T20 : T20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్ లో టీమిండియా అద్భుతం విజయం సాధించింది. ఆ మ్యాచ్ లో కోహ్లీ బ్యాటింగ్, చివరి 3 ఓవర్లు సాగిన తీరు… ముఖ్యంగా లాస్ట్ ఓవర్లో జరిగిన నాటకీయ పరిణామాలు… ఫ్యాన్స్ కు ఫుల్లు కిక్కిచ్చాయి. ఏ ఒక్క బంతికైనా తేడా జరిగి ఉంటే… ఫలితం అటూ ఇటూ అయ్యేదే. కోహ్లీ ఎంత అద్భుతంగా బ్యాటింగ్ చేసినా… విజయం ముంగిట చివరి బంతికి అశ్విన్ చూపిన పరిణతి… అతణ్ని హీరోను చేసింది. అదే చివరి బంతి మరోలా తిరిగి ఉంటే పరిస్థితి ఏంటనేది… కలలోకి కూడా రానివ్వడం లేదు… భారత క్రికెట్ అభిమానులు. ఇప్పుడు ఆ లాస్ట్ బాల్ పై ఫన్నీగా స్పందించాడు… రవిచంద్రన్ ఆశ్విన్.
లాస్ట్ ఓవర్ ఐదో బంతికి దినేష్ కార్తీక్ ఔటవగానే క్రీజ్ లోకి వచ్చాడు… అశ్విన్. అప్పటికి భారత్ గెలవాలంటే ఒక్క బంతికి రెండు పరుగులు చేయాలి. నవాజ్ వేసిన ఆఖరి బంతి వైడ్ వెళ్తుందని భావించిన అశ్విన్… తెలివిగా దాన్ని వదిలేశాడు. దాంతో వైడ్ వచ్చి మ్యాచ్ టై అయింది. చివరి బంతిని లాంగాన్ వైపు గాల్లోకి లేపి ఒక్క పరుగు పూర్తి చేసిన అశ్విన్… పాక్ పై భారత్ కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. అదే నవాజ్ వేసిన బంతి వైడ్ వెళ్లకుండా ప్యాడ్స్ కు తగిలి ఉంటే ఏమయ్యేదని అశ్విన్ ను ప్రశ్నిస్తే… ఏముంది, ఆ ఒక్క బంతితో కెరీర్ ముగిసేదే అన్నాడు… అశ్విన్. కోహ్లీ వీరోచితంగా పోరాడి మ్యాచ్ ను విజయం ముంగిట దాకా తీసుకొస్తే… తన నిర్లక్ష్యం కారణంగా మ్యాచ్ చేజారిందని అంతా నన్ను నిందించేవారని అశ్విన్ అన్నాడు. ఒకవేళ ఆఖరి బంతి నిజంగా ప్యాడ్స్ కు తాకి ఉంటే… డ్రెస్సింగ్ రూమ్ కు వెళ్లగానే ఫోన్లో ట్విట్టర్ యాప్ ఓపెన్ చేసి… రిటైర్మెంట్ ప్రకటించి ఉండేవాడినని చెప్పాడు. ఇన్నాళ్లూ తనను ఆదరించిన అభిమానులకు, బీసీసీఐకి ధన్యవాదాలు.. ఈ ప్రయాణం చాలా గొప్పది.. ఇక గుడ్ బై అని ఆట నుంచి రిటైరయ్యేవాడిని అశ్విన్ చెప్పాడు. అలా ఆ ఒక్క బంతీ తన కెరీర్ ముగించేందని… అదృష్టవశాత్తూ అలా జరగలేదని సరదాగా అన్నాడు… అశ్విన్.