Gary Kirsten: భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, భారత్ కి టి-20 ప్రపంచ కప్, వన్డే ప్రపంచ కప్ 2011, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ అందించిన కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ పై యువరాజ్ సింగ్ తండ్రి యోగరాజ్ సింగ్ తరచూ విమర్శలు చేస్తుంటాడు అన్న విషయం తెలిసిందే. తన కుమారుడు యువరాజ్ సింగ్ జీవితాన్ని ధోని నాశనం చేశాడని చాలాసార్లు ఆరోపించాడు యోగరాజ్. తన కుమారుడికి ద్రోహం చేసిన ధోనీని ఎప్పటికీ క్షమించబోనని అన్నాడు.
Also Read: Jos Buttler: టీమిండియా బలుపు వల్లే.. లార్డ్స్ లో ఓడిపోయారు
అయితే నిజానికి భారత జట్టు వన్డే వరల్డ్ కప్ 2011 గెలవడంలో యువరాజ్ సింగ్ ది కీలక పాత్ర. ఈ ఐసీసీ టోర్నీ ప్రారంభం నుండి అద్భుత ప్రదర్శన చేశాడు యువరాజ్ సింగ్. ఈ టోర్నీలో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా కూడా నిలిచాడు. యువరాజ్ ఈ ఈవెంట్ లో మొత్తం 362 పరుగులు చేయడంతో పాటు.. 15 వికెట్లు కూడా పడగొట్టి భారత గెలుపులో కీలకంగా మారాడు.
యువరాజ్ తండ్రికి గ్యారీ క్రిస్టన్ కౌంటర్:
2011 వరల్డ్ కప్ జట్టులోకి అసలు యువరాజ్ సింగ్ ని తీసుకోవాలా..? వద్దా..? అనే అంశంపై తీవ్రమైన చర్చ జరిగిందట. ఇందుకు గల కారణం.. 2010 సంవత్సరంలో యువరాజ్ సింగ్ ఆట తీరు అంత గొప్పగా లేకపోవడమే. అయితే ఆనాటి కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనితో పాటు అప్పటి టీమ్ ఇండియా కోచ్ గ్యారీ క్రిస్టన్ మాత్రం యువరాజ్ సింగ్ కోసం పట్టుబట్టారట. ఇందుకు సంబంధించిన విషయాన్ని గ్యారీ క్రిస్టన్ తాజాగా వెల్లడించారు.
“2011 వరల్డ్ కప్ కోసం జట్టు ఎంపిక అంత తేలికగా జరగలేదు. 15 మంది ప్లేయర్లు ఎవరా..? అనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరిగింది. చివరి క్షణంలో యువరాజ్ ని జట్టులోకి తీసుకున్నాం. ఈ విషయంలో దేవుడికి ధన్యవాదాలు చెప్పాల్సిందే. నిజానికి యువరాజ్ ని తప్పకుండా జట్టులోకి తీసుకోవాలని పట్టుదలతో నేను ఉన్నాను. ధోని కూడా నాలాగే ఆలోచించాడు. యువరాజ్ అనుభవాన్ని, అతడి ప్రతిభను వదులుకోకూడదని మేము డిసైడ్ అయ్యాము.
మా నమ్మకాన్ని నిలబెట్టేలా అతడు టోర్నీలో అద్భుత ప్రదర్శన చేశాడు. నాకు యువరాజ్ అంటే చాలా ఇష్టం. అతడు ప్రతి ఒక్కరితో ఎంతో ఆప్యాయంగా ఉంటాడు. ఇక అతడికి ఎదుటి వాళ్లకు చిరాకు తెప్పించడం అలవాటు. కొన్నిసార్లు అతడి అల్లరి శృతి మించుతుంది. అయినప్పటికీ యువరాజ్ అంటే నాకు అభిమానం. అతడు ఎప్పుడు బ్యాటింగ్ చేసినా.. భారీగా పరుగులు రాబట్టాలని కోరుకుంటాను. అతడి బ్యాటింగ్ ని నేను బాగా ఆస్వాదిస్తాను.” అని చెప్పుకొచ్చాడు గ్యారీ క్రిస్టన్.
దీంతో యువరాజ్ కెరీర్ ని ధోని నాశనం చేశాడు అంటూ యోగరాజ్ చేసిన వ్యాఖ్యలకు గ్యారీ కౌంటర్ ఇచ్చాడంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజెన్లు. వాస్తవానికి 2011 వన్డే ప్రపంచకప్ లో భారత్ విశ్వ విజేతగా నిలిచిన సమయంలో యువరాజ్ సింగ్ ప్రాణాంతక వ్యాధి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ఆ తరువాత దాన్ని అధిగమించి ఆల్ రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. భారత జట్టుకు టైటిల్ దక్కడంలో కీలక పాత్ర పోషించాడు. ఇక 2019లో యువరాజ్ రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక భారత జట్టు ని 2011లో వరల్డ్ కప్ విజేతగా నిలిపిన కోచ్ గ్యారీ క్రిస్టన్.. ప్రస్తుతం పాకిస్తాన్ కి ప్రధాన కోచ్ గా వ్యవహరిస్తున్నాడు.