
England vs Sri Lanka : ఇంగ్లండ్ జట్టుకి…అసలు ఏమైందని సర్వత్రా చర్చ మొదలైంది. సెమీస్ రేస్ లో నిలవాలంటే ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో బ్యాటర్లు చేతులెత్తేశారు. 2023 వన్డే వరల్డ్ కప్ సందర్భంగా బెంగళూరులో శ్రీలంక- ఇంగ్లండ్ మధ్య జరిగిన మ్యాచ్ చప్పగా సాగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకున్న ఇంగ్లండ్ 33.2 ఓవర్లకి 156 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. ఛేజింగ్ కి వచ్చిన శ్రీలంక 25.4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని చేధించింది. మెరుగైన రన్ రేట్ తో 5వ స్థానానికి చేరుకుంది. సెమీస్ ఆశలను ఇంకా పదిలంగా ఉంచుకుంది. ఇంగ్లండ్ జార విడుచుకుంది.
బ్యాటింగ్ కి స్వర్గధామమైన చిన్నస్వామి స్టేడియంలో మొదట బ్యాటింగ్ కి వచ్చిన ఇంగ్లండ్ ఏ దశలోనూ పోరాట పటిమ చూపించలేదు. ఏదో నామ్ కే వాస్తే అన్నట్టు ఆడారు. ఓపెనర్లు బెయిర్ స్టో, డేవిడ్ మలన్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. మొదట్లో ఇద్దరూ బాగానే ఆడారు. 6.3 ఓవర్లలో 45 పరుగులు చేశారు. ఈ సమయంలో మలన్ తొలి వికెట్ గా వెనుతిరిగాడు. ఇక అక్కడ నుంచి నాన్ స్టాప్ గా పడుతూనే ఉన్నాయి.
13.3 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 77 పరుగులు దగ్గర పీకల్లోతు కష్టాల్లో ఉంది. జోయ్ రూట్ (3), కెప్టెన్ బట్లర్ (8), బెయిర్ స్టో (30) ఇలా టపటపా పడ్డాయి.
తర్వాత బెన్ స్టోక్స్ (43) కాసేపు ప్రతిఘటించాడు. అంత బ్యాటింగ్ పిచ్ మీద ఆ పరుగులు చేయడానికి 73 బాల్స్ తీసుకున్నాడు. అంటే ఎంత కష్టంగా ఆడారో అతని ఆట చూస్తే అర్థమవుతుంది. అయితే శ్రీలంక బౌలర్లు అంత పటిష్టంగా వేశారా? అని అనుకోవాలా? లేక వరుస ఓటములతో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ నైరాశ్యంలో కూరుకుపోయారా? అనేది అర్థం కాలేదు. అయితే పాకిస్తాన్ టీమ్ మీద వచ్చినంత వ్యతిరేకత ఇంగ్లండ్ జట్టుపై రాలేదు. కానీ వాళ్ల మానసిక స్థయిర్యం దెబ్బతిన్నట్టే ఆడారు. ఎంత త్వరగా విమానమెక్కి స్వదేశానికి వెళ్లిపోదామా? అన్నట్టే ఆడారు.
అందువల్లే అనుకుంటా పోరాట పటిమ అన్నది చూపలేదు. లివింగ్ స్టోన్ (1), మొయిన్ ఆలీ (15), డేవిడ్ విలే (14) ఇలా అంతా పడుతూ లేస్తూ 33.2 ఓవర్లలో 156 పరుగులకి చాప చుట్టేశారు.
ఇంగ్లండ్ బౌలర్లలో కసూన్ రజిత 2, లహిరు కుమార 3, మాథ్యూస్ 2, మహీష్ 1 వికెట్టు తీశారు.
ఛేజింగ్ కి వచ్చిన శ్రీలంక ఆడుతూ పాడుతూ 25.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఓపెనర్ గా వచ్చిన నిస్సాంక 77 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. పెరీరా (4), కుశల్ మెండిస్ (11) చేసి అవుట్ అయ్యారు. సెకండ్ డౌన్ వచ్చిన సదీరా సమర విక్రమ 65 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు.
ఇంగ్లండ్ బౌలర్లలో డేవిడ్ విలీకే 2 వికెట్లు దక్కాయి.
మొత్తానికి వరల్డ్ కప్ లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ కథ ముగిసినట్టేనని సీనియర్లు వ్యాఖ్యానిస్తున్నారు.