IPL 2025 – Impact Player rule: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 21 నుండి ప్రారంభం కాబోతుందని ఐపీఎల్ చైర్మన్ అరున్ ధుమాల్, బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఐపీఎల్ 2025 సీజన్ కి సంబంధించిన ఓ కీలక వార్త వైరల్ గా మారింది. ఈ సీజన్ లో కొన్ని కీలక రూల్స్ ని మార్చబోతున్నట్లు న్యూస్ వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 2025 సీజన్ లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని తొలగించబోతున్నట్లు కొన్ని న్యూస్ వైరల్ అయ్యాయి.
Also Read: Pandya- Jurel: పాండ్య బలుపే టీమిండియా కొంప ముంచిందా.. ఆ రన్ తీస్తే సరిపోయేది ?
ఐపీఎల్ ని మరింత ఆసక్తికరంగా మార్చేందుకు, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేసేందుకు ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ని బీసీసీఐ 2023 సీజన్ లో ప్రవేశపెట్టింది. ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ద్వారా ఒక ఆటగాడిని జట్టులోకి అదనంగా చేర్చుకొని బౌలింగ్ లేదా బ్యాటింగ్ లో ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. 2023 ఐపీఎల్ సీజన్ లో ఈ రూల్ తొలిసారి అమలులోకి వచ్చినా.. రెండేళ్లుగా దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.
ఈ రూల్ వల్ల అసలైన క్రికెట్ స్ఫూర్తిని దెబ్బతీస్తుందని, దీనివల్ల ఆల్రౌండర్లకు అన్యాయం జరుగుతుందని విమర్శలు వినిపించాయి. ఈ రూల్ పై టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట అభ్యంతరం వ్యక్తం చేయగా.. రిషబ్ పంత్ సహా పలువురు ప్లేయర్లు, మాజీ ఆటగాళ్లు సైతం అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వల్ల బౌలర్లు ఇబ్బంది పడుతున్నారని క్రీడా విశ్లేషకులు కూడా అభిప్రాయపడ్డారు. ఇలా ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై విమర్శలు వచ్చిన నేపథ్యంలో గత బీసీసీఐ కార్యదర్శి జై షా ఈ రూల్ ని కొనసాగించాలా..? వద్దా..? అనే దానిపై త్వరలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
కానీ ఈ నిబంధన ఐపిఎల్ లో కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు ఐపీఎల్ 2025 సీజన్ కి ముందు ఈ రూల్ ని తొలగించబోతున్నారనే రూమర్స్ పై స్పందించారు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్. ఈ సీజన్ లో గణనీయమైన మార్పులు ఏవి ఉండబోవని తెలిపారు. 2023లో ప్రవేశపెట్టిన ఇంపాక్ట్ ప్లేయర్ నియమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్పూర్ లో జరిగిన సంసద్ ఖేల్ మహాకుంబ్ మూడవ ఎడిషన్ లో ఐపీఎల్ చైర్మన్ ధుమాల్ విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే సీజన్.. గత సీజన్ కంటే మెరుగ్గా ఉంటుందని అన్నారు.
ఐపీఎల్ 2025 సీజన్ మార్చ్ 21వ తేదీన ప్రారంభం అవుతుందని.. మరి కొద్ది రోజులలోనే షెడ్యూల్ విడుదల చేస్తామని తెలిపారు. ఇక ఐపీఎల్ నిబంధనలలో పెద్దగా మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. “ఐపీఎల్ అనేది ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన క్రికెట్ లీగ్. ఇందులో ప్రపంచ నలుమూలల నుంచి ఆటగాళ్లు వచ్చి ఆడతారు. ఈ టోర్నమెంట్ చాలా పోటీ తత్వంతో నిర్వహిస్తాం. తప్పకుండా ఈసారి మరింత మెరుగ్గా ఉంటుంది”. అని చెప్పుకొచ్చారు. ఇక బిలాస్పూర్ లో కూడా జాతీయ మ్యాచులు నిర్వహిస్తామని తెలిపారు అరుణ్.