Digvesh Rathi Fined: క్రికెట్ మ్యాచ్ ఎంత ఆసక్తిని కలిగిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్ అయితే ఆ టెన్షన్ మామూలుగా ఉండదు. అలాంటి సమయాలలో ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధాలు జరగడం సాధారణంగా మారిపోయింది. కొందరు ఆటగాళ్లు అయితే తరచూ ఇలాంటి వాటితోనే వార్తల్లో నిలుస్తుంటారు. అలాంటి వారిలో ఢిల్లీ స్పిన్నర్, లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ దిగ్విష్ సింగ్ రాఠి ఒకరు. ఇతడు వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంటాడు.
Also Read: RCB: ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షలు.. చిన్న స్వామి ఘటనపై RCB మరో షాకింగ్ పోస్ట్
ఐపీఎల్ 2025 సమయంలో తన నోట్ బుక్ సెలబ్రేషన్స్ తో బీసీసీఐ ఆగ్రహానికి గురైన దిగ్వేష్.. తాజాగా ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో కూడా అదే తీరును కనబరిచాడు. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ {DPL} 2025 ఎలిమినేటర్ మ్యాచ్ లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లు నితీష్ రానా – దిగ్విష్ లు ఇద్దరు బాహబాహికి దిగారు. ఏకంగా మైదానంలోనే కొట్టుకున్నంత పనిచేశారు. ఇతర ఆటగాళ్లు వచ్చి వీరిని అడ్డుకున్నప్పటికీ వినలేదు. దీంతో ఒక్కసారిగా మైదానంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. ఢిల్లీ ప్రీమియర్ లీగ్ {DPL} లో భాగంగా ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో వెస్ట్ ఢిల్లీ లయన్స్ – సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరిగింది. డూ ఆర్ డై మ్యాచ్ లో ఇరుజట్లు హోరాహోరీగా పోరాడాయి. ఇందులో సౌత్ ఢిల్లీ సూపర్ స్టార్స్ కి దిగ్వేశ్ ప్రతినిథ్యం వహిస్తున్నాడు. ఇక వెస్ట్ ఢిల్లీ కెప్టెన్ గా నితీష్ రానా వ్యవహరిస్తున్నాడు. అయితే వెస్ట్ ఢిల్లీ ఇన్నింగ్స్ లో 8వ ఓవర్ వేసేందుకు వచ్చిన దిగ్వేశ్ కి రానా గ్రాండ్ వెల్కమ్ పలికాడు. ఆ ఓవర్ లో రానా ఏకంగా మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో మొత్తంగా 22 పరుగులు సాధించాడు.
ఆ తర్వాత మళ్లీ దిగ్వేశ్ బౌలింగ్ లో ఒక ఫోర్, రెండు సిక్స్ లు బాదాడు. దీంతో దిగ్వేశ్ తన సహనాన్ని కోల్పోయాడు. రానా ఏకాగ్రతను దెబ్బతీసేందుకు మైండ్ గేమ్ ఆడాడు. అతడిని స్లెడ్జ్ చేయడం మొదలుపెట్టాడు. తన మూడో ఓవర్ వేసే సమయంలో బంతిని వెసేందుకు ముందుకు వచ్చి కావాలనే ఒక్కసారిగా ఆపేశాడు. ఆ తరువాత స్పీడ్ గా వచ్చి బంతి వేసినట్లు ఆక్ట్ చేశాడు. దీంతో నితీష్ కి చిర్రెత్తుకొచ్చింది. దిగ్వేశ్ రాఠి మరో బంతి వేసే సమయంలో పక్కకు తప్పుకున్నాడు. దీంతో ఇరువురు ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం నడిచింది. చివరికి సహనం కోల్పోయిన నితీష్ దూకుడుగా దిగ్వేశ్ వైపు దూసుకు వెళ్ళాడు. ఈ సమయంలో అంపైర్లు, సహచర ఆటగాళ్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది.
Also Read: Shami Wife Hasin: ‘పిచ్చి కుక్కలు’ అంటూ షమీ మాజీ భార్య వివాదాస్పద పోస్ట్
ఈ ఘటన జరిగిన తర్వాత కూడా మళ్లీ ఇరుజట్ల ఆటగాళ్ల మధ్య కవ్వింపులు జరిగాయి. ఇక ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన సౌత్ ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనలో వెస్ట్ డిల్లీ లయన్స్ 17.1 ఓవర్లలో 201 పరుగులు లక్ష్యాన్ని చేదించింది. నితీష్ రానా 55 బంతుల్లో 134 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు. అయితే ఈ గొడవ కారణంగా ఇరువురు ఆటగాళ్లకు భారీగా ఫైన్ విధించారు. దిగ్విశ్ రాఠి కీ మ్యాచ్ ఫీజులో 80 శాతం కోత కోత విధించగా.. నితీష్ రానాకి 50% కోత విధించారు. ఇక ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దిగ్వేశ్ దూల తీరిందంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. అతడు తరచూ వివాదాస్పదాలకు కారణం అవుతున్నాడంటూ మండిపడుతున్నారు.