Steve Smith Retires: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు చేతిలో ఆస్ట్రేలియా ఓటమిని చవిచూసింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా జట్టు కెప్టెన్ స్టీవ్ స్మిత్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు స్టీవ్ స్మిత్. అయితే టెస్ట్ లు, టి-20 లలో మాత్రం కొనసాగనున్నాడు. ఛాంపియన్స్ ట్రోఫీలో దుబాయ్ వేదికగా జరిగిన సెమీఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు నాలుగు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించింది.
Also Read: Shubman Gill: హెడ్ క్యాచ్… గిల్ కు అంపైర్ స్ట్రాంగ్ వార్నింగ్?
ఈ ఓటమితో ఫైనల్ చేరుకోవాలనే ఆస్ట్రేలియా కల చెదిరిపోయింది. దీంతో వన్డే క్రికెట్ కి రిటైర్మెంట్ ప్రకటించాడు స్టీవ్ స్మిత్. ఈ సెమీఫైనల్ మ్యాచ్ లో స్మిత్ 73 పరుగులు చేశాడు. కానీ జట్టు ఓటమి చెందడంతో వన్డే క్రికెట్ నుండి వెంటనే రిటైర్మెంట్ తీసుకుంటున్నట్లు తన సహచరులతో చెప్పాడు. 2010లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో స్మిత్ లెగ్ స్పిన్నింగ్ ఆల్ రౌండర్ గా జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఆ తరువాత బ్యాటింగ్ లో అద్భుత ప్రదర్శన చూపడం ద్వారా.. అతడు ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాట్స్మెన్ లలో ఒకరిగా మారాడు. తన కెరీర్ లో 170 వన్డేలు ఆడిన స్టీవ్ స్మిత్ 43.28 సగటుతో 5800 పరుగులు చేశాడు. అందులో 12 సెంచరీలు, 35 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 34.67 సగటుతో 28 వికెట్లు కూడా పడగొట్టాడు.
ఇక సెమీస్ లో భారత జట్టుపై ఓటమి అనంతరం స్టీవ్ స్మిత్ స్పందిస్తూ.. ” బ్యాటింగ్ వైఫల్యమే మా ఓటమిని శాసించింది. కీలక సమయంలో వికెట్లు కోల్పోవడం మా విజయ అవకాశాలను దెబ్బతీసింది. 280 ప్లస్ పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేది. బౌలర్లు అసాధారణ ప్రదర్శన కనబరిచారు. తక్కువ స్కోర్ ఉన్నా.. మ్యాచ్ ని ఆఖరి వరకు తీసుకువెళ్లారు. విజయం కోసం చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా స్పిన్నర్లు మ్యాచ్ నీ చివరి వరకు తీసుకువచ్చారు. ఇది చాలా ట్రిక్కీ వికెట్. ఆరంభంలో బ్యాటింగ్ చేయడం, స్ట్రైక్ రొటేట్ చేయడం చాలా కష్టమైనది.
మా జట్టులోని ఆటగాళ్లంతా మెరుగైన ప్రదర్శన చేశారు. మ్యాచ్ అధ్యంతం అద్భుతంగా పోరాడారు. దుబాయిలోని ఈ పిచ్ చాలా భిన్నంగా ఉంది. స్పిన్నర్లకు కొంచెం పట్టు ఇచ్చింది. కొంత స్పిన్ అవ్వడంతో పాటు స్కిడ్ అయింది. కీలక సమయంలో మేము వికెట్లు కోల్పోయాం. ప్రతి దశలో వికెట్ చేజార్చుకున్నాం. ఈ మ్యాచ్ లో ఓడిపోయినప్పటికీ టోర్నీలో జట్టుగా సమిష్టి ప్రదర్శన చేశాం. బౌలింగ్ యూనిట్ అద్భుతంగా రానించింది. ఇక ఇంగ్లాండ్ తో మేము అసాధారణ ప్రదర్శన కనబరిచాం. మా జట్టులో కొంతమంది కుర్రాళ్ళు భవిష్యత్తులో బిగ్ స్టార్స్ అవుతారు” అని పేర్కొన్నాడు స్టీవ్ స్మిత్. ఇక స్మిత్ రిటైర్మెంట్ తో ఆస్ట్రేలియా క్రీడాభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.