఓ లేఖ రాసింది. ఎట్టి పరిస్థితులలో భారత్ – పాకిస్తాన్ జట్లను ఒకే గ్రూపులో పెట్టవద్దని లేఖలో పేర్కొంది. అంతేకాకుండా కొద్ది రోజుల క్రితం ఇండియా ఆసియా కప్ నుండి తప్పుకోనున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ తాజాగా ఈ సందిగ్ధతకు తెరపడింది.
చాలాకాలంగా ఈ టోర్నమెంట్ నిర్వహణకు సంబంధించి నెలకొన్న గందరగోళం, ఊహగానాల తర్వాత.. క్రీడాభిమానులకు ఇప్పుడు కీలక వార్త వచ్చింది. తాజా నివేదికల ప్రకారం 2025 ఆసియా కప్ సెప్టెంబర్ లో ప్రారంభం కాబోతోంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి {బిసిసిఐ}, ఆసియా క్రికెట్ కౌన్సిల్ {ఏసీసీ} మధ్య జరిగిన సమావేశంలో ఈ టోర్నమెంట్ కోసం అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టి-20 ఫార్మాట్ లో జరగనున్న ఈ ఎడిషన్ అనేక విధాలుగా ప్రత్యేకంగా ఉంటుంది.
ఈ టోర్నీని ముందుగా ఢాకాలో నిర్వహించాలని ప్రతిపాదించారు. కానీ బిసిసిఐ దానికి హాజరుకావడానికి నిరాకరించింది. ఈ ప్రతిష్టంబనను తొలగించడానికి ఎసిసి వార్షిక సర్వసభ్య సమావేశాన్ని దుబాయ్ కి మార్చాలని నిర్ణయించింది. దీంతో ఆసియా కప్ కోసం జూలై 24న జరిగిన సమావేశంలో బీసీసీఐ ఆన్లైన్ లో పాల్గొంది. ఆ తర్వాత ఈ షెడ్యూల్ కి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ టోర్నీ సెప్టెంబర్ 5 నుండి ప్రారంభం అవుతుందని సమాచారం. ఇక ఈ టోర్నీని ఈసారి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని రెండు ప్రధాన నగరాలు {దుబాయ్ మరియు అబుదాబి} లో నిర్వహించవచ్చు.
Also Read: Injured Cricket Players: రక్తాలు కారినా… గ్రౌండ్ లో అడుగుపెట్టి మ్యాచ్ ఆడిన వీరులు వీళ్లే
ఈసారి ఆసియా కప్ లో మొత్తంగా ఎనిమిది జట్లు పాల్గొంటాయి. ఇందులో భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, ఆఫ్ఘనిస్తాన్ అని ఐదు పూర్తి సభ్య దేశాలు ఉంటాయి. వీటితోపాటు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఒమన్, హాంకాంగ్ కూడా ఇందులో భాగమే. ఇక ఆసియా కప్ 2025లో భాగంగా భారత్ – పాకిస్తాన్ మధ్య కనీసం రెండు మ్యాచ్ లు జరిగే అవకాశం ఉంది. ప్రారంభ షెడ్యూల్ ప్రకారం భారత్-పాకిస్తాన్ మధ్య మొదటి మ్యాచ్ సెప్టెంబర్ 7వ తేదీన దుబాయిలో జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ టోర్నీలో భారత్ – పాకిస్తాన్ సూపర్ ఫోర్ దశకు అర్హత సాధిస్తే.. రెండవ మ్యాచ్ సెప్టెంబర్ 14న జరగవచ్చు. ఒకవేళ ఈ ఇరుజట్లు ఫైనల్ కి చేరుకుంటే.. మూడవ హై వోల్టేజ్ మ్యాచ్ ని కూడా వీక్షించవచ్చు. కాగా భారత్ వేదికగా 2026లో టీ-20 ప్రపంచ కప్ జరగనుంది. ఈ నేపథ్యంలో దానికి సన్నాహకంగా ఆసియా కప్ 2025 ని టి-20 ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.