Nitish Kumar century: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగవ (బాక్సింగ్ డే) టెస్ట్ లో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి చరిత్ర సృష్టించాడు. టాపర్డర్ బ్యాటర్లంతా విఫలమైన చోట అద్భుత శతకంతో రాణించి జట్టును పోటీలో నిలిపాడు. కంగారు బౌలర్లను కంగారెత్తించి సూపర్ సెంచరీతో అదరగొట్టాడు. ఈ బాక్సింగ్ డే టెస్టులోని మూడవరోజు వర్షం కారణంగా ఆట కాసేపు నిలిచిపోయింది.
Also Read: Pro Kabaddi Final: ఫైనల్ బరిలో పట్నా, హరియాణా..టైమింగ్స్, ఫ్రీగా ఎలా చూడాలంటే !
ఆట నిలిచే సమయానికి భారత జట్టు 7 వికెట్లు కోల్పోయి 326 పరుగులు చేసింది. ఆ సమయంలో నితీష్ (85 ), వాషింగ్టన్ సుందర్ (40) క్రీజ్ లో ఉన్నారు. ఇక వర్షం నిలిచిపోయిన తరువాత భారత ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ స్ఫూర్తిదాయక ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. నితీష్ కుమార్ రెడ్డితో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో టెస్టుల్లో నాలుగవ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం నితీష్ కుమార్ రెడ్డి కూడా తన సూపర్ సెంచరీ తో టీమ్ ఇండియాని రేసులోకి తీసుకువచ్చాడు.
అరంగేట్ర సిరీస్ లోనే నితీష్ సెంచరీ చేయడం విశేషం. వరల్డ్ క్లాస్ బౌలర్లను సైతం ధీటుగా ఎదుర్కొంటూ అద్భుతమైన షాట్లతో అలరించాడు. గత మూడు టెస్ట్ మ్యాచ్ లలో నితీష్ వరుసగా 41, 38, 42 42 16 పరుగులు చేసి ఐదుసార్లు ఆఫ్ సెంచరీ చేసే అవకాశాలను చేజార్చుకున్నాడు. కానీ ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ లోని తొలి ఇన్నింగ్స్ లో ఎనిమిదవ స్థానంలో బరిలోకి దిగిన నితీష్ తనదైన శైలిలో పరుగులు చేస్తూ సెంచరీ సాధించాడు.
అంతేకాదు ఎనిమిదవ స్థానంలో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ గా నితీష్ రికార్డ్ సృష్టించాడు. అంతేకాదు సెంచరీ చేసిన తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమాలోని పుష్ప ట్రేడ్ మార్క్ స్టైల్ లో సంబరాలు చేసుకున్నాడు. అయితే ఆస్ట్రేలియా సిరీస్ లో నితీష్ కుమార్ రెడ్డి పై మాజీ సెలెక్టర్ (ఎమ్మెస్కే ) విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే.
బాక్సింగ్ డే టెస్టులో ఓపెనర్ శుభమన్ గిల్ ని పక్కన పెట్టి పూర్తి బౌలర్ లేదా బ్యాటర్ కానీ నితీష్ కుమార్ రెడ్డి పై నమ్మకం ఉంచడం ఏమిటని ఎమ్మెస్కే విమర్శించారు. కానీ నేడు నితీష్ తన ప్రదర్శనతో ఎమ్మెస్కే కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చారని సోషల్ మీడియా వేదికగా మాజీ సెలెక్టర్ పై కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. సీనియర్ ఆటగాళ్లు విఫలమైన చోట నితీష్ కుమార్ రెడ్డి పరువు నిలబెట్టాడని, ఎవరిని తక్కువ చేయొద్దని హితవు పలుకుతున్నారు.
Also Read: IND vs AUS: మైదానంలో కండోమ్ బెలూన్ కలకలం.. వీడియో వైరల్
2024 ఐపీఎల్ సీజన్ లో సన్రైజర్స్ హైదరాబాద్ తరుపున సత్తా చాటిన ఈ విశాఖ కుర్రాడు టి-20 ల ద్వారా టీమిండియా తరఫున అంతర్జాతీయ క్రికెట్ లో అడుగు పెట్టాడు. అలా పొట్టి ఫార్మాట్లలో సత్తా చాటి.. అనతికాలంలోనే టెస్ట్ జట్టులోను చోటు సంపాదించాడు. ఇప్పుడు ఏకంగా ఆస్ట్రేలియా వంటి జట్టుతో జరిగే సిరీస్ కి ఎంపిక కావడమే కాక సెంచరీ చేసి తనకు వచ్చిన అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నాడు. ఇక ప్రస్తుతం 358 పరుగులు చేసిన భారత జట్టు 9 వికెట్లు కోల్పోయింది. నితీష్ కుమార్ (105*), మహమ్మద్ సిరాజ్ (2*) పరుగులతో క్రీజ్ లో ఉన్నారు. భారత్ ఇంకా 116 పరుగులు వెనకబడి ఉంది. వరుణుడు మరోసారి ఆటకి అంతరాయం కలిగించాడు.