
ఆసిస్ తో టీ 20 సిరీస్ లో భాగంగా గౌహతిలో జరిగిన మ్యాచ్ లో 222 పరుగుల భారీ స్కోరుని కూడా టీమ్ ఇండియా కాపాడుకోలేకపోయిందనే విమర్శలు నెట్టింట వినిపిస్తున్నాయి. కొండంత స్కోరుని కూడా మ్యాక్స్ వెల్ పిండి కింద చేసేశాడని అంటున్నారు. ఒక దశలో 18 బంతులకి ఆసిస్ 49 పరుగులు చేయాల్సిన పరిస్థితి నుంచి క్రమేణా మ్యాచ్ చేజారిపోవడం దురదృష్టమని చెప్పాలి.
మ్యాచ్ లోకి వస్తే 18వ ఓవర్ ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ చేశాడు. ఈ ఓవర్ లో ఆరు పరుగులు మాత్రమే వచ్చాయి. వేడ్ ఇచ్చిన కష్టమైన క్యాచ్ సూర్య వదిలేశాడు. బాల్ 130 కిమీ వేగంతో వెళ్లడం వల్ల చేతిలోంచి ఎగిరి పడిందని అంటున్నారు. ఏం జరిగినా అది దొరికి ఉంటే పరిస్థితి భారత్ అదుపులోనికి వచ్చేదని చెబుతున్నారు.
19వ ఓవర్ అక్షర్ పటేల్ కి ఇచ్చాడు. ఇందులో అనవసరంగా 11 పరుగులు వచ్చాయి. ఒకటి వేడ్ క్రీజులో లేకపోవడంతో ఇషాన్ కిషన్ స్టంప్ అవుట్ చేశాడు. అయితే అది రీప్లేలో ఏమైందంటే బాల్ ని వికెట్ల వెనకి వరకు రాకుండా ముందునే ఇషాన్ పట్టేశాడు. స్టంప్ అవుట్ చేసేశాడు.. దాంతో దానిని నో బాల్ గా ప్రకటించారు.
కీపర్ ఎప్పుడు కూడా వికెట్ల వెనక్కి వెళ్లిన తర్వాతే బాల్ ని పట్టాలి. ఆ తర్వాతే అవుట్ చేయాలి. దీనిని అతిక్రమించినందుకు అది నోబాల్ వచ్చింది. అలా ఒక పరుగు, దాంతో వేసిన నో బాల్ ని.. వేడ్ ఒక సిక్స్ కొట్టాడు. ఒకవేళ తను అప్పీల్ చేయకపోయినా నో బాల్ కింద ప్రకటించేవారు కాదు. అలా ఏడు పరుగులు పోయాయి. ఇక ఆఖరి బాల్ కీపింగ్ మిస్టేక్ తో వదిలేశాడు. అలా 4 పరుగులు వచ్చాయి.
మొత్తం 11 పరుగులు అలా వచ్చి, ఆ ఒక్క ఓవర్ లో 21 పరుగులు చేశారు. దాంతో 20 ఓవర్ కి వచ్చేసరికి 17 పరుగులు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ కి వచ్చాడు. 18వ ఓవర్ లో ఆరు పరుగులు మాత్రమే ఇచ్చిన ప్రసిద్ధ్ కృష్ణ ఆఖరి ఓవర్ లో 19 పరుగులు ఇచ్చాడు. దాంతో టీమ్ ఇండియా ఆఖరి బాల్ దగ్గర బోల్తా పడింది. ఆసిస్ కి తాంబూలంలో పెట్టి విజయాన్ని అందించింది.
డిసెంబర్ ఒకటో తారీఖున నాగ్ పూర్ లో జరిగే నాలుగో టీ 20 మ్యాచ్ లో నైనా గెలిచి సిరీస్ దక్కించుకుంటారని భారత అభిమానులు ఆశిస్తున్నారు. వన్డే ప్రపంచకప్ ఓటమి నుంచి సగటు క్రికెట్ అభిమానికి ఉపశమనం కలిగిస్తారని ఆశిద్దాం.